Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది బీహార్‌లోని ఓ మారుమూల గ్రామం. సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచింది ఓ యువతి. దీని కోసం ఆమె ఢిల్లీ ఎన్సీఆర్లో చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఆమే సర్పంచ్ డాలీ. యువత రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ఆచరణలో నిరూపిస్తుంది ఆ యువ సర్పంచ్. పల్లెటూరు అంటేనే యువతకు సరిపడని కాలమిది. పై చదువుల కోసమో, ఉద్యోగాల కోసమే నగరాలకు వలస వెళుతున్నారు. మళ్ళీ తిరిగి సొంత గ్రామం ముఖం చూసే వారు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటిది ఆమె తన ఉద్యోగాన్ని వదులుకుని తన గ్రామానికి సేవల చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందో... దాని గురించి ఆమె ఏం చెబుతోందో మనమూ తెలుసుకుందాం...
బీహార్‌లోని గయా జిల్లాలోని షాదీపూర్ గ్రామానికి చెందిన 32 ఏండ్ల యువతి డాలీ. రెండుసార్లు సర్పంచ్‌గా గెలిచింది. కుల రాజకీయాల కంటే మానవత్వ రాజకీయాలను నమ్ముతున్న ఆమె తన ఇంటిపేరును ఉపయోగించడం కూడా మానుకుంది. గ్రామంలోని తన ఇంటి వరండాలో ఉన్న ఒక చెక్క కుర్చీపై కూర్చున్న డాలీ, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పెరిగి, గురుగ్రామ్‌లోని ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్లో ఎయిర్‌హోస్టెస్ శిక్షణా కోర్సు చేసింది. అలాంటి ఆ అమ్మాయి చివరికి ఇలా మారింది.
సంప్రదాయాలను బద్దలుకొట్టి
బీహార్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన సర్పంచ్. ఎయిర్-హోస్టెస్ నుండి సర్పంచ్ వరకు ఆమె ప్రయాణం. ''2007లో మీరట్ చాలా సంప్రదాయవాద సమాజంగా ఉన్నప్పుడు నేను ఏవియేషన్, హాస్పిటాలిటీ పరిశ్రమ పట్ల ఆకర్షితురాలినయ్యాను. సంప్రదాయ పద్ధతిలో పెరిగిన నా స్నేహితులందరూ మెడిసిన్, ఇంజినీరింగ్ రంగాలలో మరింత సాంప్రదాయ వృత్తిని ఎంచుకున్నారు. అయితే నేను మాత్రం ఎయిర్‌హోస్టెస్‌లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను'' అని డాలీ చెప్పారు.
విమానయానంలో ఉద్యోగం
ఎయిర్ హోస్టెస్‌లో ఒక సంవత్సరం కోర్సు పూర్తి చేసిన వెంటనే ఆమె బ్యాకెండ్ కార్యకలాపాలలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ద్వారా రిక్రూట్ చేయబడింది. అక్కడ ప్రయాణీకులకు దేశీయ విమాన టిక్కెట్లను జారీ చేసే బాధ్యత ఆమెపై ఉంది. విమానయాన రంగంలో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత డాలీకి 2014లో బీహార్‌లోని ఒక కుటుంబంలోని వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె ఢిల్లీ-ఎన్సీఆర్లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పాట్నాకు వెళ్లవలసి వచ్చింది. ఆమె ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుండి దూరవిద్య ద్వారా బిఎస్సీ పూర్తి చేయగలిగింది. వివాహమైన తర్వాత పూణేలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎంబీఏ చేసింది.
రాజకీయ ప్రయాణం
డాలీ రాజకీయ ప్రయాణంలో ఆమె అత్తగారిది అతిపెద్ద పాత్ర ఉందని ఆమె చెప్పింది. సాధారణ ఎన్నికల స్థానంలో వరుసగా రెండుసార్లు షాదీపూర్‌లో సర్పంచ్‌గా ఎన్నికైన మొదటి మహిళ ఆమె. 2018లో ఆమె అత్తగారు మరణించిన తర్వాత డాలీ తనకు తెలియని ప్రాంతంలో మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేసి, ఆమె అత్తగారు వదిలిపెట్టిన బలమైన సద్భావనతో ఎన్నికల్లో 129 ఓట్లతో గెలుపొందారు.
నగర జీవితం నుండి
''ప్రజలు నన్ను మా అత్తగారి తర్వాత ఆ పదవికి తగిన పోటీదారుగా చూశారు. గత పది సంవత్సరాలలో వీచీజలలో నా పని అంత అర్థవంతంగా లేదని కూడా నేను భావించాను. మానసికంగా నేను పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే పట్టణ జీవితం నుండి మారడానికి, గ్రామీణ బీహార్ సంస్కృతితో కనెక్ట్ అవ్వడానికి కొంత సమయం పట్టింది. నేను చాలా కాలంగా మెట్రో నగరాల్లో నివసించినందున ప్రజలను కలవడం, వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం కొంత సవాలుగా మారినప్పటికి అదే సమయంలో చవాలా ఉత్తేజకరంగా కూడా అనిపించింది. నాకు తెలియని భారతదేశాన్ని నేను చూడగలిగాను'' అని 2018లో శాశ్వతంగా షాదీపూర్‌కు వెళ్లిన డాలీ గుర్తుచేసుకున్నారు.
ఏం చేయగలదో నిరూపించి
ఆమె మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి ఒక నెల ముందు వరకు ఆమె పట్టణ నివాసి. ఆమె మొదటి ఎన్నికల సమయంలో ఏడుగురు పురుష అభ్యర్థులతో పోటీ పడుతుండగా డాలీ తన విద్య, పని అనుభవంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. అది స్పష్టంగా ఆమెకు అనుకూలంగా పనిచేసింది. ''సాధారణంగా ప్రజలు తమ ప్రతినిధిని తమలో ఎవరైనా ఉండాలని కోరుకుంటారు. కానీ నేను నగరం నుండి వచ్చినప్పటి నుండి సాపేక్షత ఆధారంగా పోటీ చేయలేనని నాకు తెలుసు. కాబట్టి నేను ఎలా భిన్నంగా ఉన్నానో, గ్రామానికి భిన్నంగా ఏమి చేయగలనో వారికి చూపించడానికి ప్రయత్నించాను'' అని డాలీ పంచుకున్నారు.
డిజిటలైజేషన్ ద్వారా
ఆమె వాగ్దానం చేసిన మార్పును ప్రజలకు అందించగలిగింది. డాలీ డిజిటలైజేషన్‌తో షాదీపూర్ గ్రామ న్యాయస్థానాన్ని (గ్రామ కచహరి) మార్చారు. ''ప్రతి ప్రక్రియ పారదర్శకంగా, డిజిటల్‌గా డాక్యుమెంట్ చేయబడిందని నిర్ధారించడానికి నేను వ్యవస్థలను తీసుకువచ్చాను. ప్రజలు తమ సమస్యలను సులభంగా ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించాలని నేను కోరుకున్నాను. డిజిటలైజేషన్ దానికి ఎంతో సహాయపడింది'' ఆమె జతచేస్తుంది.
సాధికార సర్పంచ్‌గా
2021లో ఆమె పదవీకాలం ముగిసింది. అయినప్పటికి గ్రామ ప్రజలు డాలీని సర్పంచ్‌గా వరుసగా రెండుసార్లు తిరిగి ఎన్నికున్నారు. ఈసారి ఆమె 1,500 ఓట్లకు పైగా గెలుపొందారు. ఇటీవల ఎనిమిది మంది మహిళలు, ఐదుగురు పురుషులతో కూడిన జ్యుడీషియల్ బెంచ్ కలిగిన రాజ్యాంగాన్ని కూడా ఆమె పర్యవేక్షించారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాలీ చేసిన పనిని బీహార్ ప్రభుత్వం గుర్తించింది. గయా జిల్లా యంత్రాంగం ఆమెకు సాధికార సర్పంచ్ బిరుదును ప్రదానం చేసింది.
సర్పంచ్‌గా తృప్తి ఉంది
ప్రజలకు సహాయం చేయడానికి గ్రామ ప్రతినిధిగా డాలీ తన పనిని కొనసాగిస్తుంది. అయితే దీనివల్ల ఆమె ఉద్యోగం, దానితో వచ్చిన ఆర్థిక సౌకర్యాన్ని కోల్పోతుంది. గతంలో ఉద్యోగం చేస్తూ 35,000 సంపాదించే ఆమె ప్రస్తుతం సర్పంచ్‌గా నెలకు 2,500 మాత్రమే వస్తుంది. అయినప్పటికీ సర్పంచ్‌గా ఉన్నందుకు ఆమె ఎంతో సంతృప్తిగా ఉంది.
ప్రశాంతంగా నిద్రపోతాను
తన గ్రామంలో ప్రభావవంతమైన మార్పును తీసుకురావడం, వారి సమస్యల పరిష్కారంలో ప్రజలకు సహాయం చేయగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల ఆమె ఎంతో ఆనందిస్తుంది. ''నేను కార్పొరేట్ సెక్టార్లో పని చేస్తున్నప్పుడు డబ్బు సంపాదిస్తున్నానని నాకు తెలుసు. కానీ అది సర్పంచ్‌గా ఉన్నంత సంతృప్తికరంగా లేదు. ఇప్పుడు నేను చేస్తున్నది రోజువారీ పోరాటం కావచ్చు, కానీ నా పని ఒకరి జీవితంలో మార్పు తెచ్చిందని తెలుసుకుని నేను రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాను'' అంటూ డాలీ తన మాటలను పూర్తి చేశారు.