Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదివిన చదువు సమాజంపై బాధ్యతను గుర్తు చేసింది. చదువు ద్వారా వచ్చిన తెలివితేటలు పేదలకు ఉపయోగపడమని పురికొల్పాయి. మనిషిగా అబ్బిన సహజగుణాలు సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు సాగమని ప్రబోధించాయి. మంచి పనికి ఆడ మగ తేడా లేదని ఆమె పొందిన సన్మానాలు, సత్కారాలు ఎలుగెత్తి చాటాయి.. వెరసి సంకల్పమే ఆమెకు గొప్ప బలాన్నిచ్చి సమాజసేవలో సేవారత్నంగా నిలబెట్టాయి. ఆమే... ఖమ్మం నగరానికి చెందిన ఆణిముత్యం రాయల ఈశ్వరి..
చదివింది ఎల్. ఎల్. బి... చేసేది ఖమ్మం కోర్టులో న్యాయవాద వృత్తి. సేవారంగం ప్రవృత్తి. భర్త రాయల సతీశ్ బాబు ఖమ్మంలోని తెలంగాణ నారాయణ విద్యాసంస్థల యజమాని. ఆయనతో పాటు ఇద్దరు సంతానం పూర్తి సహకారం ఉండడం వల్ల ఆమె అభిప్రాయాలకు ఆ ఇంట గౌరవం లభించింది. తెలిసిన వారు, పరిచయస్తులు, ఆమె ఆలోచనలను, ఆశయాలను అభినందించి ప్రోత్సహించారు.
బాలికా విద్యను ప్రోత్సహిస్తూ...
పేద పిల్లలకు విద్యారంగంలో సహాయపడటానికి ముందుగా భర్త సారధ్యం వహిస్తున్న తెలంగాణ నారాయణ పాఠశాలలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా చేరి తన ఆలోచనా సరళిని విస్త్రతపరుచుకుంది. ఈ క్రమంలో చిన్నపిల్లలను చదువుపట్ల మోటీవేషన్ చేయించడంలో అందెవేసిన చేయిగా ప్రసిద్ధి పొందారు. అంతే కాదు బాలికా విద్యను ప్రోత్సహించే దిశలో తమ విద్యాసంస్థలో చదివే బాలికలకు ఫౌండేషన్ ఎడ్యుకేషన్‌లో ఉచిత బోధన గావిస్తున్నారు. వారి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ మిషన్ సరస్వతీ - 2017 ద్వారా బాలికావిద్యను పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నారు. హాస్టల్ విద్యార్థులను చదువుపరంగా పర్యవేక్షించేందుకు కూడా కృషి సల్పుతున్నారు. సేవారంగంలో కూడా తనదైన శైలిని చాటుకున్నారు ఈశ్వరి.
పర్యావరణ పరిరక్షణలో...
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాలిథిన్ సంచుల నిషేధంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె కలెక్టర్‌ను కలిసి బ్రోచర్‌ను ఆవిష్కరింపజేశారు. ఇందిరానగర్ పాఠశాలలో క్లబ్ తరపున సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటుకు కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీతో పాటు, వినాయక నవరాత్రుల్లో పర్యావరణ పరిరక్షణను చాటుతూ మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. వాసవీ క్లబ్ తరఫున సంక్రాంతి ముగ్గులపోటీ నిర్వహించడమే గాక, పలుసార్లు పోటీలకు న్యాయనిర్ణేతగా కూడా హాజరయ్యారు. రోటరీక్లబ్ ఆఫ్ స్తంభాద్రిలో కూడా సభ్యురాలిగా తమ వంతు పాత్ర పోషించారు. రోటరీ వనితలో కూడా ఆమె పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. 2008లో శ్రీమతి ఆంధ్రప్రదేశ్ పోటీలకు ఖమ్మం జిల్లా నుండి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
విద్యా కమిటీ చైర్ పర్సన్‌గా
2017లో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఖమ్మం పౌరసమితి వారి నుండి స్త్రీశక్తి అవార్డును ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు పువ్వాడ అజరు కుమార్ చేతుల మీద నుండి అందుకున్నారు. ప్రస్తుతం వాసవీ క్లబ్ డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఆమె యువజన సంఘాల విద్యాకమిటి జిల్లా చైర్ పర్సన్‌గా, వాసవీ వనితా క్లబ్ ఇందిరానగర్ చార్టెట్ అధ్యక్షురాలిగా కూడా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. సేవారంగంలో దాదాపు పదేండ్ల అనుభవం కలిగిన ఆమెకు అన్నం ఫౌండేషన్ వారు, తెలంగాణ కళాపరిషత్ వారి ఉగాది పురస్కారాలను అందజేశారు. శాస్త్రీయ నృత్యంలో ప్రవేశంతో పాటు ప్రావీణ్యం సంపాదించిన ఈశ్వరి వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా సమాజసేవలో దూసుకుపోతోంది.
ఎందరికో ఆదర్శనీయం
మహిళా జాతికే ఆదర్శంగా,ఆణిముత్యంగా నిలిచి, స్త్రీ తలచుకుంటే సాధించలేనిదేదీలేదని నిరూపించింది. ఆమె చేస్తున్న సామాజిక సేవ ఎందరికో ఆదర్శనీయమైనది. అందరికీ ఆచరణీయమైనది. యువకులనుంచి, పెద్దవారిదాకా ఎందరో ఆమెను చూసి స్ఫూర్తి పొందాలి. ఆమెను మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాలి. అత్యున్నత శిఖరాలకు ఆమె చేరుకోవాలి. భారతజాతికే ఆమె గర్వకారణమై వెలగాలని ఆశిద్దాం..
- తిరునగరి శరత్ చంద్ర