Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్.సి జోసెఫిన్... చిన్నతనం నుండే వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితురాలయ్యారు. సమసమాజం కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకొని సమాజ సేవకు అంకితమయ్యారు. 74 ఏండ్ల వయసులోనూ మహిళా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. తుది వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఆమె 74 ఏండ్ల వయసులో ఏప్రిల్ 10, 2022న గుండెపోటుతో మరణించారు.
జోసెఫిన్ కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని వైపిన్ ప్రాంతంలో సాంప్రదాయ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి నుండి కార్యకర్తగా మారారు. ఆమె మతతత్వ శక్తులకు బలమైన ప్రత్యర్థి. వారి తిరోగమన నిబంధనలను సవాలు చేసి నిలబడిన ధీర వనిత. ఆమె 1978లో విద్యార్థిగా ఉన్న సమయంలోనే కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితురాలయ్యారు. ఆమె సెయింట్ జేవియర్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఎర్నాకులంలోని మహారాజాస్ కాలేజీలో మలయాళంలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత ఆమెకు చాలక్కుడి స్పెన్సర్ కాలేజీలో అధ్యాపకురాలిగా ఉద్యోగం వచ్చింది. కానీ సమాజం కోసం పని పచేయాలనే ఉద్దేశంతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వామపక్ష ఉద్యమాల్లోకి పూర్తి కాలం కార్యకర్తగా వచ్చేశారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా
ఉద్యమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఎన్నో బాధ్యతలు తీసుకున్నారు. 1997 నుండి 2006 వరకు ఐద్వా(అఖిల భాతర ప్రజాతంత్ర మహిళా సంఘం) కేరళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. అలాగే చాలా సంవత్సరాలు ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2017 నుండి 2021 వరకు కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పని చేశారు. తన పదవీ కాలంలో మహిళా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పని చేశారు. అలాగే వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీ యూనియన్‌కి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సీఐటీయూకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ వర్కర్స్ యూనియన్‌కి అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు.
మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా
కేరళ స్టేట్ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ గ్రేటర్ కొచ్చిన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. అలాగే 13 ఏండ్ల పాటు అంగమాలి మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అనేక బాధ్యతలు నిర్వర్తించడమే కాదు ఆమె మంచి వక్త కూడా. ఏ విషయం పైన అయినా అనర్గళంగా మాట్లాడగలిగే దిట్టగా ప్రసిద్ధి చెందారు.
మహిళా సమస్యలపై...
ఆమె మరణించే వరకు ఐద్వా సెంట్రల్ కమిటీలో కీలక పాత్ర పోషించారు. మహిళా సమస్యలపై ఎంతో కృషి చేశారు. గుండెపోటుకు గురైన రోజు కూడా ఆమె ఇటీవల కన్నూర్‌లో జరిగిన సీపీఐ(ఎం) పార్టీ అఖిల భారత మహాసభలకు హాజరయ్యారు. ఆమె సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు కూడా. ఆమెలోని లోటు మహిళా ఉద్యమానికి ఎప్పటికీ తీరనదే అని చెప్పవచ్చు.