Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. ఒకవేళ నిద్ర పోదామని బెడ్ ఎక్కినా తొందరగా నిద్ర రాదు. ఏం చేయాలో తోచదు. మరోవైపు ఉదయం కావొస్తుంది. మళ్లీ ఆఫీసులకు, పాఠశాలలకు, కాలేజీలకు పరుగులు తీయాలి. ఇక గృహిణులకైతే అందరి కంటే ముందే లేవాల్సి ఉంటుంది. వారికి నిద్ర పట్టక పోతే కష్టం. ఉద్యోగులదీ అదే తీరు. పిల్లలైతే పాఠశాలల్లో, కళాశాలల్లో నిద్రపోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది. పడుకోగానే నిద్ర ఎందుకు రావట్లేదు. దీనినే నిద్రలేమి సమస్య అంటారు. అయితే నిద్ర రావాలంటే ఎలాంటి పద్దతులు ఫాలో అవ్వాలి ఇపుడు తెలుసుకుందాం. ..
ఏం చేయాలి: సాయంత్రం సమయాల్లో భోజనం కాస్త తగ్గించుకుంటే మంచిది. కెఫిన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. అలాగే ఎక్కువ కారంగా భోజనం చేయడం వల్ల అజీర్ణం వల్ల అసౌకర్యం కలుగుతుంది. అది నిద్రపోవటాన్ని కష్టంగా చేస్తుంది. నిద్రకు ముందు రెండు, మూడు గంటలు ముందు ఎక్కువ భోజనం తినొద్దు. ఒకవేళ ఆకలితో ఉంటే నిద్రపోవడానికి 45 నిమిషాల ముందు తేలిక పాటి చిరుతిండిని ప్రయత్నించండి. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది.
మనం తాగే టీ లేదా కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో కేంద్ర నాడీ వ్యవస్థ (సీఎన్ఎఫ్)లో అడెసినోసిన్ రిసెప్టార్స్ లేదా పీ1 రిసెప్టార్స్ అని పిలిచే న్యూరోమాడ్యులేటర్ మనకు నిద్ర కలిగించడానికి కారణం అవుతుంది. పీ1 రిసెప్టార్స్ పై ఈ కెఫిన్ ప్రభావం చూపి అడెసినోసిన్ను అడ్డుకుంటుంది. అందువల్ల కాఫీ తాగిన తర్వాత మనకు నిద్ర రాదు. కాబట్టి నిద్రకు ముందు కాఫీ తీసుకోకూడదు.
నిద్రలేమి సమస్యకు పరిష్కరాలు: కాఫీ లేదా టీ ప్రతి రోజూ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మన కేంద్రీనాడీ వ్యవస్థ పై అధిక ప్రభావం చూపి నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. అదేవిధంగా విపరీతమైన తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే కాఫీ, టీ లను మితంగా తీసుకోవడం వల్ల ఎంతో చురుగ్గా మన పనులను మనం చేసుకోగలుగుతాము. కాబట్టి కాఫీ, టీ లను పరిమితంగా తీసుకోవాలి. అంతే కాదు నిద్రలేమి సమస్యకు కూడా ఇది మంచి పరిష్కారం. దానికి బదులు తేనె కలుపుకుని గోరువెచ్చటి పాలు తాగండి. దీంతో హాయిగా నిద్రపడుతుంది.