Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలలు అందరూ కంటారు. కానీ వాటని నిజం చేసుకునే శక్తి, అవకాశం కొందరికే ఉంటుంది. చిన్నతనం నుండి ఎగరాలని కలలు కన్నది. తల్లి ప్రోత్సాహంతో ఆ కలలను నిజం చేసుకుంది. బోయింగ్ 777ని నడిపిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఆమే అన్నీ దివ్య. కలలు కనే వయసు నుండి కమాండర్ అయ్యే వరకు తన ప్రయాణాన్ని ఆమె మనతో ఇలా పంచుకుంటుంది.
'ఆకాశం వైపు చూసినప్పుడల్లా మేఘాలు చాలా ఆసక్తిగా కనిపించేవి. ఎప్పటికైనా వాటిని తాకాలని అనిపించేది. ఎగరాలనే నా కల గురించి మా అమ్మకు చెప్పినప్పుడు ఎగరాలంటే ముందు నేను రెక్కలను సంపాదించుకోవాలని ఆమె నాకు చెప్పింది' అంటుంది కెప్టెన్ అన్నీ దివ్య. పురుషాధిపత్య పరిశ్రమల్లో విమానయానం కూడా ఒకటి. అలాంటి చోట కెప్టెన్ అన్నీ దివ్య బోయింగ్ 777 విమానాన్ని నడిపిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు తెచ్చుకుంది.
పట్టుదలతో కృషి చేస్తే
కలలు నిజం చేసుకోవాలంటే ఆమె మాత్రమే కాదు ఎవరైనా ఆ కలను మర్చిపోకుండా అలాగే పట్టుదలతో కృషి చేస్తే అది చివరికి నిజమవుతుంది. కెప్టెన్ అన్నీ దివ్య ఒకప్పుడు ఆకాశంలో ఎగరాలని కలలు కనే చిన్న పిల్ల. ఈరోజు పైలట్‌గా తన కలను సాకారం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్విన్ జెట్ విమానమైన బోయింగ్ 777ను నడిపింది.
పాఠశాల విద్య తర్వాత
17 సంవత్సరాల వయసులో పాఠశాల విద్య పూర్తి చేసకుంది దివ్య. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని ఫ్లయింగ్ స్కూల్ అయిన ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీలో చేరింది. 19 సంవత్సరాల వయసులో ఆమె ఎయిర్ ఇండియాలో తన వృత్తిని ప్రారంభించింది. 21 సంవత్సరాల వయసులో తన మొదటి బోయింగ్ 777 ను నడిపింది.
లోపల ఉండే వివక్ష
ప్రశంసలు పొందిన పైలట్ అయినప్పటికీ దివ్య తన ప్రయాణంలో వివక్షను చూస్తూనే ఉంది. అది భారతదేశంలోనే కాదు వెలుపల కూడా వివక్షకు సంబంధించిన సందర్భాలను ఎదుర్కోవలసి వచ్చింది. ''మేము దానిని గుర్తించలేము. కానీ భారతదేశం కాకుండా ఇతర దేశాలలో కూడా మహిళల పట్ల వివక్ష తీవ్రంగా ఉంది. నా కో-పైలట్ వేరే దేశానికి చెందిన వ్యక్తి. విమానాలలో మహిళను నేను ఒకదానిలో ఉన్నాను. మహిళలు వంటింట్లోనే ఉండాలని, విమానాలు నడపకూడదని అతను వ్యాఖ్యానించాడు. నేను చెప్పాను 'అది ఎవరైనా సరే వారు ఉత్తమంగా ఏమి చేయగలరో దాని ఆధారంగా ఒక ఉద్యోగాన్ని ఎంచుకోవాలి. వంటగదిలో ఉండటం పట్ల నాకు అభ్యంతరం లేదు. అయితే నేను బాగా ఎగరగలిగితే ఎగురుతూ ఉండాలి. మీకు వంట చేయడంలో మంచి నైపుణ్యం ఉంటే మీరు వంటగదిలో ఉండటానికి ప్రయత్నించండి. బహుశా మీరు అక్కడ మెరుగ్గా ఉంటారు'' అని సమాధానం చెప్పాను.
విమానయాన హోరిజోన్‌ను మార్చడం
విమానయానం ఎక్కువగా పురుష ఆధిపత్యం కలిగి ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలుగా పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుందని దివ్య అంటుంది. ఏవియేషన్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోందని, కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మంది మహిళలు దీన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారని ఆమె జతచేస్తుంది.
మహిళల సంఖ్య పెరిగింది
''మహిళా సాధికారత కార్యక్రమాలు, బాలికల కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కారణంగా భారత పౌర విమానయాన పరిశ్రమలో 14 శాతం మహిళలతో నిండిపోయింది. ప్రపంచ సగటు 4 నుండి 5 శాతంతో పోల్చినప్పుడు ఈ శాతం చాలా ఎక్కువగా ఉంది'' అంటుంది దివ్య.
ప్రపంచానికి దూరంగా ఉన్నాను
వెనుతిరిగి చూసుకుంటే ముందు చెప్పినట్టుగా దివ్య తన పాఠశాల విద్య ముగిసిన వెంటనే తన కలను నిజం చేసుకోవడానికి బయలుదేరింది. ''మీరు యవ్వనంగా, విజయ వంతంగా ఉన్నప్పుడు అనేకమంది పుకార్లను వ్యాప్తి చేస్తారు. మహిళల గురించి చాలా నీచంగా మాట్లాడేవారు కూడా ఉంటారు. ఒకానొక సమయంలో నేను ప్రపంచం నుండి దూరంగా ఉన్నాను. గెట్-టుగెదర్లకు కూడా దూరంగా ఉంటాను. ఫ్లైట్ దిగిన తర్వాత నా గదిలోకి వెళ్ళి ఎవరినీ కలవకుండా ఉంటాను. కానీ తర్వాత కాలంలో అది నా సమస్య కాదని సమాజం సమస్య అని నేను గ్రహించాను. చిన్న వయసులో ఉన్న వ్యక్తి అసమానతలను ఎలా ధైర్యంగా ఎదుర్కొందో, కష్టమైన దశను ఎలా అధిగమించానో తలచుకుంటే నాకు ఇష్టంగా అనిపిస్తుంది'' అంటూ దివ్య గుర్తుచేసుకుంది.
ఏది స్త్రీలను బలపరుస్తుంది
దివ్య ప్రయాణంలో ప్రతి సవాలు ఒక మైలురాయి. యువత నాయకులు, సమయం పట్ల విశ్వాసం కలిగి ఉండాలని, వైఫల్యం, విజయాన్ని కృతజ్ఞతతో అంగీకరించి విజయవంతం కావాలని ఆమె కోరారు. ''కాలం ఎప్పుడూ మారుతుంది. మంచి, చెడు సమయాలు రెండూ గడిచిపోతాయి. చెడు సమయాలలో మీరు ఉత్తమంగా ఏం చేయగలరో అది చేయండి. కానీ మీకు నియంత్రణ లేని విషయాల గురించి చింతించకండి. అవును నేను అంగీకరిస్తున్నాను... మహిళలు ఏ రంగంలోనైనా పురుషుల కంటే ఎక్కువ కష్టపడాలి. ఆ కష్టమే మనల్ని బలపరుస్తుంది. అలాగే కొన్నిసార్లు విఫలం కావడం సహజం. విజయమైనా, వైఫల్యమైనా ఆనందంతో స్వీకరించాలి'' అని ముగించింది.