Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరీక్షలు ఒత్తిడితో కూడుకొని ఉంటాయి. 10,12వ తరగతి బోర్డులు లేదా ఇతర ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పరీక్షలపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పరీక్షలు అంటే చాలా చదవడం, రాయడం, ఈ రోజుల్లో ఆన్లైన్ పరీక్షలతో దీని అర్థం కూడా గంటల తరబడి స్క్రీన్ వైపు చూస్తూ ఉండటం. ఇది తీవ్రమైన అలసటకు, ఒత్తిడికి దారితీస్తుంది. ఈ సమయంలో విద్యార్థులు సాధారణంగా మంచి పోషకాహారం, సరైన నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. వారి కండ్లకు, మెదడుకి, శరీరానికి ఇంధనం అందించడం చాలా అవసరం. దీని కోసం సమయానికి తినడం, నిద్రపోవడం, కంటి ఒత్తిడిని నివారించడం చాలా ముఖ్యం. పరీక్షల సమయంలో కంటి సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
- మీ వెనుకభాగంలో పడుకోని చదవకండి. ఇది మీ కండ్లపై ఒత్తిడి పడేలా చేస్తుంది. దాంతో త్వరగా అలసిపోతారు.
- చదివేటప్పుడు పుస్తకానికి, కంటికి మధ్య కనీసం 25 సెంటీమీటర్ల దూరం పాటించండి.
- గంటల తరబడి కూర్చుంటే మధ్య మధ్యలో 10 నిమిషాల విరామం తీసుకోండి.అటూ ఇటూ వాకింగ్ చేయండి. కాస్త రీఫ్రెష్‌గా కూడా ఉంటుంది.
- పరీక్షల సమయంలో తాజా పండ్లు, కూరగాయలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కండ్లు, సరైన దృష్టి కోసం సహాయపడే బీటా కెరోటిన్‌లో పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోండి.
నిద్ర వచ్చినప్పుడు కండ్లను రుద్దకూడదు.. బదులుగా చల్లటి నీటిని కండ్లపై చల్లుకోండి. రెగ్యులర్‌గా కండ్లపై చల్లటి నీటిని చల్లుకుంటూ ఉండండి.
మంచి వెలుతురు ఉన్న గదిలో చదవండి ఎందుకంటే మసకబారిన గదిలో కూర్చొని చదవడం వల్ల కంటి ఒత్తిడికి దారితీస్తుంది.
కదులుతున్న బస్సులో లేదా రైలులో ఎప్పుడూ చదవకండి. ఎందుకంటే ఇది కంటి ఒత్తిడికి కూడా దారితీయవచ్చు.
- ఆన్లైన్లో చదువుతున్నప్పుడు కండ్లను మెరుగ్గా ఉంచడానికి మానిటర్‌ను 45-డిగ్రీల కోణంలో ఉంచండి
- నిద్రించడానికి, శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి మీకు తగినంత సమయాన్ని అందించే టైమ్‌టేబుల్‌ను రూపొందించండి. దాన్ని మాత్రమే అనుసరించండి.
భోజనం అస్సలు మానేయకండి. సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి కారణంగా తినడం మానేస్తారు. దీనివల్ల శరీరంలో పోషకాహార లోపం మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. ఫలితంగా ఏకాగ్రత కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోండి. అప్పుడే చదువుపై దృష్టి పెట్టగలరు.