Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు ప్రయోజకులు కావాలనే కోరిక సాధారణంగా ప్రతి తల్లి, తండ్రులకూ కుటుంది. ఇందుకోసం చెమటోడ్చి ఉన్నత చదువులు చదివిస్తుంటారు. అయితే పిల్లలు ప్రయోజకులుగా మారాలంటే చదువుతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అమ్మాయిలకు చదువుతో పాటు ఆర్థిక పరమైన విషయాల గురించి చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని చెబుతున్నారు.
మన దేశంలో చాలామంది మహిళలు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తమ భర్తపై ఆధారపడుతుంటారు. దానివల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. అందుకే నేటి తరం అమ్మాయిలు ఉద్యోగం పొందకముందే సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని తీర్చిదిద్దడం అవసరం. దీనికోసం ఇంట్లో జరిగే ఆర్థిక చర్చల్లో వారిని భాగం చేయండి. ఫలితంగా వారికి ఆర్థిక ప్రణాళిక, పన్నులు, ఖర్చులు వంటి వివరాలపై అవగాహన వస్తుంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల గురించి మీ అమ్మాయితో చర్చించండి. ఇలా చేయడం వల్ల స్నేహితులు, భవిష్యత్తులో భర్తతో కూడా ఆర్థిక విషయాలను స్వేచ్ఛగా, సాధికారికంగా మాట్లాడగలుగుతారు.
భవిష్యత్తుకు మంచిది కాదు
ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఆనందం కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం చూస్తూనే ఉన్నాం. వారికి అడిగిందల్లా కొనివ్వడం చేస్తున్నారు. ఫలితంగా వారిలో డబ్బు విలువ తెలియకుండా పోయే అవకాశం ఉంటుంది. ఇది వారి భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసేలా చేయాలంటున్నారు నిపుణులు. దీనికోసం వారు చేయగలిగే కొన్ని పనులను అప్పగించండి. సరిగా చేస్తే బహుమతిగా కొంత నగదు ఇవ్వండి. ఒకవేళ పనిలో నాణ్యత లేకపోతే తక్కువ డబ్బు ఇవ్వండి. దీనివల్ల డబ్బులు సులభంగా రావనే విషయం వారికి తెలిసే అవకాశం ఉంటుంది. ఫలితంగా వారు డబ్బుకు విలువివ్వడం మొదలుపెడతారు.
ఖర్చులు అదుపులో పెట్టుకునేందుకు
ఆశకి, అవసరానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అది తెలిస్తే ఎవరైనా తమ ఖర్చులను అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు ఇదే విషయాన్ని చెప్పండి. ఇలా చేయడం వల్ల వారు చేసే ఖర్చును వారే అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం మీ అమ్మాయి ఏదైనా వస్తువు కొనమని అడిగితే అది తప్పనిసరిగా కావాలా? లేకపోయినా పర్లేదా? అని అడిగి నిర్ణయం తీసుకోండి. ఇదే పద్ధతిని మీ అమ్మాయికి క్రమంగా అలవాటు చేయండి. ఈ విధంగా ఆలోచించడం వల్ల వారు భవిష్యత్తులో బలమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
వాటిని గమనించాలి...
కొంతమంది అమ్మాయిలు ఉద్యోగం వచ్చిన తర్వాత షాపింగ్ల పేరుతో విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇంకొంతమంది అమ్మాయిలు క్రెడిట్ కార్డులను ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటారు. ఇలాంటి అలవాట్లు అప్పుల ఊబిలోకి దించుతాయి. చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇదే తర్వాత కాలంలో ఆర్థిక అస్థిరత్వానికి దారితీస్తాయి. కాబట్టి పొదుపు చేయడం వల్ల కలిగే లాభాలను అమ్మాయిలకు చిన్నప్పటి నుంచే వివరించాలి. ఇందుకోసం ఒక పిగ్గీ బ్యాంకుని వారికి ఇవ్వండి. ఇందులో మీరు ఇచ్చిన డబ్బులు, వారికి బహుమతిగా వచ్చిన డబ్బులను దాచుకోమని చెప్పండి. అవి కొంత మొత్తం అయిన తర్వాత వారికి అవసరమైన మంచి వస్తువుని కొనివ్వండి. ఇలాంటి చర్యలు వారిలో పొదుపు చేయాలనే భావనను మరింత పెంచుతాయి. అలాగే ఇప్పుడు పిల్లలకు చిన్నప్పటి నుంచే పొదుపును అలవాటు చేసే కొన్ని రకాల యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి గురించి కూడా వారికి తెలియచేయాలి. మీరు చెప్పింది వినకపోయినా వాటిని చూసైనా నేర్చుకుంటారు. పొదుపు చేయడం భవిష్యత్తుకు ఎంత భరోసా ఇస్తుందో అర్థం చేసుకుంటారు. ఇవన్నీ పిల్లలకు చిన్నతనంలోనే చెప్పండం మర్చిపోకండి. అడిగిందల్లా కొనిచ్చి వారికి భవితను చేతులారా మీరే పాడుచేయకండి.