Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెజల్ కుమార్... ఒకప్పుడు తెలియని వ్యక్తులను పలకరించాలంటే సిగ్గుపడే అమ్మాయి. ఇప్పుడు మిచెల్ ఒబామాతో కలిసి పని చేస్తుంది. అంతేకాదు మహిళా సాధికారత కోసం, మహిళల ఆరోగ్యం కోసం, పిల్లల రక్షణ కోసం విశేష కృషి చేస్తుంది. ఓ య్యూటుబ్ ఛానల్‌ను ప్రారంభించి కంటెంట్ సృష్టికర్తగా మారింది. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా తన సత్తా చాటుకుంటున్న ఆమె తన కెరీర్ ప్రయాణం గురించి మనతో ఇలా పంచుకున్నారు.
2014లో సెజల్ కుమార్ తన పంతొమ్మిదేండ్ల వయసులో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. ఈ రోజు ఆమె రెండు మిలియన్లకు పైగా అనుచరులతో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంటెంట్ సృష్టికర్తలలో ఒకరిగా మారారు. 2020లో మిచెల్ ఒబామాతో కలిసి యూట్యూబ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్ ప్రోగ్రామ్‌లో చేరిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది మంది క్రియేటర్లలో ఆమె కూడా ఒకరు. అయితే సెజల్ పని ఆమె కంటెంట్ ప్రభావానికి మించినది. ఆమె యునిసెఫ్ వారితో కలిసి పిల్లల రక్షణ ప్రచారం, గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి భారతదేశంలో టీకా డ్రైవ్‌లో కలిసి పనిచేశారు.
యునెసెఫ్ మద్ధతు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళల జీవితాల్లో మార్పు కోసం ఆమె సొంతంగా మహిళా సాధికారత ఉద్యమం ఐసి హున్ (నేను నేనే)ను ప్రారంభించారు. దీనికి యునెసెఫ్ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు గైనకాలజిస్ట్ అయిన తన తల్లి సహకారంతో 550 వేల సబ్స్క్రిప్షన్లను కలిగి ఉన్న మైత్రి అనే మహిళా ఆరోగ్య ప్లాట్‌ఫారమ్‌ను స్థాపించారు. సెజల్ ఇటీవల డెస్టినీ అనే మ్యూజిక్ వీడియోతో ఎంటర్టైన్మెంట్ మీడియాలోకి ప్రవేశించారు. అలాగే a Spotify podcast Shut up Sejal, and by bagging the lead in Netflix’s Engineering Girls ద్వారా విసృత ప్రచారం పొందిన ఆమె హార్స్టోరికి పంచుకున్న విశేషాలు...
సృజనాత్మకత ఉంది
మా అమ్మ గైనకాలజిస్ట్, మా నాన్న సైన్యంలో ఉన్నారు. కాబట్టి నేను చాలా కష్టపడి పనిచేసే వాతావరణంలో పెరిగాను. చిన్నప్పటి నుండి కాస్త సిగ్గు ఎక్కువే. కానీ సృజనాత్మకతను కలిగి ఉన్నాను. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నా గురించి నేను అన్వేషించుకోవడం నాకు చాలా ఇష్టం. నా కుటుంబ వాతావరణంలో సంగీతం ఉంది. మా అమ్మ అద్భుతమైన గాయని. నా సోదరుడు అనేక వాయిద్యాలను వాయించేవాడు. కాబట్టి నేను ఫోటోషాప్, మా క్యామ్కార్డర్తో ఆడుకుంటూ పాడుతూ, నృత్యం చేస్తూ పెరిగాను.
అన్నీ చేయాలని కోరిక
సెప్టెంబరు 2014లో నా సొంత య్యూటూబ్ ఛానల్ ప్రారంభించాను. నేను ఎప్పుడూ నటిని కావాలని, భారీ స్టార్‌ని కావాలని కోరుకున్నాను. పాడాలని, నటించాలని, నృత్యం చేయాలని, కళ, ఫ్యాషన్‌ని కొనసాగించాలని, చేయగలిగినవన్నీ చేయాలనుకున్నాను. నా 14, 19 ఏండ్ల వయసులో ఢిల్లీలో చాలా ఆడిషన్లకు హాజరయ్యాను. నాకు పెద్దగా పరిచయాలు లేవు. ఫేస్బుక్ ద్వారా కొంత సమాచారం సేకరించాను. యూటూబ్ పరిచయం అయిన తర్వాత నా క్రియేటివిటీని వేరొకరికి వదులుకోకుండా సృజనాత్మకంగా నేనే సొంతంగా ఏదైనా చేయడానికి ఇదే చాలా మంచి మార్గమని భావించాను. కానీ నా ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంది. నేను ఈ రోజు ఉన్న స్థితికి చేరుకోవడానికి నాకు కొన్ని సంవత్సరాలే పట్టింది.
కంటెంట్ ద్వారా కథలు
నేను తీసిన ప్రతి వీడియోను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాను. నా కంటెంట్ గొప్ప నాణ్యతతో కూడుకున్నదని నా ప్రేక్షకుల నుండి నేను ఎప్పుడూ వింటూనే ఉన్నాను. అదే నన్ను ముందుకు నడిపించింది. నా కంటెంట్ ద్వారా కథలు చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు నా సంగీతం ద్వారా ఆ పని చేస్తున్నాను. మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. దాని చుట్టూ దృశ్యమానమైన కథాంశాన్ని నేయడం నాకు చాలా ఇష్టం. ఇది సరదాగా ఉంటుంది. నా ప్రేక్షకులు వీటిని ఆధరించడం చాలా సంతోషంగా ఉంది. వారు పంపే వ్యాఖ్యలను, సందేశాలను చదువుతూ ఉంటాను. అవి కొన్నిసార్లు కాస్త కఠినంగా ఉంటాయి. కానీ చాలా తెలివైనవిగా కూడా ఉంటాయి.
వ్యక్తిగత కథనాలు పంచుకున్నారు
మిచెల్ ఒబామా 'బాలికల విద్య' ఉద్యమం కోసం మద్దతు ఇవ్వడం, కంటెంట్‌ను రూపొందించడం సంతోషంగా ఉంది. ఇందులో నేనూ భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. ఇది యాదృచ్ఛికంగా వచ్చిన అద్భుతమైన అవకాశం. నా ఉద్దేశం ప్రకారం బాలికల విద్య ఇంట్లోనే ప్రారంభమవుతుంది. నా మొదటి పాట ఐసి హన్, షార్ట్ ఫిల్మ్/మ్యూజిక్ వీడియో ద్వారా ఒక సాధారణ భారతీయ అమ్మాయిని భయం లేకుండా ధైర్యంగా ఉండేలా చూపించాము. దీని ప్రభావం చాలా విస్తృతమైనది, లోతైనది. ప్రజలు తమ వ్యక్తిగత కథనాలను నాతో పంచుకున్నారు. ఈ పాట, వీడియో వారిని ఎలా బలపరిచింది, వారి జీవితాలపై బాధ్యత వహించాలని కోరుకుంటున్నట్టు నాకు మెసేజ్‌లు పంపారు. వీడియో విడుదలైన వెంటనే ఒక మిలియన్ వీక్షణలను సాధించింది. ఇది కూడా గొప్ప మైలురాయి.
స్త్రీల ఆరోగ్యం కోసం
మా అమ్మ డాక్టర్ అంజలి కుమార్. తను గైనగాలజిస్టు. తను వైద్య వృత్తిలో 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. తన నేతృత్వంలోనే మహిళా ఆరోగ్య వేదికైన మైత్రిని స్థాపించాను. స్త్రీలకు ఆరోగ్యం పట్ల అవసరమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, అందరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ఇది ఎక్కువ మందికి చేరేలా చేయడం మా లక్ష్యం. అందుకే మైత్రిని స్థాపించాము.
చాలా మెరుగ్గా ఉన్నాను
నేను నా వృత్తి స్వభావం కారణంగా చాలా సంవత్సరాలు ఆందోళన, నిరాశతో పోరాడుతున్నాను. అయితే అదేదీ నా ప్రేక్షకులకు కనబడకుండా దాచుకొని చిరునవ్వుతో కనిపించేందుకు ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు. ఇలాంటి సమయంలో థెరపీ, కౌన్సెలింగ్ వంటివి నా జీవితాన్ని గణనీయంగా మెరుగుపరిచాయి. వాటి సహకాకరంతో ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాను. ఆ ప్రయాణాన్నే నేను నా ప్రేక్షకులతో పంచుకుంటున్నాను. మానసిక సమస్యల నుండి బయటపడేందుకు ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలి అనే దానిపై కూడా చాలా వీడియోలు పెట్టాను. ఇవి ప్రేక్షకులకే కాదు నాకూ ఎంతో బలాన్ని ఇచ్చాయి. నన్ను ఒక బలమైన వ్యక్తిగా మార్చాయి.
వృద్ధి స్థిరంగా వుంది
వెయ్యి సబ్స్క్రిప్షన్లను పొందిన తర్వాత నా మొదటి బ్రాండ్ ఒప్పందాన్ని పొందాను. నా వృద్ధి స్థిరంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మార్కెట్లో చాలా లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. నేను ప్రారంభించిన బ్రాండ్లకు వ్యాపార అవకాశాలు కలిగి ఉండటం నిజంగా నాకు దొరికిన మంచి అవకాశం.
సంగీతానికే సమయం
నేను తీసిన ఇంజనీరింగ్ గర్ల్స్ అనేది టీవీఎఫ్ ప్రొడక్షన్. ఇది 20 నిమిషాల పాటు నేనిచ్చిన ఆడిషన్‌తో వచ్చిన అవకాశం. మరుసటి రోజు నాకు కాల్ వచ్చింది. ఆ స్థాయిలో నా మొదటి నటనా ప్రదర్శన గొప్ప అభ్యాస అనుభవం. చాలా సరదాగా ఉంది. ఇది తరువాత నెట్‌ఫ్లిక్స్, జీ5 వారి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం కొనుగోలు చేయబడింది. ఇది ప్రదర్శనకు మరింత దృశ్యమానతను తీసుకువచ్చింది. భవిష్యత్‌లో సంగీతానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నాను. అలాగే నటనకు. నా తొలి ఇఎఫ్ త్వరలో విడుదల అవుతుంది. నా స్పాటిఫై ఎక్స్‌క్లూజివ్ పాడ్‌క్యాస్ట్ షటప్ సెజల్ సీజన్ 2 కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.