Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉగాది పండుగ వచ్చిందంటే మన తెలుగువారి ఇంట ఒకటే సందడి. ప్రతి ఇంటా ఉగాది పచ్చడితో పాటు పిండి వంటల ఘుమఘుమలు. జీవితంలోకి కష్టసుఖాలు షడ్రుచుల వంటివనీ, ఉప్పు, పులుపు, కారం, తీపి, చేదు, వగరు మున్నగు ఆరు రుచుల్ని ఒక్కసారే సేవ్సిఏ్త జీవితంలో కష్టసుఖాలు కూడా ఉగాది పచ్చడి అంత సురిచికరంగా సౌకర్యవంతంగా మారి మన జీవన మనుగడకు దోహదం చేస్తాయని ఒక నమ్మకం.
ఉగాది పచ్చడి
కావల్సిన పదార్థాలు: వేపపువ్వు - ఒక స్పూను, చిరుకుముక్క - చిన్నది, కొబ్బరి - చిన్న ముక్క, అరటి పళ్ళు - ఆరు, చింతపండు - నిమ్మకాయంత, మామిడికాయ - చిన్నది, బెల్లం - వంద గ్రాములు, పచ్చిమిర్చి - ఒకటి, ఉప్పు - చిటికెడు, ఏలకులు - రెండు, నీరు - రెండు గ్లాసులు.
తయారు చేసే విధానం: ముందుగా చెరకు, కొబ్బరి, బెల్లం, పచ్చిమిర్చి, మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని విడివిడిగా జాగ్రత్తగా పెట్టాలి. వేప పువ్వును శుభ్రం పరిచి రేకల్ని మాత్రం పక్కన ఉంచుకోవాలి. ఏలకులు మెత్తగా చేసి పెట్టాలి. రెండు గ్లాసుల నీళ్ళల్లో చింతపండు బాగా పిసికి, పులుపు నీళ్ళను ఒక గిన్నెలోనకి వడగట్టాలి. అందులో బెల్లం వేసి బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత అరటిపళ్ళను బాగా ముద్ద చేసి ఆ నీళ్ళలో కలపాలి. ఎక్కడా అరటిపండు ముక్కలు ఉండకూడదు. అందులో చిటికెడు ఉప్పు, ఏలకల పొడి, చెరకు, కొబ్బరి, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలపాలి. అంతే ఉగాది పచ్చడి రెడీ.
మామిడికాయ చిత్రాన్నం
కావల్సిన పదార్థాలు: అన్నం - కప్పు, తురుమిన మామిడికాయ - ఒకటి, పచ్చిమిర్చి - పది, పసుపు - చిటికెడు, పల్లీలు - అర కప్పు, కొత్తిమిర - కట్ట, తురిమిన పచ్చి కొబ్బరి - కప్పు, ఎండబెట్టిన మెంతి ఆకు - ఒక టీస్పూను, ఉప్పు తగినంత.
తయారీ విధానం: ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో పచ్చి మిర్చి, ఇంగువ, పసుపు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మరో బాణాలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, పల్లీలు వేసి రెండు నుండి మూడు నిమిషాలు వేయించాలి. ఇందులో మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ వేసి, ఆపై కొద్దిగా కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర, మేథి పౌడర్ వేసి, అందులో ఉడికించిన అన్నం, తురిమిన పచ్చి మామిడి తురుమును వేసి బాగా కలపండి. మామిడికాయ పుల్లగా ఉంటే అందులో ఒక టీస్పూన్ చక్కెరను కూడా కలపొచ్చు. ఇందులో తురిమిన కొబ్బరి, ఉప్పు వేసి అన్ని పదార్థాలను బాగా వేయించాలి. అంతే మామిడికాయ చిత్రాన్నం రెడీ.
సెనగపప్పు చారు
కావాల్సిన పదార్థాలు: సెనగపప్పు - అరకప్పు, సెనగపప్పును ఉడికించిన నీళ్లు, ఉప్పు - తగినంత, చింతపండు - కొద్దిగా, కారం - చెంచా, ధనియాల పొడి - చెంచా, పసుపు - చెంచా, ఇంగువ - చిటికెడు, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిగడ్డ - ఒకటి, కొబ్బరి తురుము - రెండు చెంచాలు, నీళ్లు - తగినన్ని, తాలింపు కోసం: నూనె - చెంచా, ఆవాలు - అరచెంచా, జీలకర్ర - అరచెంచా, కరివేపాకు - కొద్దిగా.
తయారు చేసే విధానం: చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సెనగపప్పుని ఉడికించుకొని నీటిని తీసి పక్కనపెట్టుకోవాలి. కప్పు సెనగప్పు నీళ్ళలో కప్పులో మూడోవంతు సెనగప్పు కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, ధనియాల కారం, ఇంగువ వేసి మరిగించుకోవాలి. ఒక పాత్రలో కొద్దిగా నూనె పోసి ఇందులో తాలింపు గింజలు వేసుకొని అందులో ముందుగా మిగుల్చుకున్న రసం వేయాలి. ఒక్క మరుగు వచ్చిన తర్వాత కొత్తిమీర, కొబ్బరి పొడి వేసి దించాలి. అంతే.
కొబ్బరి లడ్డులు
కావాల్సిన పదార్థాలు: మిల్క్ మెయిడ్ లేదా కండెన్స్డ్ పాలు - కప్పు, కొబ్బరి కోరు - రెండు కప్పులు, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్ మిస్) - మూడు చెంచాలు, ఇలాచి పొడి - చెంచా.
తయారు చేసే విధానం: ముందుగా నాన్ స్టిక్ పాన్‌లో కొబ్బరి కోరుని రెండు నిమిషాలు పాటు వేయించుకోవాలి. ఇందులోనే కండెన్స్డ్ పాలు, డ్రై ఫ్రూట్స్, ఇలాచి పొడి వేసి బాగా కలిపి దగ్గరకు రానివ్వాలి. ఒక పళ్లెంలోకి తీసుకుని చల్లారిన తర్వాత లడ్డుల్లాగా చుట్టుకోవాలి.