Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంజాన్ సీజన్ వచ్చేసింది. రంజాన్ నెల ప్రారంభం నుంచి రంజాన పండగ వరకు ఉపవాసాలు ఉంటారు. అయితే రంజాన్ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హలీం. మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే వంటకం ఇది. ఎందుకంటే ఇది రంజాన్ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుంది. హైదరాబాద్‌లో గల్లీగల్లీన హలీం బట్టీలు కనిపిస్తాయి. సాయంత్రం వేళల్లో ఘుమఘుమలాడుతూ.. పొగలే కక్కు హలీంను తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. రంజాన్ సీజన్లో ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ హలీంను చాలా మంది మార్కెట్లో కొనుక్కొని తింటారు. కానీ దీనిని ఇంట్లో కూడా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన రకరకాల హలీంను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
మటన్ హలీమ్
కావాల్సిన పదార్థాలు: మటన్ - అర కేజీ, గోధుమరవ్వ - పావు కేజీ, నెయ్యి - వంద గ్రా., ఉల్లిగడ్డ - యాభై గ్రా., పచ్చిమిర్చి - ఆరు, మిరియాలు - పది గ్రా., కరివేపాకు - రెండు రెమ్మలు, షాజీరా - పది గ్రా., దాల్చినచెక్క - పది గ్రా., బిర్యానీ ఆకు - నాలుగు, నిమ్మకాయ - ఒకటి, జీడిపప్పు : యాభై గ్రా., కారం - నాలుగు టీస్పూన్స్, ఇలాయిచీ పొడి - అర టీస్పూన్ , పసుపు - పావు టీస్పూన్, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం: ముందుగా గోధుమ రవ్వని అరగంటపాటు నీటిలో నానబెట్టాలి. మటన్‌ని బాగా కడిగి పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి వేసి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టాలి. పెద్ద గిన్నెలో నెయ్యి పోయాలి. దీంట్లో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగాక ఇందులో ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి. కాసేపటి తర్వాత నానబెట్టిన రవ్వ, జీడిపప్పు వేసి తగినంత నీళ్లు పోస్తూ రవ్వ ఉడికేవరకు బాగా కలుపుతూ ఉండాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి కలుపుతుండాలి. బాగా ఉడికిందనుకున్న తర్వాత దించేయాలి. కాసేపు చల్లారనిచ్చి ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరో గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, రుబ్బుకున్న మటన్ మిశ్రమం వేయాలి. కాసేపు అలాగే ఉంచి నిమ్మరసం, ఇలాయిచీ పొడి వేసి దించుకోవాలి. పైన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్తో గార్నిష్ చేసి తినడమే.
ఫిష్ హలీమ్
కావాల్సిన పదార్థాలు: చేపలు - అర కేజీ, గోధుమరవ్వ - పావుకేజీ, నెయ్యి : వంద గ్రా., ఉల్లిగడ్డ - యాభై గ్రా., పచ్చిమిర్చి - ఆరు, మిరియాలు - పది గ్రా., కరివేపాకు - రెండు రెమ్మలు, షాజీరా - పది గ్రా., దాల్చినచెక్క - పది గ్రా., బిర్యానీ ఆకు - నాలుగు, నిమ్మకాయ : ఒకటి, జీడిపప్పు : యాభై గ్రా., కారం - నాలుగు టీస్పూన్స్, ఇలాయిచీ పొడి - అర టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం: రవ్వను అరగంట పాటు నీటిలో వేసి నానబెట్టాలి. చేపలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీంట్లో పసుపు, కారం, ఉప్పు, వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఒక గిన్నెలో నెయ్యి పోసి వేడి చేసి అందులో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి వేయించాలి. ఇందులో చేప ముక్కలను వేసి కలుపుతూ ఉండాలి. దీంట్లోనే నానబెట్టిన రవ్వ, జీడిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోస్తూ రవ్వ ఉడికేవరకు బాగా కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు ఉప్పు, కారం వేసి మరికాసేపు ఉడికించాలి. దీన్ని దించేసి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో నెయ్యి పోసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి దోరగా వేయించాలి. చేపల మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపాలి. నిమ్మరసం, ఇలాయిచీ పొడి వేసి దించేయాలి. చివరగా కొత్తిమీర, పుదీనా అందంగా గార్నిష్ చేయాలి. వేడివేడిగా లాగిస్తే టేస్టీగా ఉంటుంది.
రొయ్యల హలీమ్
కావాల్సిన పదార్థాలు: రొయ్యలు - అరకేజీ, గోధుమరవ్వ - పావుకేజీ, నెయ్యి - వంద గ్రాములు, ఉల్లిగడ్డ - యాభై గ్రాములు, పచ్చిమిర్చి - ఆరు, మిరియాలు - పది గ్రాములు, కరివేపాకు - రెండు రెమ్మలు, షాజీరా - పది గ్రాములు, దాల్చినచెక్క - పది గ్రాములు, బిర్యానీ ఆకు - నాలుగు, నిమ్మకాయ - ఒకటి, జీడిపప్పు - యాభై గ్రాములు, కారం - నాలుగు టీస్పూన్స్, ఇలాయిచీ పొడి - అర టీస్పూను, పసుపు - పావు టీస్పూన్, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం: రవ్వను అరగంట పాటు నానబెట్టాలి. రొయ్యలను బాగా కడిగి ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసి మారినేట్ చేయాలి. మందపాటి గిన్నెలో నెయ్యి పోసి షాజీరా, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు మారినేట్ చేసిన రొయ్యలు వేసి బాగా కలుపుతుండాలి. కాసేపు అలాగే ఉంచి నానబెట్టిన రవ్వ వేసుకొని కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి కాసేపు ఉంచి దించేయాలి. చల్లారాక దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ దోరగా వేయించాలి. ఇవి వేగాక రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపాలి. పావుగంట పాటు ఇలా చేసి నిమ్మరసం, ఇలాయిచీ పొడి కలిపి దించేయాలి. కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు పై నుంచి వేయాలి. దీన్ని వేడిగా తింటేనే టేస్టీగా ఉంటుంది.
చికెన్ హలీమ్
కావాల్సిన పదార్థాలు: చికెన్ - అర కేజీ, గోధుమరవ్వ - పావుకేజీ, నెయ్యి - వంద గ్రాములు, ఉల్లిగడ్డ - యాభై గ్రాములు, పచ్చిమిర్చి - ఆరు, మిరియాలు - వంద గ్రాములు, కరివేపాకు - రెండు రెమ్మలు, షాజీరా - పది గ్రాములు, దాల్చినచెక్క - పది గ్రాములు, బిర్యానీ ఆకు - నాలుగు, నిమ్మకాయ - ఒకటి, జీడిపప్పు - యాభై గ్రాములు, కారం - నాలుగు టీస్పూన్లు, ఇలాయిచీ పొడి - అర టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం: చికెన్‌ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి ఉంచాలి. రవ్వలో నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. దీంట్లో చికెన్ ముక్కలు వేసి కలపాలి. కాసేపటి తర్వాత నానబెట్టిన గోధుమ రవ్వ వేసి జీడిపప్పు, తగినన్ని నీళ్లు పోస్తూ రవ్వ ఉడికే వరకూ బాగా కలుపుతుండాలి. రవ్వ, చికెన్ బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి మరికాసేపు కలుపాలి. బాగా ఉడికిందనుకున్న తర్వాత దించేయాలి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. మరొక గిన్నెలో నెయ్యి పోసి పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, ఉల్లిగడ్డ వేసి వేగాక రుబ్బిన చికెన్ మిశ్రమాన్ని వేసి మళ్లీ కలుపుతుండాలి. సన్నని మంట మీద కాసేపు ఉంచి నిమ్మరసం, ఇలాయిచీ పొడి వేసి దించుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డతో అలంకరించి వేడివేడిగా తింటుంటే సూపర్ టేస్ట్.
వెజ్ హలీమ్
కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు - యాభై గ్రాములు, బీన్స్ - యాభై గ్రాములు, క్యారెట్ - యాభై గ్రాములు, బేబీకార్న్ - యాభై గ్రాములు, గోధుమ రవ్వ - పావుకేజీ, నెయ్యి - వంద గ్రాములు, ఉల్లిగడ్డ - యాభై గ్రాములు, పచ్చిమిర్చి - ఆరు, మిరియాలు - పది గ్రాములు, కరివేపాకు - రెండు రెమ్మలు, షాజీరా - పది గ్రాములు, జీడిపప్పు - యాభై గ్రాములు, పాలు - అర లీటరు, నిమ్మకాయ - ఒకటి, దాల్చినచెక్క - పది గ్రాములు, బిర్యానీ ఆకు - రెండు, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, పసుపు - పావు టీస్పూన్, కారం - అర కప్పు, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: గోధుమ రవ్వను అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. పచ్చిమిర్చి, బేబీకార్న్, క్యారెట్, బీన్స్‌లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో నెయ్యి పోసి దీంట్లో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకొన్న క్యారెట్, బీన్స్, బేబీకార్న్, ఆలూ, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, జీడిపప్పు, పుదీనా వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన రవ్వని వేసి పాలు పోయాలి. బాగా ఉడికిందనుకున్న తర్వాత దించేయాలి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. మరొక గిన్నెలో నెయ్యి పోసి పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, ఉల్లిగడ్డ వేసి వేగాక రుబ్బిన మిశ్రమాన్ని వేసి మళ్లీ కలుపుతుండాలి. సన్నని మంట మీద కాసేపు ఉంచి నిమ్మరసం, ఇలాయిచీ పొడి వేసి దించుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డతో అలంకరిస్తే వేడివేడిగా వెజ్ హలీమ్ రెడీ.