Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు పసివయసు నుండే సమసమాజం కోసం ఉద్యమ జెండా చేపట్టిన ధీర వనిత కామ్రేడ్ కొండపల్లి దుర్గాదేవి. మహిళ సమస్యలపై విరామమెరుగక కృషి చేస్తున్న నిబద్ధత ఆమెది. మహిళా సంఘ స్థాపన కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విశ్రాంతి మరిచి పర్యటించిన త్యాగశీలి. తొలితరం మహిళా ఉద్యమ నేతగా నేటి తరానికి ఓ స్ఫూర్తిప్రధాత. అలాంటి ఉద్యమ కెరటం అలసి పోయింది. 90 ఏండ్ల వయసులో ఏప్రిల్ 19 తుదిశ్వాస విడిచిన ఆమె ఉద్యమ జీవిత పరిచయం నేటి మానవిలో...
1933, ఏప్రియల్ 10న స్వాతంత్య్ర సమర యోధుడు, ఖమ్మం జిల్లాలోనే పార్టీ మొదటి శాఖా కార్యదర్శి అయిన నేదునూరి రాఘవరావుగారి మొదటి సంతానం. రాఘవరావు గారు ఆనాటికే తెల్లదొరల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతూ అనేక మంది కార్యకర్తలను తయారు చేస్తున్నారు. ఆక్రమంలోనే దుర్గాదేవి ఇంట్లో ఒక రాజకీయ పాఠశాల నిర్వహించారు. చిన్ననాడే చురుకైన మనస్తత్వం కలిగి ఉన్న ఆ క్లాసులు విని ఉత్తేజితురాలైంది.
కె.ఎల్.తో వివాహం
ఆమె మేనత్త కుమారుడైన కొండపల్లి లక్ష్మీ నరసింహారావుగారు కూడా అప్పటికే ఉద్యమంలో ఉన్నారు. మామయ్య నాయకత్వంలో ఆయన కూడా ఉద్యమంలో తర్ఫీదు పొందారు. అలా ఉద్యమంలో కీలకపాత్రలో ఉన్న కె.ఎల్ని 1949తో ఇష్టపడి ఆదర్శ వాహమాడారు దుర్గమ్మ. ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. పెద్దకుమారుడు ఉత్తమ్, రెండవ కుమారుడు పావన్, కుమార్తె సుధా.
మూడు దఫాలు ఎమ్మెల్యేగా
1952లో తెలంగాణ సాయుధపోరాట వెలుగులో బలమైన కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఆ దశలోనే 1952 నుండి 57, 62 మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు కె.ఎల్.గారు. ఈ 15 సంవత్సరాలు ఎక్కువగా దుర్గమ్మ హైదరాబాద్లో ఉంటూ బిడ్డల్ని పెంచుతుండేవారు. హాస్పిటల్కు, ఇంటికి వచ్చిన ప్రజలకు అన్ని రకాల సహాయం అందించేవారు.
దుర్గమ్మతో నా అనుబంధం
1982లో ప్రకాశం జిల్లా ఒంగోలులో మోటూరు ఉదయంతో పాటు ఇతర పెద్దల నాయకత్వంలో ఎనిమిది రోజుల రాజకీయ శిక్షణా తరగతులు జరిగాయి. క్లాసులు బోధించటానికి అహల్యా రంగేకర్, విమలా రణదివె, లావు బాలగంగాధరరావు లాంటి అనేక మంది ధీర యోధులు హాజరయ్యారు. ఆ పాఠశాలకు నన్ను పంపించటానికి నా భర్త భీష్మారావు చింతూరు నుండి ఖమ్మం వచ్చి రైల్వే స్టేషన్లో దుర్గాదేవిగారిని పరిచయం చేసారు. అప్పటికే ఆమె ఖమ్మం జిల్లా ఐద్వా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలిగా ఉన్నారు. క్లాసుల వద్ద ఎనిమిది రోజులు, ప్రయాణం రెండు రోజులు. మొత్తం పది రోజులు అమ్మతోనే కలిసి ఉన్నాను. అప్పటికే ఇల్లందు ప్రాంతంలో మంచి మహిళా ఉద్యమం నిర్మాణమై ఉంది. ఏలూరి జయమ్మగారు అధ్యక్షురాలిగా, దుర్గాదేవి గారు కార్యదర్శిగా, మరో ఆరు మంది కమిటీ సభ్యులుగా జిల్లా కమిటి ఏర్పడింది. వారిలో కొమరం స్వరాజేశ్వరమ్మ, అలవాల సుభద్రమ్మ, వల్లూరుపల్లి సుభద్రమ్మ మొదలైనవారు ఉండేవారు.
ఉద్యమంలో చురుకైన పాత్ర
అప్పట్లో ఐద్వాకు మూడు వేల సభ్యత్వం ఉండేది. ఖమ్మం, భద్రాచలం, ఇల్లందు ప్రాంతాల్లో పోరాటాలు చేస్తూనా మహిళలపై దాడులు, హింసను ఖండిస్తూ హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తింగా జరిగే పోరాటాల్లో ఖమ్మం ఉద్యమం చురుకైన పాత్ర పోషించేది. 1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహాసభలకు ఖమ్మం జిల్లా వేదికయింది. అప్పటికే కృష్ణా, గుంటూరు ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఏర్పడి రెండు మహాసభలు జరుపుకున్నది. సూర్యావతిగారు అధ్యక్షురాలిగా, మోటూరు ఉదయం గారు కార్యదర్శిగానూ, తెలంగాణ ప్రాంతంలో మల్లు స్వరాజ్యం నాయకత్వంలో అనేక ఉద్యమాలు నడుస్తున్నవి.
ఉద్యమ విస్తరణ కోసం
ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాలకు ఉద్యమాన్ని విస్తరింపజేయాలనే తలంపుతో నేతలంతా ఆలోచించి ఆనాటి మహాసభలకు 1974లో ఖమ్మం జిల్లాను ఎంపిక చేసారు. అత్యంత వైభవంగా ఆ మహాసభ జరిగింది. సుశీల గోపాల్, అహల్యా రంగేకర్, విమలా రణదివే వంటి యోధులతో పాటు రాష్ట్ర నిర్మాతలంతా ఆ మహాసభలకు హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళా ఉద్యమ పున:ప్రారంభ సభ అనేవారు ఆ సభలను. అప్పుడే ఖమ్మం జిల్లా కమిటీని కూడా వేశారు. అప్పటికే జిల్లాలో ఉద్యమాన్ని నిర్మిస్తున్న దుర్గమ్మ మిగతా కార్యకర్తలతో విస్తరణ చేపట్టారు. ఐద్వా క్లాసులు ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. 1974 నుండి 90 వరకు సుధీర్ఘకాలం ఆమె కార్యదర్శిగా పని చేసారు. 1993లో నేను అధ్యక్షురాలిగా వారు కార్యదర్శిగా పని చేసాము. 1996లో నేను కార్యదర్శిగా, అమ్మ అధ్యక్షురాలిగా, తర్వాత కాలంలో కోశాధికారిగా పని చేశాము. తర్వాత చాలా కాలం గౌరవాధ్యక్షురాలిగా కూడా పని చేశారు.
అలసట లేకుండా...
ఖమ్మం జిల్లా విస్తారమైన జిల్లా. వాజేడు మండలం ఖమ్మంకు 250 కిలో మీటర్ల దూరంలో ఉండేది. అటు వి.ఆర్.పురం, చింతూరు అన్ని ప్రాంతాలకు అలసట లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తూ వచ్చేవారు. ఏజన్సీ మండలాల్లో అయితే ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేని రోజులవి. అలాంటి చోటకు జీపుల్లో వెళ్ళేవారు. అక్కడకు వెళ్ళిన తర్వాత స్థ్థానిక మహిళా కామ్రేడ్స్ సైకిళ్ళపై తిప్పేవారు.
ఓ రాజకీయ పాఠశాల
కరణం బిడ్డగా ధనవంతుల కుటుంబంలో పుట్టి, భర్త పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా ఎలాంటి ఆర్భాటాలకు లోనుకాలేదు. చివరి వరకు ఏనాడు సొంత వాహనం కూడా ఏర్పాటు చేసుకోలేదు. కొడుకులు కూడా చాలా సాధారణ జీవితాలే గడిపారు. పెద్ద కోడలు మూడు, నాలుగువందల జీతంతో తన కుటుంబానికి సహకరించేవారు. కూతురు గర్నమెంటు ఉద్యోగిగా(అనారోగ్యంతో చనిపోయారు), చిన్న కుమారుడు సింగరేణి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. దుర్గాదేవి కుటుంబమంతా ఒక రాజకీయ పాఠశాల. సభ్యులందరూ ఉద్యమంలో భాగస్వాములై నిలవడం ఆ దంపతుల నిబద్ధతకు నిదర్శనం. వీరమాత దుర్గామాత పేరును సార్ధకం చేసుకున్న దుర్గమ్మ తల్లికి రాష్ట్ర ఉద్యమం తరపున, నా తరపునా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను.
- బత్తుల హైమావతి