Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మామిడి వేసవిలోనే లభించే కమ్మని పండు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయి. ఇది వడదెబ్బను నిరోధిస్తుంది. శరీరంలో వేడిని అరికట్టడంలో మామిడి అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో పీచుపదార్థం అధికంగా ఉండడంతో మలబద్ధకానికి కూడా బాగా పని చేస్తుంది. ఇది కొవ్వుల స్థాయి తగ్గడానికి దారి తీస్తుంది. లాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గుండె సమస్యలను తగ్గించడంలో కూడా మామిడి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు విటమిన్లు చర్మ రంధ్రాలను శుభ్రం చేసి మొటిమలు రాకుండా చేస్తాయి. అలాగే కంటి ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, విటమిన్లు కూడా మామిడిలో మెండుగా ఉంన్నాయి. మామిడిలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యానికి దోహదపడతాయి. అలాగే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఇనుము అధికంగా ఉంటాయి. ఇలా ఎన్నో పోషకాలతో నిండిన మామిడితో అనేక వంటలు చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మనం వాటితో చేసుకునే కొన్ని పానీయాల గురించి తెలుసుకుందాం. వీటిని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టం తాగుతారు.
మ్యాంగో షర్బత్
కావలసిన పదార్థాలు: మామిడిపండు ముక్కలు - రెండు కప్పులు, సబ్జా గింజలు - రెండు చెంచాలు, చక్కెర - మూడు చెంచాలు, నీళ్లు - నాలుగు కప్పులు, నిమ్మరసం - ఒక చెంచా.
తయారు చేసే విధానం: సబ్జా గింజల్ని అరగంట పాటు నానబెట్టాలి. మామిడి ముక్కల్ని నీళ్లు, చక్కెరతో కలిపి మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. తరువాత ఈ ప్యూరీని ఓ బౌల్ లో వేసుకోవాలి. ఇందులో సబ్జా గింజలు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం పిండి, గ్లాసుల్లో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి అందించాలి.
పచ్చి మామిడికాయ జ్యూస్
కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయలు - అర కిలో, నల్ల ఉప్పు - ఒకటిన్నర స్పూన్, జీలకర్ర పౌడర్ - ఒక స్పూన్, పంచదార - తగినంత, చాట్ మసాల - ఒక చెంచా, వాటర్ - లీటర్.
తయారు చేసే విధానం: ముందుగా మామిడికాయలు కడిగి ముక్కలు తరిగి పెట్టుకొవాలి. స్టవ్ వెలిగించి పాన్ లో నీళ్ళు పోసి అందులో ఈ మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికాక అవి ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారక మిక్సిలో వేసి పేస్ట్ లా చేసి కొద్దిగా నీళ్ళు కలిపి వడ కట్టి రసాన్ని తీసుకోవాలి. ఈ రసానికి సరిపడా నీళ్ళు పోసి కలిపి అందులో నల్ల ఉప్పు, జీరా పౌడర్, పంచదార, చాట్ మసాల వేసి బాగా కలిపి గంటసేపు ఫ్రిజ్లో పెట్టుకుని తరువాత సర్వ్ చేసుకోవాలి.
మ్యాంగో-సబ్జా పుడ్డింగ్
కావలసిన పదార్థాలు: మామిడి ముక్కలు - అరకప్పు, కొబ్బరిపాలు - ఒక కప్పు, పెరుగు - అరకప్పు, సబ్జా గింజలు - మూడు చెంచాలు, కొబ్బరి తురుము - రెండు చెంచాలు, చక్కెర - రెండు చెంచాలు, వెనిల్లా ఎసెన్స్ - అర చెంచా.
తయారు చేసే విధానం: సబ్జాగింజల్ని అరగంట పాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు ఒంపేసి పక్కన పెట్టాలి. పెరుగును బాగా చిలకాలి. ఓ బౌల్లో కొబ్బరిపాలు తీసుకోవాలి. ఇందులో చక్కెర వేసి కరిగే వరకూ కలపాలి. తరువాత ఇందులో పెరుగు, సబ్జా గింజలు, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలిపి ఫ్రిజ్లో పెట్టాలి. పది నిమిషాల తరువాత తీసి, మరోసారి బాగా కలిపి ఫ్రిజ్లో పెట్టేయాలి. సర్వ్ చేసేటప్పుడు ఓ గ్లాస్ కానీ కప్ కానీ తీసుకుని అందులో మామిడి ముక్కలు వేసి, దాని పైన ఫ్రిజ్ లోంచి తీసిన మిశ్రమాన్ని వేయాలి. పైన కొబ్బరి తురుము, కొన్ని మామిడి ముక్కలు వేసి అందించాలి.
మ్యాంగో షీరా
కావలసిన పదార్థాలు: మామిడిపండు గుజ్జు - ఒక కప్పు, బొంబాయి రవ్వ - ఒక కప్పు, నీళ్లు - ఒకటిన్నర కప్పు, పాలు - ఒకటిన్నర కప్పు, చక్కెర - ముప్పావు కప్పు, నెయ్యి - పావుకప్పు, యాలకుల పొడి - ఒక చెంచా, జీడిపప్పు, బాదంపప్పు - కావలసినన్ని.
తయారు చేసే విధానం: స్టౌ మీద కడాయి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేయాలి. వేడెక్కిన తరువాత జీడిపప్పు, బాదంపప్పులను వేసి వేయించి తీసేయాలి. ఆ తరువాత అదే కడాయిలో బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఓ గిన్నెలో, పాలు నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేయాలి. రవ్వ ఉడికి మెత్తబడిన తరువాత చక్కెర వేయాలి. చక్కెర కరిగిన తరువాత మామిడిపండు గుజ్జు వేయాలి. బాగా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అయ్యిన తరువాత నెయ్యి వేసి కలపాలి. ఓ క్షణం పాటు ఉంచి యాలకుల పొడి, జీడిపప్పు, బాదంపప్పు వేసి దించేయాలి.