Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో ప్రతిరోజు నలభై యాభై కరోనా కేసుల కన్నా ఎక్కువ రావటం లేదనే విషయం ఆనందం కలిగించినా అది సున్నా శాతానికి వస్తే ఇంకా సంతోషపడతాం. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ఇంకా లాక్డౌన్ నడుస్తూనే ఉంది. అలాగే మరి కొన్ని దేశాలు కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. దీనిని పారద్రోలాలంటే వ్యాక్సినేషన్ ఒకటే మార్గం. 15 నుంచి 17 సంవత్సరాల వయసు వారికి టీకాలు ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి 16 లక్షల మందికి టీకాలను ఇచ్చారు. కొన్ని ప్రాంతాలలో మొదటి డోసు పూర్తవుతుండగా, కొన్ని ప్రాంతాలలో రెండవ డోసు టీకాలు కూడా పూర్తయ్యాయి. మార్చి నెల 16 నుండి 12 నుండి 14 ఏళ్ళ వరకు పిల్లలకు టీకాలు ఇవ్వడం మొదలు పెట్టారు. వీరికి మన రాష్ట్రంలో 'కార్బోవాక్స్' టీకాను ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్ళు తెరుచుకుంటాయి. కాబట్టి అప్పటిలోగా పిల్లలకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయితే ప్రమాదం తక్కువగా ఉంటుంది. పన్నెండేళ్ళ వయసులోపలి చిన్నారులకు కూడా టీకాలు ఇచ్చే వరకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నగరాల్లో పిల్లలకు టీకాలు ఇప్పించడంపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం లేదు. నిర్లిప్తత వదిలి పిల్లలకు టీకాలు ఇప్పించి ప్రమాద తీవ్రతను తగ్గిస్తే మంచిది.
చాక్లెట్లతో...
మా ఇంట్లో ఎప్పుడూ చాక్లెట్లు ఉంటాయి. మీరు చాక్లెట్లు తింటారా అనుకోకండి. మా ఇంటికి వచ్చే పిల్లల కోసం. మీ ఇంటికి రోజూ పిల్లలెందుకు వస్తారు? అని డౌట్ వచ్చింది కదా! మాది పిల్లల హాస్పిటల్ కాబట్టి. పిల్లలు హాస్పిటల్‌కు తొందరగా రారు. అందుకని వాళ్ళు రాగానే ఇవ్వడానికి చాక్లెట్లు రెడీగా ఉంటాయి. నేనేమో మధ్యలో వాటితో బొమ్మలు చేసేస్తుంటాను. ఈ రోజు చాక్లెట్లతో జీర్ణాశయాన్ని తయారు చేస్తున్నాను. ఈరోజు అంశం జీర్ణాశయం. చాక్లెట్లతో జీర్ణాశయాన్ని తయారు చేసి జీర్ణాశయం విశేషాలు తెలుసుకుందాం. దాని కన్నా ముందుగా చాక్లెట్లు ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు కూడా తెలుసుకుందాం! చాక్లెట్లంటే తీపి పదార్థాలు. కాబట్టి పిల్లలకు ఎక్కువ ఇష్టం. కానీ పిల్లలకు పళ్ళు పుచ్చిపోవటమనే సమస్యలు వస్తాయి. పిల్లలు చాక్లెట్లు తిన్న తర్వాత నీళ్ళతో నోరు పుక్కిలించి వేయాలి. దీని వలన కొంత ముప్పు తప్పుతుంది. బ్రష్‌తో నోరు కడుక్కుంటే ఇంకా మంచిది. కేవలం పళ్ళతో మాత్రమే వచ్చే సమస్యలు కాదు. పొట్టకు కూడా మంచిది కాదు. తీపి పదార్థాలు కొవ్వులుగా మారి పిల్లలు లావుగా తయారవుతున్నారు. పిల్లల్లో ఒబేసిటీ సమస్య చాలా ఎక్కువగా కనబడుతోంది. పార్లే, కాడ్బరీ, అమూల్, నెస్లే, ఫెరీరో, మార్స్, డెయిరీ మిల్క్ వంటి ఎన్నో చాక్లెట్లు అందమైన ప్యాకింగుల్లో పిల్లల్ని పెద్దల్నీ ఆకట్టుకునేలా తయారవుతున్నాయి.
ఇంజక్షన్ మూతలతో...
రంగు రంగుల ఇంజక్షన్ మూతలతో జీర్ణాశయాన్ని తయారు చేసి మధ్యలో ఉన్న ఖాళీనంతా చెట్ల గింజలతో నింపేశాను. ఇవి ఏ చెట్టు గింజలో నాకు పేరు తెలియదు. కాలేజీ రోజుల్లో రకరకాల జంతువుల జీర్ణ వ్యవస్థల బొమ్మలు గీసిన అనుభవం ఇప్పుడు పనికొచ్చింది. ఇప్పుడు రకరకాల వస్తువులు, పదార్థాలతో జీర్ణాశయాల్ని చేస్తున్నాను. జీర్ణాశయం కండరాలతో నిర్మితమై ఉంటుంది. జీర్ణాశయం, జీర్ణవ్యవస్థలో ఒక సంచివలె ఉండే భాగం. ఇది అన్న వాహికకు, చిన్న ప్రేమగులకు మధ్యన ఉంటుంది. జీర్ణాశయంలో ఎంజైములు, గ్యాస్ట్రిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. ఈ జీర్ణాశయం ఒక లీటరు ఆహారం పట్టే వరకు వ్యాకోచిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువుకు 30 మి.లీ ఆహారం పట్టేలా జీర్ణాశయం విస్తరిస్తుంది. మానవ జీర్ణాశయంలో ప్రధానంగా నాలుగు భాగాలు ఉంటాయి. 1. కార్టియా, 2. ఫండస్, 3. శరీరం, 4. పైలోరస్. జీర్ణాశయం డయాఫ్రమ్‌కు పై భాగంలో ఉంటుంది. ఈ జీర్ణాశయం వెనక భాగాన పొంక్రియాస్ ఉంటుంది. నోరు, అన్న వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులు, యానస్ జీర్ణవ్యవస్థలోని భాగాలు. తిన్న ఆహారం జీర్ణమై శక్తిగా మారితేనే మనిషి జీవించేది.
పాలపీకలు, కిస్మిస్లతో...
నేను జీర్ణాశయాన్ని పాలపీకలతో కూడా తయారు చేశాను. ఖాళీగా బోలుగా ఉండే జీర్ణాశయాన్ని కిస్మిస్లతో నింపాను. ఇప్పుడు డ్రైఫ్రూట్స్ అమ్మే షాపులలో కిస్మిస్లు దాదాపు ఇరవై రకాల వరకూ లభిస్తున్నాయి. ముదురు ఎరుపు, నలుపు, పసుపు, గోధుమ రంగులు ఇంకా చాలా షేడ్స్‌లలో దొరుకుతున్నాయి. రుచి మాత్రం పెద్దగా తేడా కనపడలేదు నాకైతే. కొన్ని బాగా తియ్యగా కొన్ని తక్కువ తీపిగా కొన్ని మామూలుగా ఉంటున్నాయి. ఆకారాల్లో కూడా తేడాలుంటున్నాయి. నేను ఇందులో వాడినవి బాగా ముదురు ఎరుపు రంగులో ఉన్నాయి. జీర్ణాశయంలోని లోపాలు తెలియాలంటే బేరియం తాగించి ఎక్స్‌రే తీస్తారు. అల్సర్లు, క్యాన్సర్లు వంటి జబ్బుల ప్రమాదం జీర్ణాశయానికి ఉన్నది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ వలన కూడా జీర్ణాశయంలోని జబ్బులను తెలుసుకుంటారు.
రబ్బర్లు, విత్తనాలతో...
నోట్లకు వేసుకునే రబ్బర్లు, పారిజాత చెట్టు విత్తనాలను ఉపయోగించి ఈ జీర్ణాశయాన్ని తయారు చేశాను. ''హెలికో బాక్టర్ పైలోరీ'' అనే బాక్టీరియా జీర్ణాశయంలో చేరినందు వల్ల ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. ఫలితంగా పెడ్టిక్ అల్సర్స్, గాస్ట్రెటిస్లు అనే వ్యాధులు వస్తాయి. ఈ బాక్టీరియా ఒక్కొక్కసారి ''స్టమక్ క్యాన్సర్'' గా మారుతోంది. మద్యం తీసుకునే వారిలో మొదటగా బాధింపడేది జీర్ణాశయమే. అధికంగా మద్యం సేవించే వారికి జీర్ణాశయ వ్యాధులు కలుగుతాయి. అసలు మామూలుగానే ఇప్పటి ఆహార పదార్థాల వలననే చాలా వరకు జీర్ణాశయ సమస్యలు వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆహారం అరగక తేన్పులతో బాధపడుతూ ఉన్నారు. అదీ గాక హౌటళ్ళలో తినడం స్టేటస్ సింబల్‌గా మారిన ఈ రోజుల్లో కచ్చితంగా జీర్ణాశయ సమస్యలు తప్పవు. నోటికి రుచిగా ఉండేందుకు హౌటళ్ళవారు ఆహార పదార్థాల్లో కలిపే అనేక రకాల మసాలాలు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అంతే కాకుండా కల్తీ ఆహార పదార్థాల వలన కూడా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి.
చిక్కుడు గింజలు, వడ్లతో...
నేను దాదాపుగా ప్లాస్టిక్ పదార్థాలు, చెట్ల ఉత్పత్తులతోనూ జీర్ణాశయాలను తయారు చేశాను. ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే పర్యావరణ కాలుష్యం తెలియజెప్పేందుకు ప్లాస్టిక్‌తో బొమ్మల్ని చేస్తున్నాను. ప్రకృతి ఉత్పత్తులను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో గింజలు, ధాన్యాలను బొమ్మల తయారీలో వాడుతున్నాను. చిక్కుడు గింజలు, వడ్లు రెండూ మా పొలంలో పండినవే. ఎండో స్కోపీ ద్వారా జీర్ణాశయంలోని సమస్యలు తెలుసుకుంటారు. నోటి ద్వారా జీర్ణాశయం వరకు ఒక గొట్టాన్ని పంపి దాని వలన అక్కడున్న వ్యాధుల్ని కనుక్కుంటారు. ఇంట్లో పరిశుభ్రంగా ఆహారం వండుకుని తింటే ఏ సమస్యలూ రావు. హౌటళ్ళ నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మందికి చేసే వంటలో నిర్లక్ష్యం, నాణ్యత లేని వస్తువులు వాడడం వలన అనారోగ్య సమస్యలకు మూల కారణం అవుతుంది.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్