Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నతనంలో మనమందరం శారీరకంగా చురుకుగా ఉండేవాళ్లం. చిన్న వయసులో మన దినచర్య వయసు పెరిగిన తర్వాత మన జీవితంపై ప్రభావం చూపుతుంది. కానీ నేటి పిల్లలకు ఆ అవకాశం లేదు. కరోనా వచ్చిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. ఎప్పుడూ టీవీలు, మొబైల్స్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. దాంతో వారికి శారీరక వ్యాయామం లేకుండా పోయింది. అందుకే పిల్లలకు శారీరక శ్రమను దినచర్యగా మార్చడానికి ముందుకు వచ్చారు ఈ ఫిట్నెస్ నిపుణురాలైన డాక్టర్ తేజల్ కన్వర్. ఆ విషయాలేంటో తెలుసుకుందాం...
డాక్టర్ తేజల్ కన్వర్ 20 సంవత్సరాల అధ్యయనంలో ఎన్నో సమస్యలను చూశారు. జీవనశైలి మార్పులకు గురై జీవక్రియ రుగ్మతలతో యువ రోగుల సంఖ్య విపరీతంగా పెరగడాన్ని చూశారు. ఆమె కౌమార ఆరోగ్యం, పీసీఓఎస్‌లో ప్రత్యేక నిపుణురాలు. అలాగే గైనకాలజిస్ట్. ''ఇది నెమ్మదిగా, సవాలుగా ఉండే ప్రక్రియ. కొన్నిసార్లు ఇది ఎదురుదెబ్బలకు లోబడి ఉంటుంది'' అని ఆమె గుర్తుచేసుకున్నారు.
అనుకూల పరిస్థితులు లేవు
ఆమె పిల్లలు కూడా పెరుగుతున్నారు. పిల్లలకు శారీరక వ్యాయామం ఎంత అవసరమో ఆమె మనసులో ఆలోచనను బలపరిచింది. వారికి కావల్సిన ఫిట్‌నెస్‌ని అందించగలిగే అనుకూలమైన పరిస్థితులు ఏవీ లేవని ఆమె తెలుసుకున్నారు. అందుకే తన పిల్లలకు ఫిట్నెస్ అందించే బాధ్యతను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన పిల్లలకే కాదు అది ఇతర పిల్లలకు కూడా చాలా అవసరం అని గుర్తించారు. వెంటనే ఫిట్నెస్, స్పోర్ట్స్, మెడిసిన్ నిపుణుల సహకారంతో తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోనే మొదటి పిల్లల తరగతిని ప్రారంభించారు.
క్లీనెటిక్స్ ప్రారంభించి
ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయం క్లీనెటిక్స్ ప్రారంభించటానికి దారితీసింది. ఇది పిల్లలను సాధారణ శారీరక శ్రమలలో పాల్గొనడానికి, క్రీడలు, ఫిట్నెస్ను జీవనశైలిగా తీసుకునేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. డాక్టర్ తేజల్ క్లీనెటిక్స్ సహ వ్యవస్థాపకురాలు మాత్రమే కాదు. ముల్ప్లీ అవార్డు విజేతగా కూడా నిలిచారు. ఇటీవల కాలంలో పిల్లలు ఎక్కువగా జీవక్రియ రుగ్మతల బారిన పడుతున్నారు. ఈ సంఖ్యలో పెరుగుదల స్పంష్టంగా ఉంది. జీవనశైలి మార్పులు, సరైన శారీరక వ్యాయామం, పోషకాహారంతో ఈ రుగ్మతలను నయం చేయవచ్చు. ఇక్కడే పిల్లలకు నిర్దిష్ట పరిష్కారాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఆమె భావించారు.
ప్రాథమిక అభ్యాసం అవసరం
చదవడం, రాయడం, అంకగణితంతో పాటు ఫిట్నెస్ను ఏకీకృతం చేయడం ప్రధాన విషయం. అవసరమైన జీవిత నైపుణ్యంగా, భారీ స్థాయిలో నివారణ జోక్యాన్ని సృష్టించడం. ప్రపంచవ్యాప్తంగా, పిల్లలకు వారి విద్యతో పాటు శారీరక అక్షరాస్యత ప్రాథమిక అభ్యాసం అవసరం అని ఇప్పటికే గుర్తించబడింది. క్రమమైన, మితమైన శారీరక శ్రమ కూడా జీవక్రియ రుగ్మతలను నివారించడంలో సాధనంగా ఉంటుందని నిరూపించడానికి పుష్కలమైన పరిశోధనలు జరిగాయి.
గేమిఫికేషన్ చేయడం
''పిల్లలు ఆహ్లాదకరమైన, లాభదాయకమైన కార్యకలాపాలను ఇష్టపడతారు. మా లక్ష్యం దీర్ఘకాలిక అలవాట్లను పెంపొందించడం, వారిని నిమగమై ఉంచడం కాబట్టి, పిల్లలు సెషన్లను భారంగా లేదా పనిగా చూడకుండా చూసుకోవడానికి ఫిట్నెస్ ప్రోగ్రామ్ గేమిఫికేషన్ చేయడం అనేది ఉత్తమ వ్యూహం. అందుకే మేము ప్రోగ్రామ్‌ను గేమిఫై చేసాము'' అంటున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి తల్లిదండ్రుల నుండి వీరికి చాలా సానుకూల అనుభవాలు ఉన్నాయి. వర్చువల్ సెషన్లు సహాయపడాయి. పిల్లలు ప్రతిరోజూ పని చేయడానికి ఎదురు చూస్తున్నారు. అత్యంత సాధారణ అభిప్రాయం ఏమిటంటే పిల్లలు తరగతులను కచ్చితంగా ఇష్టపడతారు. ఇందులో వారు నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రులకు నేర్పించాలనుకుంటున్నారు. ఫ్రేమ్‌వర్క్ జీవిత నైపుణ్యాలను పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది.
ఉన్నతమైన విద్యా పనితీరుతో
ఫ్రేమ్‌వర్క్ అనేది మోటారు డెవలప్మెంట్ స్కిల్స్, పర్సెప్చువల్ మోటార్ స్కిల్స్‌ను పెంపొందించే గ్రూప్-ప్లే, గేమిఫికేషన్, స్టోరిఫికేషన్తో కూడిన ఆకర్షణీయమైన ఫిట్నెస్, అథ్లెటిక్స్ ప్రోగ్రామ్ అంటున్నారు ఆమె. ఇంకా వారు ఉన్నతమైన విద్యా పనితీరుతో పాటు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, సామాజిక నైపుణ్యాలు వంటి వివిధ జీవన నైపుణ్యాలను నేర్చుకుంటారు.
పిల్లలు గొప్ప అనుకరణదారులు
శారీరక దృఢత్వంపై తమ పిల్లల అవగాహన కోసం తల్లిదండ్రులు చేసే ప్రధాన విషయాలు... పిల్లలు గొప్ప అనుకరణదారులు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదైనా చేయాలనుకుంటే ముందు దాన్ని తల్లిదండ్రులు చేయాలి. అప్పుడు మిమ్మల్ని పిల్లలు కాపీ చేస్తారు. శారీరక దృఢత్వం అనేది కేవలం వ్యాయామం కంటే చాలా ఎక్కువ, ఒక పిల్లవాడు తన రోజంతా ఎలా గడుపుతాడో అందులో ఉంటుంది. మొదటి నుండి వారికి విద్యను అందించడం చాలా అవసరం, ఎందుకంటే ఇది పెద్దయ్యాక పిల్లల పునాదిని నిర్మిస్తుంది.
వారి మనసులో ముద్ర వేస్తాయి
''పిల్లలను చురుకైన ఆటలు, క్రీడల వంటి కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించండి. పిల్లలు ప్రేరేపించబడినప్పుడు ఉత్తమంగా స్పందిస్తారు. ఎంత చిన్నదైనప్పటికీ సాధించిన విజయాల కోసం వారిని ప్రశంసించండి. పిల్లలు నడవడం లేదా మాట్లాడటం ప్రారంభించినప్పుడు వారు ఖాళీ కాన్వాస్‌ల వలె ఉంటారు. ప్రతిరోజూ వారు వినే చూసే, చేయమని చెప్పే చిన్న చిన్న విషయాలు వారి మనసులో ఒక ముద్ర వేస్తాయి. ఇది చివరికి వారి జీవితకాల నైపుణ్యాలు, అలవాట్లు, వ్యక్తిత్వాలను రూపొందిస్తుంది. అందువల్ల శారీరక శ్రమ ఏకీకరణ వారి ప్రారంభ జీవిత దినచర్యలో నిర్ధారించబడాలి'' అంటూ తేజల్ తన మాటలు ముగించారు.