Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేశాలు మన అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటాం. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా కనిపిస్తాం. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్ స్టైల్స్‌ను ఫాలో అవ్వొచ్చు. అయితే ప్రస్తుత జీవనశైలి వల్ల చాలామందిలో చిన్న తనంలోనే అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు కనిపించడం. కొంతమందికి తెల్ల వెంట్రుకలు బయటకు కనిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యను కప్పిపుచ్చుకునేందుకు జుట్టుకు రంగు వేస్తూ వెంట్రుకలను మరింత పాడుచేసుకుంటారు చాలామంది. అయితే చిన్న వయసులోనే మీ జుట్టు తెల్లబడుతుంటే అందుకు గల కారణాలను విశ్లేషించుకోవాలి. దానికి తగినట్టుగా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. కొని చిట్కాలు పాటిస్తే తెల్ల జుట్టును నల్లగా చేసుకోవచ్చు. జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
- హెయిర్ ప్యాక్‌ను ఉసిరి, హెన్నాతో తయారు చేస్తారు. ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేసే ఈ హెయిర్ ప్యాక్‌ను వేసుకోవడం వల్ల కొంత వరకు గ్రేహెయిర్ను నివారించవచ్చు. హెన్నాను పేస్ట్‌లా తయారు చేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఉసిరి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మొదళ్ళ వరకూ బాగా పట్టించాలి. ఇది బాగా తడి ఆరే వరకు ఉండి నాణ్యమైన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలకు నేచురల్ కలర్, ఆరోగ్యకరమైన జుట్టు పొందవచ్చు.
- కేశాలను డార్క్, షైనింగ్‌గా ఉంచడానికి ఆమ్లా హెయిర్ టానిక్ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలతో పాటు మంచి రంగును అందిస్తుంది. మీ జుట్టు ఒరిజినల్ కలర్ కలిగి ఉండాలంటే బాదం ఆయిల్ ఆమ్లా జ్యూస్‌ను మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఆమ్లాను తలకు పట్టిస్తే చిన్న వయసులోనే వచ్చే తెల్ల వెంట్రుకలను నివారిస్తుంది.
- చిన్న వయసులోనే గ్రే హెయిర్ సమస్య ఉంటే అందుకు బ్లాక్ టీ చాలా బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి, అందులో టీ ఆకులు వేసి బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలారా పోసుకోవాలి. బ్లాక్ టీ నీరు తలకు పోసుకొన్న తర్వాత షాంపూ వాడకూడదని గుర్తుంచుకోవాలి. ఈ హోం రెమడీ తెల్ల వెంట్రుకలను చాలా సున్నితంగా కవర్ చేసేస్తుంది.