Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''వికలాంగులం అయినంత మాత్రాన ఏమి చేయలేము అనుకోవడం పొరపాటు. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది గుర్తించి గట్టిగా ప్రయత్నం చేస్తే చాలు ఏదయినా చేయగలం. మన కోసం మనం బతకడం కన్నా నలుగురి కోసం బతకడంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఆకలితో ఉన్నవాళ్ళకి ఒక్క ముద్ద అన్నం పెట్టి చూడు ఆ సంతోషమే వేరు'' అంటుంది వంగూరి అలివేలు మంగమ్మ. తన చిన్నప్పుడు కుటుంబాన్ని వదిలేసి తండ్రి ఎటో వెళ్ళిపోయాడు. ఒంటరిగా తల్లి చేసిన పోరాటం చూస్తూ పెరిగింది. కష్టపడి చదవుకుంది. సమాజానికి ఏదైనా చేయాలని అనుకుంటున్న సమయంలో రెండు సార్లు ప్రమాదానికి గురయ్యింది. కాళ్ళు పోగొట్టుకుంది. ఇక నేనేమీ చేయలనే అనే నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య చేసుకోబోయింది. అలాంటి ఆమె ఇప్పుడు పది మంది పిల్లలకు విద్యను అందిస్తూ జీవితాన్ని ఇస్తుంది. ఆమె స్ఫూర్తిదాయ జీవిత పరిచయం మానవి పాఠకుల కోసం...
మా సొంతూరు గుర్రాలదండి, బీబీనగర్ మండలం, జిల్లా యాదాద్రి. ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. అమ్మ సావిత్రి, నాన్న రాములు. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. నాకు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెల్లు. నాన్నకి రైల్వే ఉద్యోగం. అమ్మ కూలి పని చేసేది. నలుగురు పిల్లల్ని, అమ్మని వదిలేసి నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటికి మేము చాలా చిన్న పిల్లలం. నాకు కొంచెం తెలివి ఒచ్చేసరికి నాన్న లేడు. ఎలా ఉంటాడో కూడా తెలీదు. అసలు నాన్న గురించి ఏం తెలీదు.
అమ్మ ఒంటరయ్యింది
మాది ఉమ్మడి కుటుంబం. తాతా, నానమ్మ, బాబాయిలు, పిన్నులు, మేనత్త తన కూతురు. నాకు తెలివి వచ్చేవరకు ఇదే మా ఫ్యామిలీ. చిన్నప్పుడు నాన్న లేని లోటు తెలిసేది కాదు. కానీ కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ నాన్న ఉంటే బాగుండు అనిపించింది. ఎవరు లేనప్పుడు బాగా ఏడ్చేదాన్ని. ఉమ్మడి కుటుంబంలో ఒక్కోసారి తినడానికి కష్టం అయ్యేది. కానీ చాలా ఉండేది. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం. కాలక్రమేణా అందరూ విడిపోయారు. నలుగురు పిల్లల భారం అమ్మ ఒక్కదాని మీదనే పడింది. కూలి పనులు చేస్తూ అమ్మ చాలా కష్టపడి పెంచింది. ఒక్కరోజు కూడా పనికి వెళ్లకుండా ఉండేది కాదు.
చదువంటే ఎంతో ఇష్టం
అమ్మ కష్టపడి మా నలుగురిని ప్రభుత్వ స్కూల్లో చదివించింది. స్కూల్ లైఫ్ నుండే నేను పనులు చేయడం మొదలుపెట్టాను. ఊర్లలో భాగవతం ఆడేవారు. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క పుస్తకం. ఆయా పాత్రధారులు నాతో రాయించుకునేవారు. వాళ్లకు తోచిన మొత్తం ఇచ్చేవారు. అది మా తాతగారి ప్రోత్సాహం వల్లనే రాయగలిగాను. బాగా ఎంకరేజ్ చేసేవాడు. మా ఊర్లో డిగ్రీ చదువుకున్న మొదటి అమ్మాయిని నేనే. పదవ తరగతి వరకు అమ్మ చదివించగలిగింది. పై చదువులకు ఎక్కువ డబ్బులు అవుతాయని మాన్పించేసింది. నాకేమో చదువంటే ఇష్టం. చాలా ఏడ్చి 'నువ్వు చదివించకపోయిన నేను చదువుకుంటాను' అని అమ్మకు నచ్చ చెప్పాను. శారీ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే కొంత అమౌంట్ వచ్చేది. ఇంటర్ కోసం మా పక్కనే ఉన్న భువనగిరిలో చేరాను. ఒక్కోసారి బస్ పాసుకి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఎలాగో ఇంటర్ కంప్లీట్ చేశాను.
విద్యా వాలంటీర్‌గా...
డిగ్రీలో చేరి మొదటి సంవత్సరం పూర్తచేశా. రెండవ సంవత్సరం కాలేజీ మానేశాను. ప్రభుత్వ స్కూల్లో విద్యా వాలంటీర్‌గా చేరాను. నెలకి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు. అదే నా మొదటి పెద్ద అమౌంట్. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. అమ్మ కష్టాలు చూస్తూ పెరిగాను. నా చదువుకు ఎంత ఇబ్బంది అయ్యిందో నాకు తెలుసు. కనుక ఉద్యోగం చేసి అమ్మకు, నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాను. ఉద్యోగం చేయాలంటే చదువు చాలా చాలాముఖ్యం. అందుకే అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేశాను.
సమాజానికి ఏదైనా చేయాలని
సమాజంలోకి వెళ్లి ఏదయినా చేయాలంటే అవగాహనా ఉండాలి. కాబట్టి కాకినాడలో నలభై రోజులు సోషల్ వర్కర్ ట్రైనింగ్ తీసుకున్నాను. సోషల్ వర్క్ పైన నాకున్న ఆసక్తిని చూసి ట్రైనింగ్‌కి అయ్యే ఖర్చు మొత్తం ఓ సార్ పెట్టుకున్నారు. ట్రైనింగ్ అయిపోయాక కొద్దీ రోజులు గ్రామాల్లోకెళ్లి అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. స్కూళ్లలో కూడా చదువు గురించి, వికలాంగుల గురించి ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. ఆ టైంలోనే ఆక్సిడెంట్ అయ్యింది. రెండు కాళ్ళు విరిగాయి. ఒక సంవత్సరం మొత్తం పూర్తిగా మంచం మీదనే ఉన్నాను. ఇక నేను అనుకున్నది జరగదు, బతకటం వేస్ట్ అనుకున్నాను. చచ్చిపోదామని నలభై టాబ్లెట్స్ మింగాను. ఇంట్లో చూసి హాస్పిటల్‌కి తీసుకెళితే మళ్ళీ బతికాను. మంచం మీద ఉంటూనే మెషిన్ కుట్టడం మొదటుపెట్టాను. కాళ్ళతో తొక్కడం రాదు కాబట్టి చేతితో తిప్పుకుంటూ కుట్టేదాన్ని. అయినా గిరాకీ బాగా వచ్చేది. నా హాస్పిటల్ ఖర్చులు నేనే పెట్టుకునేదాన్ని. అలా సంవత్సరం గడిచింది మెల్లగా నడవటం మొదలుపెట్టాను.
నాన్న రాకతో నరకం
ఎప్పుడో చిన్నప్పుడు వదిలేసి పోయిన నాన్నని ఎలాగోలా బాబాయిలు అడ్రస్ కనుక్కొని పట్టుకొచ్చారు. అప్పటి నుంచి అమ్మకూ, మాకు రోజూ నరకమే. చిన్నప్పుడు నాన్న లేడని ఏడ్చేదాన్ని. వచ్చాక రోజూ నాన్న వల్ల ఏడ్చేవాళ్ళము. నాన్న బాధ భరించలేక ఊరు వదిలేసి హైదరాబాద్ వచ్చేశాం. ఇక్కడ అందరం పనిచేసుకుంటూ బతుకుతున్నాం. అంతలోనే నాకు మళ్ళీ ఆక్సిడెంట్. ఈ సారి ఒక్క కాలు విరిగింది. సర్జరీ చేశారు. కాలుకి రాడ్ వేశారు. ఈ సారి సర్జరీ జరగడం వల్ల నాలుగు నెలలకే నడిచాను. మళ్ళీ కుట్టు మెషిన్ కొట్టుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా బతకటం నాకు ఇష్టం లేదు. నేనేం చేయలేకపోతున్నా, పుట్టడం చావడం ఇంతేనా మనిషి జీవితం అనిపించింది.
ఫ్రెండ్ ప్రోత్సాహంతో...
నేనంటూ ఒక దాన్ని ఉన్నానని మా ఫ్యామిలీకి, బంధువులకి మాత్రమే తెలుసు. ఏం చేయలేనప్పుడు ఎందుకు బతకటం అనుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి ఉన్న కోరిక ఉండేది. ఏంటంటే నా పేరు చెప్తే మా చుట్టు పక్కల గ్రామాల వాళ్ళు గుర్తుపట్టాలి. అలా అమ్మకు, మా ఫ్యామిలీకి మంచి పేరు తేవాలి అనుకున్నాను. అనుకున్నది చేయలేనపుడు చావడమే మేలనిపించింది. అప్పుడు ఫ్రెండ్ ఎంతో ప్రోత్సహించాడు. ''నువ్వు బయటకి వెళ్లలేకపోవొచ్చు. కానీ ఇంట్లోనే ఉండి అనుకున్నది చేయగలవు'' అని ఎంకరేజ్ చేశారు. ఆ మాటలతో నేను ఏం చేయగలను అని ఆలోచించాను. నాకు వచ్చింది మెషిన్ కుట్టడం మాత్రమే. చాలా బాగా కుడుతాను కనుక ఇదే వికలాంగులకు నేర్పించాలని నిర్ణయించుకున్నాను. ఇదే విషయం ఇంట్లో చెప్పాను. అప్పటికి నేను మెషిన్ కుడుతూ రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాను.
అమ్మ ప్రేమ ఫౌండేషన్
మెషిన్ నేర్చుకోవడానికి నేను ఎక్కడికీ వెల్ళలేదు. నా అంతట నేనే నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి చేతి మీద కుట్టేదాన్ని. ఆక్సిడెంట్ తర్వాత ఇంకా ఎక్కువ కుట్టేదాన్ని. ఆ దైర్యంతోనే 'అమ్మ ప్రేమ' ఫౌండేషన్ ప్రారంభించాను. కొంత మంది వికలాంగులకు కుట్టు మెషిన్ నేర్పించాను. అప్పుడు నాకు ఫైనాన్సియల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇలా ఫౌండషన్స్కి సపోర్ట్ చేస్తారని కూడా నాకు తెలీదు. నేను కుట్టు మెషిన్ కుడుతూనే ఇరవై మంది వికలాంగులకు అన్నం పెడుతూ మెషిన్ నేర్పించాను. ఆ టైంలోనే పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలను చదివించమని కొంతమంది అడిగారు. కానీ నేను వాళ్ళను పోషించగలనా అని నాకు డౌట్. నా ఒక్కదాని కష్టం మీదనే అందరూ బతకాలి. వికలాంగులకు కేవలం భోజనం పెట్టి, మెషిన్ నేర్పించడం వల్ల ఖర్చు తక్కువ. చదువంటే ఖర్చు ఎక్కువ. అందుకే ముందు ఒక్క అమ్మాయిని తీసుకున్నాను చదివించటానికి. ఇది ఎంతో తృప్తినిచ్చింది. ఇంకా కొంత మందిని దత్తత తీసుకొని చదివించాను. అలా నాలుగు సంవత్సరాలు గడిచింది.
డోనర్స్ రావడంతో...
ఆ నాలుగు సంవత్సరాలలో ఎవ్వరి నుండి ఎలాంటి సపోర్ట్ లేదు. నా కష్టం మీదనే నడిచింది. అప్పుడు నా గురించి తెలిసి ఒక మేడం ఒచ్చారు. నా గురించి, పిల్లల గురించి ఫేస్బుక్లో పోస్ట్ చేసారు. మెల్లగా డోనర్స్ రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను వికలాంగులకు పెళ్లిళ్లు చేయడం, అవసరమైన వారికి సాయం చేయడం, కరోనా సమయంలో రోజూ అన్నదానం చేయడం, రోడ్ సైడ్ వాళ్ళకి, మున్సిపల్ వాళ్ళకి భోజనం పెట్టడం, చదువుకునే పిల్లలకి నోటుబుక్స్, స్టేషనరీ ఐటమ్స్ ఇవ్వడంతో పాటు నా దగ్గర ఉన్న పది మంది పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తున్నాను.
ఇతరుల కోసం బతికినపుడే...
ప్రస్తుతం నా కాలు నొప్పి వల్ల మెషిన్ కుట్టడం మానేశాను. కేవలం డోనార్స్ సహాయంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. మొదట్లో చాలా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు బాగానే ఉన్నాను కనుక మంచి చేసే వాళ్లకు తప్పకుండ మంచే జరుగుతుంది అనే నమ్మకం వచ్చింది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నేను అనుకునేది ఒక్కటే. ఆస్తులు అంతస్తులు, మంచి బట్టలు వేసుకోవడం, కార్లలో తిరగడం నాకు ముఖ్యం కాదు. అలాంటివి నాకు ఇష్టం లేదు. తెల్ల అన్నం తిన్నా కడుపు నిండుతది, బిర్యానీ తిన్నా కడుపు నిండుతది. కనుక బతికినన్ని రోజులు ఎలా బతికామన్నది ముఖ్యం కాదు. మనం చనిపోయాక కూడా మనమెవరో తెలియని వారు సైతం మనకోసం కన్నీరు పెట్టుకుంటారు చూడు అదే నిజమైన జీవితం. ఫౌండేషన్ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయింది. అయినా నేనేమి ధనవంతురాలిని కాదు. ఇప్పటికి పేదదాన్నే. నా దగ్గరికి వచ్చే ప్రతీ రూపాయి అవసరాల్లో ఉన్న వాళ్ళకే ఖర్చు చేస్తాను.
- పాలపర్తి సంధ్యారాణి