Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దమయంతి మాఝీ... 21 ఏండ్ల గిరిజన యువతి. ఓ మురికివాడలో పుట్టి పెరిగింది. ఇప్పుడు కటక్ నగరానికి డిప్యూటీ మేయర్ అయ్యింది. ఆ నగరానికి ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు కూడా ఆమెనే. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె సంక్లిప్త పరిచయం మానవి పాఠకుల కోసం...
దమయంతిది కటక్‌లోని బలిసాహి అనే మురికివాడ. అక్కడే పుట్టి పెరిగారు. ముగ్గురు తోబుట్టువులలో ఆమే పెద్దది. ఆ కుటుంబంలో మొదటి తరం గ్రాడ్యుయేట్ అయిన దమయంతి రావెన్షా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. ఆమె తండ్రి 2017లో మరణించారు. తల్లి రోజు కూలీగా పని చేస్తూ ముగ్గురు పిల్లల్ని పోషిస్తుంది. అయితే ఇటీవల ముగిసిన అర్బన్ బాడీ ఎన్నికలలో దమయంతి స్థానానికి ఏకగ్రీవంగా ఎంపిక చేయబడ్డారు. దీనిలో ఆమె బీజేడీ టిక్కెట్‌పై 49వ వార్డు నుండి మునిసిపల్ కార్యాలయానికి పోటీ చేసి నగరంలోనే అతి పిన్న వయస్కురాలిగా ఎన్నికయ్యారు.
సమస్యల పట్ల అవగాహన
దమయంతి చిన్నతనం నుండే కుటుంబ పోషణలో తల్లికి సహకరించేది. తను నివసించే మురికివాడలోని పిల్లలకు ట్యూషన్ తీసుకుంటూ తన చదువు కు అయ్యే ఖర్చును సైతం సంపాదించుకునేవారు. అయితే ఆమె విద్యార్థి దశలో ఉన్నపుడు రాజకీయాల్లోకి రాలేదు. స్థానిక సమస్యల పట్ల ఆమెకున్న అత్యుత్తమ అవగాహన, స్ఫూర్తితో అధికార పార్టీని అబ్బురపరిచారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఆమె తన తెలివితేటలు, కృషి, జ్ఞానంతో ప్రజల సమస్యలపై పని చేస్తుందని వారు నమ్ముతున్నారు. డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె మొదటి లక్ష్యం నగరంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం.
ఇబ్బందులు తెలుసు
తనపై నమ్మకంతో విశిష్టమైన బాధ్యతలను అప్పగించినందుకు బీజీడీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు దమయంతి కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో చాలా కాలంగా ఉన్న కొన్ని ఇబ్బందులు తనకు తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఆమె బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ప్రకటించారు.
సమస్యల పరిష్కారం కోసం
''అధ్వాన్నమైన డ్రైనేజీ, నీటి ఎద్దడి, ట్రాఫిక్ రద్దీ, అస్థిరమైన నీటి సరఫరా, ఉపయోగంలే లేని వీధి దీపాలు నగరంలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలలో ఇవి కొన్ని మాత్రమే. అందరి సహకారం, దిశానిర్దేశంతో ఈ సమస్యలను పరిష్కరించడంపై నా ప్రధాన దృష్టి ఉంటుంది. ఇంకా నగరంలో చేయాల్సింది చాలా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం నేను నా పని ప్రారంభించాలనుకుంటున్నాను. నా కృషితో నేను నా మురికివాడలోని ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచాలనుకుంటున్నాను'' అని పిన్న వయస్కురాలైన డిప్యూటీ మేయర్ అన్నారు. ఆమె త్వరలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి రాజకీయాల్లో పూర్తిగా నిమగమై ఉంటానంటున్నారు.