Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో కరోనా ముప్పు తొలగిపోలేదు చైనా దేశంలో లాక్డౌన్ నడుస్తున్నది. ఇంకా కొన్ని దేశాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమెరికా దేశంలో పిల్లలకు కూడా టీకాలు ఇవ్వడం దాదాపు పూర్తయింది. ఎంత అభివృద్ధి చెందిన దేశమయినా అక్కడా టీకాలు తీసుకోని వాళ్ళున్నారు. వాళ్ళను వెతికి పట్టుకొని టీకా పట్ల అవగాహన కల్పించి వారికి టీకాలిప్పిస్తున్నారు. మనక్కూడా 12 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయసు వారికి ప్రస్తుతం టీకాలిస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలకు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పటికీ కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి. అయితే ఎక్కువగా లేనందున చాలామంది మాస్కులు లేకుండా తిరగటం, భౌతికదూరం పాటించకపోవడం లాంటివి చేస్తున్నారు. కరోనా వైరస్‌ను మశూచి వైరస్‌లా పూర్తిగా ప్రపంచం నుంచి వెళ్ళగొట్టాలి. మా చిన్నతనంలో గోడల మీద పోస్టర్లు ఇలా ఉండేవి ''మశూచి కేసును చూపండి. బహుమతి పొందండి''. పూర్తిగా ఆ వైరస్‌ను తరిమేసినట్టే కరోనా వైరస్‌ను తరిమేయాలి. అప్పటి వరకు ఎవరి జాగ్రత్తలో వారుండాలి. మాస్క్‌లు ధరించటం, భౌతికదూరం పాటించటం వంటికి చేయకపోతే కరోనా వైరస్సే కాకుండా వేరే వైరస్సుల నుంచి కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. క్షేమంగా ఉండండి.
శంకు కాయలతో...
మా ఇంట్లో తెలుపు, వంగ రంగులలో శంకుపూల చెట్లున్నాయి. అదే విధంగా ఒంటిరెక్క, ముద్ద శంకులు కూడా ఉన్నాయి. మన కుండీలో కొద్దిగా చోటిస్తే ఇల్లంతా ఆక్రమించేస్తుంది. పక్కనున్న కుండీల్లోని చెట్లను అల్లేసుకుంటుంది. తీగల నిండా పూలు పూస్తుంది. చిక్కుడు కాయల్లా శంకు కాయలు కాస్తాయి. పచ్చిగా ఉన్నపుడు అచ్చం చిక్కుడు కాయల్లానే ఉంటాయి. ఎండాక గడ్డి రంగులోకి మారతాయి. కాయ ఉపరితలం చాలా నున్నగా ఉండటం వల్ల నేను వాటిమీద బొమ్మలు కూడా వేశాను. ఇలాంటి శంకుకాయల్ని ఈరోజు మిడతగా మార్చేశాను. పొలాల్లోని పైర్ల మీద కనిపించే మిడతలు ఆకుల్ని తింటుంటాయి. మా కుండీల్లో కూడా కొన్ని మిడతలు చేరి వంగచెట్ల ఆకులన్నీ తినేస్తున్నాయి. ఒక్కొక్కసారి మిడతల దండు మాదిరిగా వచ్చి పొలాలను నాశనం చేసి వెళుతుంటాయి. ఈ మిడతలు 'ఇన్సెక్టా' విభాగానికి 'సీలిఫెరా' ఉపక్రమానికి చెందినటువంటి కీటకాలు. ఇవి చాలా పురాతన కాలానికి చెందిన కీటకాలు. 250 మిలియన్ల సంవత్సరాల కిందటి తొలి ట్రయాసిక్ యుగం నాటి పురాతన కీటకాలు. ఈ మిడతలను చిత్రకళలో కూడా ఉపయోగించారు. లండన్ లోని నేషనల్ గాలరీలోని 'రాచెల్ రైచ్' గీసిన పువ్వుల చిత్రంలో మిడతను కూడా చిత్రించాడు.
కందిపప్పుతో...
భారతీయుల ఆహారంలో కందులు ప్రధానమైనవి. ఇది నవధాన్యాలలో కూడా ఒకటి. మన భారతదేశంలో 3,500 సంవత్సరాల కిందట నుండి ఈ కందుల చెట్లను పెంచుతున్నారు. భారత ఉప ఖండంలో వరి తర్వాత స్థానం కందిపప్పుదే. అన్నంతో పాటు పప్పు తినడం ప్రధాన ఆహారం. దీని శాస్త్రీయనామం ''కజానస్ కజాన్''. కంది చెట్లు 'ఫాబేసి' కుటుంబానికి చెందినవి. ఒక్కొక్క కాయలో ఐదారు విత్తనాలుంటాయి. పచ్చిగా ఉన్ననప్పుడు కూడా తినటానికి రుచిగా ఉంటాయి. వంద గ్రాముల కందిపప్పును తీసుకుంటే 343 గ్రాముల కాలరీల శక్తి లభిస్తుంది. ఈ కందిపప్పును మిడతగా మార్చేశాను. మిడతలు నేలను తవ్వగలిగే శక్తి ఉన్న కీటకాలు. వీటి వెనక కాళ్ళు బలంగా ఉంటాయి. వీటి లార్వాలను 'నింఫ్' అంటారు. ఇవి గుడ్లను పెడతాయి. గుడ్లు పగిలి లార్వాగా మారతాయి. అన్ని కీటకాల వలెనె గుడ్డు, లార్వా, ప్యూపా, ప్రౌఢజీవి అనే నాలుగు దశలుంటాయి. ఇవి కూడా ఈగలకున్నట్టుగా కాంపౌండ్ కళ్ళను కలిగి ఉంటాయి. శరీరం ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. మెడ భాగంలో ఉండే 'టింపానల్ ఆర్గాన్' ద్వారా బయటి శబ్దాలను వినగలుగుతుంది. కొన్ని మిడతలు వాతావరణంలోని పరిస్థితుల కనుగుణంగా రంగు, అలవాట్లు మార్చుకుంటాయి. ఇటువంటి వాటిని 'లోకస్ట్'లు అంటారు.
వెంటిలేటర్ వేస్టుతో...
వెంటి లేటర్లలో వాడే ప్లాస్టిక్ పదార్థాల వ్యర్థాలను ఉపయోగించి మిడతను చేశాను. వెంటిలేటర్లు అంటే ఆసుపత్రులలో క్లిష్ట పరిస్థితుల్లో సీరియస్‌గా ఉండే పేషెంట్లను ఉంచే మిషీన్లు. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ మెషీన్ల గురించి తెలియని ప్రజలు లేకుండా పోయారు. ఇది తెల్లగా గుండీల వంటి ఆకారంలో ఉంటాయి. వీటితో తెల్లని మిడతను చేశాను. మిడతలను సినిమా కళలలోనూ ఉపయోగించారు. 1957లో తీసిన 'బిగినింగ్ ఆఫ్ ద ఎండ్' అనే సినిమాలో పెద్ద పెద్ద మిడతలు చికాగో నగరం మీద దాడి చేసినట్టుగా చూపించారు. డచ్ చిత్రకారుడైన 'బాల్తసార్ వాండర్ ఆస్ట్' వేసిన స్టిల్ లైఫ్ పెయింటింగ్‌తో మిడతలను చిత్రించాడు. మేమూ డిగ్రీ చదివేటపుడు మిడతల్ని జువాలజీ ల్యాబ్‌లో డిసెక్షన్ చేశాము. డిసెక్షన్ చేయటం నేర్చుకున్నాం కాబట్టి వాటి బొమ్మల్ని రికార్డుల్లో గీశాము. మిడతల లార్వాల గురించి వివరంగా ఎమ్మెస్సీలో చదివాము. మిడత ప్రత్యుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థలను డిసెక్షన్ చేసినట్టుగా గుర్తుంది.
పారిజాత విత్తనాలతో...
ఆకుపచ్చని బిళ్ళల్లాంటి పారిజాత చెట్టు విత్తనాలను ఎండబెడితే ముదురు గోధుమ రంగు లేదా కాఫీ రంగులోకి మారాయి. నేనా విత్తనాలను ఉపయోగించి మిడతను తయారు చేశాను. మనం జాతకరత్న మిడతం భొట్లు అన్న కథలు చిన్నప్పుడు చాలా వినే వాళ్ళం. హరికథలు చెప్పేవాళ్ళు ఈ కథను బాగా చెప్పేవాళ్ళు. లోపల అట్లు పోస్తుంటే సురు, సురు అనే శబ్దాలు విని ఎన్ని అట్లు పోశారో చెప్పటం వల్ల మిడతం భొట్లుకు దివ్య దృష్టి ఉన్న మహానుభావుడని ప్రజలు అనుకునే వాళ్ళు. ఒక తెలివి తక్కువ వాడు చేసిన ఏదో పనుల వల్ల కాలం కలిసి వచ్చి గొప్పవాడుగా పేరు పొందే క్రమం మనకు నవ్వు తెప్పిస్తుంది.
చింతగింజలతో...
నల్లని చింతగింజలతో మిడత తయారైంది. మిడతలకు తలలో కింది భాగాన నోరు ఉంటుంది. తల మీద దారప్పోగుల వంటి యాంటిన్నాలు రెండు ఉంటాయి. మూడు జతల కాళ్ళు, రెండు జతల రెక్కల్ని మిడతలు కలిగుంటాయి. గోటి దగ్గర ముళ్ళ వంటి నిర్మాణాలు రెండు వరసల్లో ఉంటాయి. వీటితోనే ఇవి ఆకుల్ని చకచకా తినేస్తాయి. దీని ఉదరం పదకొండు ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. ఆడ మిడతలు, మగ మిడతల కన్నా ఆకారంలో పెద్దవిగా ఉంటాయి. దీని కాళ్ళను ఒక దానికొకటి రుద్దుకోవడం వలన శబ్దం వస్తుంది. మిడతలను చీమలు, రాబర్ఫ్లైస్, సాలి పురుగులు, పక్షులు, చిన్న చిన్న క్షీరదాలు తింటాయి. ఇవి గుడ్లుగా ఉన్నపుడు గ్రౌండ్ బీటిల్స్, బీఫ్లైస్, బ్లిస్టర్ బీటిల్స్ వంటివి తినేస్తాయి. మిడతల్లో ''పారాగోర్టియస్ ట్రై కస్పిడేటస్, స్పైనో కార్డోడ్స్ టెలినీ అనే రెండు జాతలు పారాసైట్లుగా జీవితం సాగిస్తాయి. బాక్టీరియా, వైరస్, ఆర్గి, ఫంగి వంటి వాటి వల్ల మిడతలకు జబ్బులు వస్తాయి. కొన్ని దేశాలలో మిడతలను కొన్ని సంస్థలకు చిహ్నాలుగా వాడతారు. మెక్సికో వంటి దేశాలలో వీటిని ఆహారంగా తింటారు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్