Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ప్రతి నాలుగు నెలలకొకసారి తన రూపం మార్చుకుని కొత్త వేరియంట్‌గా మారి ప్రజల ముందుకు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శానిటైజర్లు, భౌతిక దూరాలు మాయమైపోయాయి. ప్రస్తుతం మాస్కులు మాత్రమే పెట్టుకుంటున్నారు. చైనా దేశంలోని షాంఘై నగరంతో పాటు మరో 23 నగరాలలో కరోనా విలయతాండవం చేస్తున్నది. షాంఘై నగరంలో అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడంతో ఇంట్లో సరుకులు, వస్తువులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ కన్నా ముందే ఆకలికి చనిపోయేలా ఉన్నామని పౌరులు వాపోతున్నారు. ఊళ్ళలో ఉన్న సూపర్ మార్కెట్లపై దాడి చేసి తమకు కావాల్సిన వస్తువులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది అక్కడి ప్రజలకు. మనకూ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మాస్కులు, భౌతిక దూరాలు తప్పని సరిగా ఉండాలి. కరోనా వైరస్ బలం తగ్గాలంటే మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్యశాఖ ఇస్తున్న కరోనా వాక్సిన్లను వేయించుకోండి. 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా వాక్సిన్లు మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు తప్పక వాక్సిన్ వేయించు కోవాలి. మాస్క్‌లు పెట్టుకోండి. భద్రంగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి.
వడియాలతో...
పూర్వం ఎండా కాలాలలో వడియాలు పెట్టి ఎండబెట్టుకుంటూ ఉండేవారు. మంచాలపై చీరలు పరిచి చక్కగా వడియాలు పెట్టి కాకులు ఎత్తుకుపోకుండా ఒక కర్రపట్టుకొని ఇంట్లోని బొమ్మను కాపలా పెట్టేవాళ్ళు. లేదంటే డాబా మీద దుప్పటి పరిచి దానిపై వడియాలు పెట్టేవాళ్ళు. ఇవన్నీ పూర్వపు కాలాన ఎండాకాలపు దృశ్యాలు. ఇప్పుడు అదే వడియాలు రంగులేసుకొని రకరకాల ఆకారాలు ఏర్పరచుకుని సూపర్ మార్కెట్లలో, డిమార్ట్లలో అందమైన ప్యాకింగుల్లో దర్శనమిస్తున్నాయి. పొడుగ్గా కొన్ని గుండ్రంగా కొన్ని చక్రాల్లా కొన్ని మానవుల్లోని సృజనాత్మకతను అన్ని వస్తువుల్లో వాడుతున్నారు. కళాకారులకు కాన్వాసుగా తెల్ల పేపర్లే కాదు, తినేదైనా, తాగేదైనా, పడుకునే మంచమైనా, కూర్చునే కుర్చీ అయినా అన్నీ కాన్వాసులే. అలాంటి అందమైన వడియాలను చూసి నేను ఎందుకు ఊరుకుంటాను. ఈ వడియాలతో జిరాఫీని సృష్టించాను. ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, పసుపు రంగులున్న వడియాలను తీసుకొని జిరాఫీని తయారు చేశాను. చాలా పొడుగైన మెడ, పొడుగైన కాళ్ళు, ఆకులు తినే జంతువు జిరాపీ. మనం జూలలో చూసినప్పుడు చాలా ఆనందపడతాము.
చింతగింజలతో...
చెట్టుకు వేలాడే పుల్లటి కొడవళ్ళు ఏమిటో చెప్పండి అని పొడుపు కథ అడిగితే ఏమని చెబుతారు. భారతదేశపు ఖర్జూరం అని పిలవబడే చింతకాయలు. ఈ చెట్లు ఇరవై మీటర్ల ఎత్తు పెరిగి దట్టంగా కొమ్మలు ఆకులతో ఉంటుంది. ఇవి చల్లటి నీడను ఇస్తాయి. రోడ్ల పక్కన చింతచెట్లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. చింతకాయలు, పండ్లు భారతీయ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చింతచెట్టు జన్మ స్థానం ఎక్కడో తెలుసా? ఆఫ్రికా ఖండపు సూడాన్, మడగాస్కర్‌లోని ఆకురాల్చు అడవులు. చింతగింజల నుండి చింత నూనెను తీస్తారు. ఈ గింజల్లో 7-8 శాతం నూనె లభిస్తుంది. చింతపిక్కలను పొడి చేసి కాటన్ వస్త్రాల తయారీలో సైజింగ్ చేయుటకు, గమ్ లాంటి అడ్హెసిస్ పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. చింతపిక్కల పై పొట్టును కాఫీ పొడిని కల్తీ చేయటానికి కొందరు వ్యాపారస్తులు ఉపయోగిస్తారు. మనమేమో చింతగింజలతో జిరాఫీని తయారు చేశా. జిరాఫీ భూమిపై నివసించే అతిపెద్ద భూగోళ జంతువు. ఇది జిరాఫా అనే జాతికి చెందిన జంతువు. దీనిని ఆఫ్రికన్ డెక్కల క్షీరదం అంటారు. దీని శాస్త్రీయ నామం జిరాఫా కామెలోఎర్టాలిస్. ఇది జిరాఫీడే కుటుంబానికి చెందిన జంతువు. ఒంటినిండా మచ్చలు కలిగిన జంతువులు. ఇవి తొమ్మిది ఉపజాతులుగా వర్గీకరించబడ్డాయి. మరో ఏడు జాతులు అంతరించి పోయినవి. శిలాజాలుగా మాత్రమే లభ్యమవుతున్నాయి.
వెంటిలేటర్ వేస్టుతో...
మానవులు ప్రమాద పరిస్థితిలో ఉన్నపుడు ఆసుపత్రులలో కృత్రిమశ్వాసను అందించే మెషీన్ల మీద ఉంచుతారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో తనంత తానుగా శ్వాసను తీసుకోలేనపుడు ఇలాంటి మెషీన్లకు అనుసంధానం చేస్తారు. అలాంటి వెంటిలేటర్ అనబడే మెషీన్‌తో అనేక రకాల ట్యూబులు, పైపులు, డిస్పోజబుల్ ఎన్నో వాడుతుంటారు. ఆయా పైపులకు ఉండే కొన్ని ప్లాస్టిక్ బటన్స్‌తో తెల్ల జిరాఫీని సృస్టించాను. తెల్లని జిరాఫీ చాలా అందంగా ఉంది. జిరాఫీలు ఎక్కువగా ఆకులు, పండ్లు, పువ్వులున్న చెట్లు, అకేషియా జాతి మొక్కల్ని తింటాయి. సింహాలు, చిరుతపులులు, మచ్చల హైనాలు, ఆఫ్రికన్ అడవి కుక్కలు జిరాఫీలను వేటాడతాయి. జిరాఫీలు సమూహాలుగా జీవిస్తాయి. ఈ జిరాఫీలు కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయని 'ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సల్వేషన్ ఆఫ్ నేచర్' ఐయుసీఐఎన్ అనే సంస్థ తెలిపింది. మగ జిరాఫీలన్నీ ఒక సమూహంగా జీవిస్తుంటాయి. జిరాఫీలలో 1600 వంటే ఎక్కువ జంతుప్రదర్శన శాలల్లో ఉంచబడ్డాయి.
ఇంజక్షన్ సీసాల మూతలతో...
పిల్లలకు జబ్బు చేసినపుడు వాడే యాంటీబయాటిక్ మందుల ఇంజక్షన్ సీసాలకు రంగురంగుల ప్లాస్టిక్ మూతలుంటాయి. ఈ మూతలను నేను గత ముప్పై సంవత్సరాలుగా సేకరిస్తున్నాను. ఇలాంటి రంగుల ప్లాస్టిక్ మూతలతో జిరాఫీని తయారు చేశాను. ఈ జిరాఫీలు బాగా ఎత్తుగా ఉన్న చెట్ల ఆకులను తింటూ ఉంటాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు వంటి శాకాహారులు తినే చెట్ల ఎత్తుకన్నా ఇవి ఎక్కువ ఎత్తులో ఉన్న చెట్ల ఆకుల్ని తినడానికి ప్రయత్నించడం వలననే వీటి మెడ సాగిపోయి పొడవుగా మారిందని డార్విన్ పరిణామ సిద్ధాంతాలతో వర్ణించాడు. ఒకానొకప్పుడు చెట్ల ఆకులు దొరకక ఆహారానికి కొరత ఏర్పడినపుడు చిటారు కొమ్మన ఉన్న ఆకులు తినటానికి మెడను సాచటం వలన పొడుగై పోయిందని సిద్ధాంతం. కాలేజీలో మేడమ్ ఈ పాఠం చెబుతున్నపుడు మేమంతా 'ప్రస్తుతం ఫికల్ వర్క్ తక్కువై మెంటల్ వర్క్ ఎక్కువవుతున్న నేపథ్యంలో భవిష్యత్ తరం తల పెద్దదిగా, కాళ్ళూ చేతులు సన్నగా క్యారికేచర్లోని బొమ్మల్లా తయారవుతాయని అనుకునే వాళ్ళం. ఇది ముప్పై ఏళ్ళ కిందటి మాట. ఇప్పుడైతే కచ్చితంగా జరుగుతుందని అనిపిస్తుంది.
పిస్తా పొట్టుతో...
నేను బొమ్మల్లో ఎక్కువగా డ్రైఫ్రూట్స్‌ను వాడుతున్న విషయం తెలిసిందే కదా! పిస్తా పప్పులు తినగా మిగిలిన పొట్టుతో జిరాఫీని తయారు చేశాను. జిరాఫీలు మానవులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందమైన జంతువులుగా పేరు గాంచింది. దీని నెత్తి మీద కొమ్ములు లాంటి రెండు చిన్న, గట్టి నిర్మాణాలు ఉంటాయి. దీని అందం, దయ, దుర్బలత్వం వలన ఆఫ్రికా ఖండానికి ప్రతీకగా చూపబడుతోంది. ఈజిప్షియన్లు, కుషీట్లు తమ చిత్ర కళలో వీటిని చిత్రించారు. నమీబియాలోని 'శాన్ రాక్ ఆర్ట్'లో జిరాఫీని చిత్రించారు. పిల్లలకు పనికొచ్చే వినోదాత్మక కార్టూన్లలో జిరాఫీ మంచి స్థానాన్ని పొంది ఉన్నది. సాల్వడార్ డాలీ అనే చిత్రకారుడు తన సర్రిమలిస్టిక్ పెయింటింగ్‌లలో మండుతున్న మాన్‌లతో చిత్రించాడు. ఈజిప్షియన్లు జిరాఫీలను పెంపుడు జంతువులుగా వాడారు. కానీ వీటికి సరియైన ఆహారం సమ కూర్చడం చాలా కష్టం. అందుకనే అడవుల్లోని జారాఫీలకన్నా 'జూ'లలోని జిరాఫీల మరణాల రేటు ఎక్కువ.