Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని వ్యాధులు పుట్టాక, పెరిగి పెద్దయ్యాక వస్తాయి. కొన్ని వ్యాధులు పుట్టుకతోనే వస్తాయి. గుండె జబ్బులు వంటి కొన్ని శారీరక లోపాలు పుట్టకతోనే కొందరికి వస్తాయి. అదే విధంగా కొన్ని మానసిక సమస్యలు కూడా పుట్టుకతోనే కొందరికి వస్తాయి. అటువంటి మానసిక సమస్యలలో 'ఆటిజం' అనే వ్యాధి కూడా ఒకటి. ఈ వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి పూనుకుంది. ఇటీవలె ఏప్రిల్ 2వ తేదీనాడు ''ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే'' కూడా జరుపుకున్నాం. మానవ శరీరంలోని జన్యు ఉత్పరివర్తనాల ద్వారా ఈ లోపం కలుగుతుంది. ఇది పుట్టుకతో జన్యుపరంగా వంశానుక్రమంగా వచ్చే ఒక మానసిక వ్యాధి. అలాంటి వ్యాధి గురించి, ఆ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మెరుగైన, సంతోషకరమైన ప్రపంచాన్ని అందించేందుకు కృషి చేస్తున్న నలుగురు మహిళల గురించి ఈ రోజు మానవిలో తెలుసుకుందాం.
2011లో 'ఆటిజం' అనే పదం తొలిసారిగా ప్రయోగించబడింది. మానసిక వైద్యుడైన ''యూజెన్ బ్యూలర్'' దీన్ని రూపొందించారు. స్క్రిజోఫ్రినియా వ్యాధిలక్షణాల్లోని మరొక సమూహ లక్షణాలను విడదీయటానికి ప్రయత్నించారు. 'బ్యూలర్' దీనికి గ్రీకు పదం ఆటోస్ నుంచి స్వీయ అనే అర్థంతో తీసుకున్నాడు. ఈ స్విస్ వైద్యుడు 'స్వీయమానం' అనే అర్థంతో 1910లోనే దీనికి నిర్వహించినప్పటికీ ఆమోదించటానికి సమయం పట్టింది.
మళ్ళీ మళ్ళీ చేసే ప్రవర్తన
1747 సంవత్సరంలోనే బ్లెయర్ అనే పన్నెండేళ్ళు బాలుడికి ఆటిస్టక్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు. 'గ్రున్యా సుఖరేవా' అనే ఒక సోవియట్ చైల్డ్ సైకియాట్రిస్ట్ ఇలాంటి లక్షణాలున్న జబ్బును గురించి 1925లో రష్యన్ జర్నల్ లోనూ, 1926లో జర్మన్ జర్నల్‌లోనూ వివరించారు. ఆలిజం అనే పదం కన్నెర్ ఆటిజమ్, క్లాసిక్ ఆటిజం అనే పేర్లతో ప్రస్తావించబడుతుంది. ఇదొక ''న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్'. మళ్ళీ మళ్ళీ చేసే ప్రవర్తనల ద్వారా, సామాజిక సంబంధాల సవాళ్ళతో ఈ వ్యాధిని గుర్తించవచ్చని వైద్యనిపుణులు చెపుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన బాలలు సామాజిక ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఉపాధి సమస్యలు, ఉద్యోగాలు పూర్తిగా శూన్యం. ఇంకా వత్తిడిని అనుభవిస్తారు. ఈ పిల్లల శారీరక అభివృద్ధి కాస్త నిదానంగా ఉంటుంది. 2 సంవత్సరాల వయసు తర్వాత కమ్యూనికేషన్, సామాజిక నైపుణ్యాలలో బాగా వెనకబడి ఉంటారు.
బాధితులు పెరుగుతూనే ఉన్నారు
గర్భధారణ సమయంలో జరిగిన ప్రమాదాలు, ఆల్కహాల్, కొకైన్ వంటి మత్తు మందులు తీసుకోవటం, సీసం, పురుగుమందులు వంటి వాయు కాలుష్యాలను పీల్చడం, రుబెల్లా వంటి అంటు వ్యాధులు రావడం వల్లనూ పుట్టే పిల్లల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడవచ్చు. పిండం ఎదుగుదలలో లోపాలు ఏర్పడి ఆటిజం సమస్యగా బయటకు వస్తాయి. మెదడులోని సమాచార ప్రక్రియను ఆటిజమ్ ప్రభావితం చేస్తుంది. వీటిలోని హై ఫంక్షనింగ్ ఆటిజంను ఆస్పర్జర్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అటిజం బాధితులు పెరుగుతూనే ఉన్నారు. 2017 నాటికి ఆటిజంతో బాధపడే పిల్లలు 1.5శాతం మంది ఉన్నట్లుగా లెక్కలు నిర్ధారిస్తున్నాయి. ఈ సమస్య ఆడవారి కంటే మగవారిలో నాలుగు నుండి ఐదురెట్లు ఎక్కువగా వస్తున్నదని నిర్ధారణ అయినది. ప్రస్తుతమున్న జీవన విధానంలో ఈ సమస్య ఇంకా పెరిగి అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చురుకుగా కూడా ఉంటారు
ఆటిజం లక్షణాలను బాల్యంలోనే గమనించవచ్చు. పిల్లలు బోర్లాపడటం, పాకటం, నడవటం, మాట్లాడటం వంటి ఎదుగుదల ప్రక్రియల్లో తీవ్రంగా బలహీనపడతారు. ఒకే విషయాన్ని పదే పదే చర్చిస్తుంటారు. కాళ్ళకు చెప్పులు, బూట్లు తొడుక్కోవడంలోనూ, బూట్ల లేసులు కట్టుకోవడంలోనూ, చొక్కాలకు గుండీలు పెట్టుకోవడంలోనూ ఆటిజం బాధితులు ఇబ్బంది పడతారు. సమాజంలోని వ్యక్తులతో సరిగా సంభాషించడంలోనూ, కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. అదే మరికొన్ని విషయాలలో అత్యంత తెలివి తేటలు ప్రదర్శిస్తారు. కొంతమంది కంప్యూలర్ వాడటంలోనూ, పెయింటింగ్‌లోనూ, ఫోన్ యాప్‌లను వినియోగించటంలోనూ సాధారణ పిల్లల కన్నా మరింత చురుకుగా ఉంటారు. ఈ చిన్న చిన్న లక్షణాల వలన వ్యాధి బాధితులను గుర్తించడం కష్టం. ఆటిస్టిక్ బాధితులు తమ భావోద్వేగాలను ప్రదర్శించడంలో, సామాజిక అవగాహనను ప్రదర్శించడంలో తక్కువగా ఉంటారు. వీరికి కొంత శిక్షణ అవసరం పడుతుంది. స్కూళ్ళలో చదువు నేర్చుకొనడంలోనూ, గణిత సమస్యలు సాధించడంలోనూ వెనకబడి ఉండటం మూలంగా కొద్దిగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అవసరం.
పరిమితం చేయబడిన ఆసక్తులు
ఆటిస్టిక్ వ్యక్తుల ప్రవర్తనలలో అనేక రూపాలు ఉంటాయి. మూస ప్రవర్తనలు, సమానత్వం, ఆచార ప్రవర్తన, కంపల్సివ్ ప్రవర్తనలు, పరిమితం చేయబడిన ఆసక్తులు వంటివి సాధారణంగా ఆటిజం లక్షణాలు. కొంతమంది తమ వేళ్ళతో తమ కళ్ళనే పొడుచుకోవడం, తమ చేతులకు, కాళ్ళకు గాయాలను స్వీయగాయాలను చేసుకుంటారు. జీర్ణాశయ సమస్యలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఇంకా సామాజిక బలహీనతలైన చిరాకు, నిద్ర సమస్యలు, భాషా వైకల్యాలు వంటి మానసిక స్థితులలో మార్పులు కనిపిస్తాయి. ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కూడా అధిక ఒత్తిడి ఉంటుంది. రుబెల్లా వ్యాధికి టీకాలిచ్చినట్లైతే ఆటిజం శాతాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.
తగు జాగ్రత్తలు తీసుకోవాలి
ఆటిజం అని రోగనిర్ధారణ చెయ్యడం సున్నితమైన వ్యవహారం. ఒక శిశువైద్యుడు పిల్లల అభివృద్ధి చరిత్రను తీసుకొని, శారీరకంగా పరిశీలించడం ద్వారా కొంత అవగాహన కలుగుతుంది. మానసిక వైద్యులు ఐక్యూ టెస్ట్ ద్వారా, కొన్ని ప్రమాణిక సాధనాల ద్వారా రోగనిర్ధారణను చేస్తారు. రోగ నిర్ధారణ జరిగాక తల్లిదండ్రులకు ఆటిజం మీద అవగాహన కల్పిస్తారు. ఆటిజం రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వచ్చిన వాళ్ళు సాధారణ జీవితం గడిపేలా శిక్షణ ఇవ్వాలి. కొన్ని సంస్థలు వీరికి ఉపాధి కల్పించేందుకు ముందుకు రావాలి. వాళ్ళ జీవితం వారు గడిపేలా, ఎవరి మీదా ఆధారపడకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలి. ఈ లోపాల గురించి ప్రజల్లో అవగాహన పెంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనువంశికంగా, జన్యువుల ద్వారా ఏర్పడే మానసిక లోపాల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు ఆటిజం డే జరుపుకుంటున్నాం.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్
సరైన పాఠశాలలు దొరక్క
ఐటీ ఉద్యోగి అయిన మాధవి ఆటిజంతో బాధపడుతున్న తన కొడుకును పాఠశాలలో చేర్పించేందుకు చాలా కష్టపడ్డారు. యుకేలో కొన్ని సంవత్సరాలు పనిచేసి హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆటిజంతో బాధపడుతున్న పిల్లల ఎదుగుదలకు, విద్యకు తోడ్పడే అనువైన పాఠశాలల కోసం అన్వేషణ వ్యర్థమని ఆమె గుర్తించారు. కొన్ని ప్రత్యేక పాఠశాలలు డే కేర్ కేంద్రాలుగా నిర్వహించబడుతున్నాయి. దాంతో 2007లో మాధవి తన కొడుకు భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనన్య చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ క్లినిక్ (Aజణజుజ)ని ప్రారంభించారు. ఆటిజం చుట్టూ ఎన్నో అపోహాలు బలంగా ఉన్నాయి. దాంతో బాధపడుతున్న పిల్లలు ఎదగడానికి, వారి నిజమైన ప్రతిభను గుర్తించడానికి, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, వారికి విద్యతో సహా సంపూర్ణ సంరక్షణకు అవసరమైన శిక్షణ అందించడానికి, అవగాహన పెంచడానికి ఆమె యూరప్ నుండి వాలంటీర్లను ఆహ్వానించారు. 2018లో Aజణజుజ వ్యాపారం ఫ్రాంచైజీ ఆధారిత మోడల్‌కు మారింది. ఇక్కడ దాని రెండు అదనపు కేంద్రాలు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల తల్లుల యాజమాన్యంలో నడుస్తున్నాయి.
- మాధవి ఆదిమూలం
కాలినా నొప్పి వేయలేదు
దీపావళి పండుగ రోజు గౌరీ కొడుకు కాలిపోయాడు. కానీ నొప్పితో కనురెప్ప వేయలేదు. తర్వాత అతనికి ఆటిజం ఉన్నట్టు నిర్ధారణ అయింది. అప్పుడే గౌరీ ఆటిజం, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను చదవాలని నిర్ణయించుకుంది. ప్రత్యేక విద్యలో డిగ్రీ కోసం నమోదు చేసింది. ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె 80లలో పెద్ద కంపెనీల కోసం జర్మన్ భాష అనువాదకురాలిగా పనిచేసింది. కొద్దికాలంలోనే ప్రత్యేక పిల్లలతో పాటు ఇతర తల్లిదండ్రులు అనేక ప్రశ్నలతో ఆమెను సంప్రదించేవారు. ఆమె రేష్మీ నికిత్తో జతకట్టింది. వికలాంగుల కోసం లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. అక్కడ వారికి క్రీడలు, కళలు, సంగీతం, విద్య నేర్పిస్తారు. ఇది వారిలో నైపుణ్యాలను కనుగొనడంలో సహాయపడింది.
- గౌరీ రమేష్
చాలా పాఠశాలలకు అవగాహన లేదు
చాలా పాఠశాలలకు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలతో పని చేయడానికి ఎలాగో తెలియదు. దాంతో వారు ఎన్నో సమస్యలకు గురవుతారు. 19 సంవత్సరాల వయసులో దేవాంగనా మిశ్రా వసంత్ వ్యాలీ స్కూల్లో లెర్నింగ్ స్పెషలిస్ట్‌గా దీన్ని ప్రత్యక్షంగా చూశారు. 2009లో న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ నుండి ఆటిజం, మేధోపరమైన వైకల్యాలలో రెండు ఎమ్మెలు పూర్తి చేసిన తర్వాత ఆమె గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటిస్టిక్ పిల్లలతో కలిసి పని చేసింది. నవంబర్ 2021లో ఆమె ముంబైకి చెందిన బ్రెయిన్ బ్రిస్టల్ అనే సంస్థను ప్రారంభించింది. ఇది నాలుగు నుండి 16 సంవత్సరాల మధ్య వయసు గల 16 మంది పిల్లలతో కలిసి పని చేస్తుంది. ప్రత్యేక అవసరం లేదా ఆటిజం యొక్క స్పెక్ట్రంపై లేబుల్ చేయబడింది. ప్రామాణిక కోర్సుకు బదులుగా దేవంగారా వారి సామర్థ్యాన్ని గుర్తించడానికి, వారిలో ధైర్యాన్ని పెంపొందించడానికి రెజియో ఎమిలియా విధానాన్ని ఉపయోగిస్తుంది.
- దేవాంగనా మిశ్రా
ఆటిజంలో గ్రాడ్యుయేషన్ చేసి
సురభి వర్మ స్కూల్ విద్యను పూర్తి చేసి యుకేలోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుండి ఆటిజంలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది. అలాగే వడోదరలోని ఎంఎస్ విశ్వవిద్యాలయం నుండి పిల్లల అభివృద్ధిలో మాస్టర్స్ పూర్తి చేసింది. మాక్స్ హాస్పిటల్, ఇతర థెరపీ సెంటర్లలో పని చేస్తున్నప్పుడు ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు ఉత్తమమైన చికిత్సలు, మార్గదర్శకత్వం కోసం వెతకడం కోసం చాలా సమయం గడిపినట్టు ఆమె చూసింది. దాంతో 2005లో ఆటిజం, డైస్లెక్సియా, ఇతర లెర్నింగ్ డిజార్డర్లతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి దక్షిణ ఢిల్లీలో ఉన్న స్పర్ష్ ఫర్ చిల్డ్రన్ అనే మల్టీడిసిప్లినరీ థెరపీ సెంటర్‌ను ప్రారంభించింది. అర్హత కలిగిన ప్రత్యేక అధ్యాపకులు, వైద్యులు, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్‌ల బృందంతో స్పర్ష్ 18 నెలల నుండి 20 సంవత్సరాల వయసు గల వారికి తన సేవలు అందిస్తుంది. సరైన, అర్హత కలిగిన నిపుణులను కనుగొనడం సురభి ప్రధాన సవాలు.
- సురభి వర్మ