Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి వచ్చిదంటే చాలు... భగభగ మండిపోతూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఎండ వేడిని భరించలేక మనం విలవిలాడిపోతాం. చల్లచల్లగా ఏదైనా తాగాలని మనసు లాగుతుంటుంది. ఆకలేస్తున్నా అన్నం తినబుద్ది కాదు. ఇక పిల్లలు అన్నం తినడానికి పేచీ పెడతారు. అలా అని బయట దొరికే కూల్‌డ్రింగ్ తాగడం కన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా మంచిది. పాలతో తయారు చేసే మిల్క్‌షేక్‌లు అయితే తాహాన్ని తీర్చడమే కాక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. కాబట్టి పిల్లలూ, పెద్దలు ఎంతో ఇష్టపడే కొన్ని మిల్క్‌షేక్‌లు ఈ రోజు మీకోసం...
పైనాపిల్ మిల్క్ షేక్
కావలసిన పదార్థాలు: పైనాపిల్ - ఒకటి, పాలు - రెండు కప్పులు, పంచదార - అరకప్పు, వెన్నీల ఐస్ క్రీం - టేబుల్ స్పూను, ఐస్ క్యూబ్స్ - రెండు, యాలకుల పొడి - ఒక టీ స్పూను.
తయారు చేయు విధానం: పైనాపిల్‌పై తొక్కును తీసివేసి చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ తీసుకోవాలి. తర్వాత రెండు కప్పుల పైనాపిల్ రసానికి, రెండు కప్పుల పాలు, చక్కెర కలిపి మళ్లీ మిక్సీలో వేయాలి. దానిని ఓ గ్లాస్లో పోసి అందులో వెన్నీల ఐస్ క్రీం, ఐస్ క్యూబ్స్ యాలకుల పొడిని కలిపి కంచెం సేపు ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లగా అయిన తర్వాత తాగితే వేసవి దాహం చక్కగా తీరుతుంది.
స్ట్రాబెర్రీ మిల్క్ షేక్
కావల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీ పొడి - రెండు టేబుల్ స్పూన్లు, చల్లటిపాలు - రెండు కప్పులు, స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ - నాలుగు స్పూనులు, పంచదార - రుచికి తగినంత, తాజా స్ట్రాబెర్రీలు - ఆరు.
తయారు చేయడం: ముందుగా స్ట్రాబెర్రీలను కడగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత జార్లో పాలు, స్ట్రాబెర్రీ పొడి, స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్, పంచదార వేసి మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. తరువాత గ్లాసుల్లోకి పోసి, స్ట్రాబెర్రీలతో గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఈ స్ట్రాబెరీ మిల్క్ షేక్‌ను ఈ వేసవిలో తయారు చేసుకొని ఎంజారు చేయవచ్చు. ఈ వేసవిలో బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే చాలా సులభంగా ఈ విధంగా చేసి సర్వ్ చేయచ్చు.
రోజ్ మిల్క్ షేక్
కావలసిన పదార్థాలు: రోజ్ సిరప్ - ఒక కప్పు, పాలు - ఒకటిన్నర కప్పు, చక్కెర - ఒక కప్పు, క్రీం - ఒక కప్పు, గుడ్డు - ఒకటి, రోజ్ పెటల్స్ - కొన్ని.
తయారుచేసే పద్ధతి: ముందుగా కాచి చల్లార్చిన పాలు ఓ గిన్నెలోకి తీసుకుని అందులో క్రీం, చక్కెర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత గిలక్కొట్టిన గుడ్డు సొనతో, రోజ్ సిరప్ వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో గంటసేపు పెట్టాలి. ఇప్పుడు పొడవాటి గాజు గ్లాసు తీసుకుని అందులో రోజ్ మిల్క్ షేక్ పైన రోజ్ పెటల్స్ వేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి.
చాకొలెట్ మిల్క్ షేక్
కావల్సిన పదార్థాలు: చాకొలెట్ ఐస్ క్రీమ్ - అర కప్పు, పాలు - ఒక కప్పు కాచినవి, చాకొలెట్ సాస్ - కొద్దిగా, తురిమిన చాకొలెట్ - కొంచం, పంచదార - రెండు టీ స్పూన్లు.
తయారు చేసే విధానం: పాలు, పంచదార, ఐస్ క్రీమ్‌లను మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో వేసి చాకొలెట్ సాస్, తురిమిన చాకొలెట్ పొడితో గార్నిష్ చేయాలి. మిల్క్‌షేక్ కొంచం సేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేసుకొవాలి.