Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూర్ణిమా దేవి బర్మాన్... ప్రముఖ జీవశాస్త్రవేత్త అయిన ఆమే గ్రేటర్ అడ్జటెంట్ కొంగ (హర్గిలా)ను అంతరించిపోకుండా కాపాడేందుకు నడుం బిగించారు. దీనికోసమే గ్రామీణ అస్సాంలో పదివేల మంది మహిళలతో కూడిన హర్గిలా ఆర్మీని సమీకరించారు. ఇప్పుడు ఇది ఒక సామూహిక ఉద్యమం. ఇదే వారిని నాయకులుగా, పరిరక్షకులుగా మారగలిగే శక్తిని కూడా ఇచ్చింది. ఆ విశేషాలేమంటో నేటి మానవిలో తెలుసుకుందాం...
2007లో పూర్ణిమా దేవి గ్రేటర్ అడ్జటెంట్ కొంగపై తన పీహెచ్డిని ప్రారంభించారు. ఒక సామూహిక ఉద్యమాన్ని రేకెత్తించగలనని అప్పుడు ఆమె ఊహించలేదు. ఆ పక్షిని అంతరించిపోకుండా రక్షించడమే కాకుండా, పరిరక్షకుల హర్గిలా ఆర్మీని ఏర్పాటు చేయగలిగారు. వారి ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చే కృషి చేశారు. అంతేకాదు తద్వారా జీవనోపాధిని అందించడానికి వేలాది మంది మహిళలను సమీకరించారు.
తీవ్రంగా ప్రభావితం చేసింది
పదిహేనేండ్ల కిందట అస్సాంలోని కమ్రూప్ జిల్లాలోని దాదారా గ్రామం నుండి పూర్ణిమకు ఒక కాల్ వచ్చింది. ఒక పెద్ద కదంబ వృక్షాన్ని నరకుతున్నారని తెలుసుకుని అక్కడకు పెరిగెత్తారు. కొంగలు గూళ్లు కట్టుకునే చెట్టు అది. అక్కడకు వెళ్ళిన ఆమె నేలపై పడిపోయిన తొమ్మిది కొంగ పిల్లలను రక్షించగలిగారు. ''వీటికి సంరక్షకురాలిగా ఎలా ఉండాలో నాకు తెలియకపోతే పరిశోధనలో ప్రయోజనం లేదని నేను గ్రహించాను. నేలపై ఉన్న పక్షులను చూసినప్పుడు ఆ దృశ్యం నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పటికి నేను రెండున్నరేండ్ల వయసున్న కవలలకు తల్లిని. ఆ పక్షుల తల్లి పడిన బాధతో నేను సంబంధం కలిగి ఉన్నాను'' అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు.
చెడు శకునంగా భావిస్తున్నారు
మొదట్లో పక్షి ప్రాముఖ్యతను, సంతానోత్పత్తి కాలాన్ని వివరించినప్పుడు గ్రామంలోని ప్రజలు ఆమెను ఎగతాళి చేశారు. అక్కడి ప్రజలు కొంగను (దీనిని స్థానిక భాషలో హర్గిలా అని పిలుస్తారు) చెడు శకునంగా, పరిసరాలను దుర్వాసన, మురికి చేసే పక్షిగా భావించారు. భారతదేశం, కంబోడియాలో మాత్రమే ఉన్న గ్రేటర్ అడ్జటెంట్ కొంగ అస్సాం, బీహార్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఒక భారీ పక్షి 145-150 సెం.మీ ఎత్తులో నిలబడి ఉంటుంది. ఇది ఒక స్కావెంజర్, అందుకే గ్రామాల్లో దీన్ని మురికిగా పరిగణిస్తారు.
ఆమె నిరుత్సాహపడలేదు
అంతరించిపోతున్న ఈ జాతి ప్రపంచంలో కేవలం 1,200 పక్షులు మాత్రమే ఉన్నాయని అంచనా వేయబడింది. పక్షిని అంతరించిపోకుండా కాపాడాలంటే మనస్తత్వాలను మార్చుకోవడం ఒక్కటే మార్గమని పూర్ణిమకు తెలుసు. ''నేను గ్రామస్తులను కలుసుకుంటూనే ఉన్నాను. నేను పక్షులకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుండి వారు నన్ను చూడగానే నేను కూడా పక్షుల వాసనతో ఉన్నట్టుగా భావించి ముఖాలు తిప్పుకునేవారు. కానీ నిరుత్సాహపడకుండా నా మిషన్ను కొనసాగించాను. ఈ పక్షులు మన సంస్కృతిలో భాగమని వారికి వివరిస్తూనే ఉన్నాను. అవి మన పరిసరాలను శుభ్రపరుస్తాయి. మనం వాటిని కాపాడుకోవాలి'' అని ఆమె చెప్పారు.
హర్గిలా సైన్యాన్ని నిర్మించడం
ఆమె పక్షి పిల్లలను తన సొంత పిల్లలతో సమానంగా చూసుకునేంత వరకు వెళ్ళారు. తన కుమార్తెలు ఇంట్లో గందరగోళం చేస్తే వాటిని శుభ్రం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఆమె వారికి చెప్పారు. వాటిని తమ పక్షులుగా చూడాలని గ్రామస్తులను ఆమె కోరారు. పూర్ణిమ ఆ తర్వాత మహిళలను కలిసి పరిరక్షణ సమావేశాల్లో చేరమని వారిని ప్రోత్సహించేందుకు పూనుకున్నారు. కానీ వారు కూడా ఆమె ఆలోచనను ఎగతాళి చేశారు. ''నేను పండుగులకు వంట పోటీలు పెట్టాను. పక్షిని మనం ఎందుకు రక్షించుకోవాలో వివరించే చోటకు రమ్మని వారిని ప్రోత్సహించాను. ఆలయం, ప్రార్థనా మందిరం, ఇతర ప్రదేశాలలో హర్గిలా బేబీ షవర్లకు ప్రారంభించాను. హర్గిలాను జరుపుకునే జానపద, ప్రార్థన పాటలతో ఒక అవగాహన కార్యక్రమంగా చేపట్టాను'' అని ఆమె చెప్పింది.
ఉద్యమానికి కేంద్రంగా
మెల్లగా చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళు రావడం మొదలుపెట్టారు. పూర్ణిమ మహిళా నేత కార్మికుల కోసం మగ్గాలను కొనుగోలు చేసింది. వారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతున్న హర్గిలా మూలాంశాలతో అందమైన బట్టలను ఉత్పత్తి చేస్తున్నారు. అది ఇప్పుడు మహిళల చిన్న బ్యాండ్ సామూహిక సామాజిక ఉద్యమానికి కేంద్రంగా మారింది. హర్గిలా ఆర్మీ ఇప్పుడు 10,000 కంటే ఎక్కువ మంది మహిళలను కలిగి ఉంది. క్రియాశీల పరిరక్షకులు అందరూ మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు.
వన్ ఫర్ చేంజ్
పూర్ణిమ అస్సాంలోని దాదరా, పచారియా, సింగిమారి జిల్లాల్లో హర్గిలా ఆర్మీ చేసిన ప్రభావాన్ని వివరిస్తున్నప్పుడు ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ''ప్రతిరోజూ నేను హర్గిలా సైన్యాన్ని జరుపుకుంటాను. మొదట నా పనిని ప్రారంభించినప్పుడు పక్షి పట్ల ప్రేమ, సంకల్పం మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇది గృహిణులు పరిరక్షకులుగా మారిన సామాజిక ఉద్యమం. వారిప్పుడు తమ కుటుంబాలను కూడా ప్రభావితం చేసే నాయకులు'' అంటున్నారు.
సవాళ్లతో కూడుకున్నది
ఆమె వెళ్ళే మార్గంలో అడ్డంకులు ఉన్నప్పటికీ జీవశాస్త్రవేత్తగా, సంరక్షకురాలిగా ఇప్పటివరకు వచ్చారు. ''ప్రజలు మహిళా సంరక్షకులను చూశారు. నా పని చాలా సవాళ్లతో పాటు కచ్చితమైనది. అయితే గ్రామీణ మహిళలు నాయకులుగా మారడానికి వారిని విద్యావంతులను చేయడం చాలా ముఖ్యం. అప్పుడే పరిస్థితులు మంచిగా మారుతాయి'' ఆమె చెప్పారు.
బాధ్యతలు చూస్తున్నారు
ఒకప్పుడు గ్రేటర్ అడ్జటెంట్ కొంగ అంతరించిపోతున్న జాతిగా మిగిలిపోయింది. ఇప్పుడు దాని సంఖ్య పెరుగుతోంది. 27 గూళ్ళ నుండి ఇప్పుడు 250 ఉన్నాయి. హర్గిలా ఆర్మీ, గ్రామస్థులు మరింత సంతానోత్పత్తికి వీలుగా దాని రక్షణా బాధ్యతలు చూస్తున్నారు. పూర్ణిమ 2017లో నారీ శక్తి పురస్కారం, యుకే నుండి విట్లీ అవార్డుతో ఆమె చేసిన పనికి గుర్తింపు పొందారు.
హర్గిలా పక్షికి గౌరవం
ఎర్త్ డే నాడు ప్రారంభించబడిన నేషనల్ జియోగ్రాఫిక్ 'చేంజ్ ఫర్ వన్' ప్రచారంలో పూర్ణిమ భాగమయ్యారు. ''ఇది నాకే కాదు, హర్గిలా పక్షికి, మా సైన్యానికి, నా కమ్యూనిటీకి గౌరవం. ఇది ఇతర వ్యక్తులను పరిరక్షకులుగా మార్చడానికి ఆశాజనకంగా ఉంటుంది'' అని ఆమె చెప్పారు. సమాజ పరిరక్షణ అనేది అంతమంటూ లేని ప్రక్రియ అని కూడా ఆమె నమ్ముతున్నారు. ''నేను నా పనిని కొనసాగించాలనుకుంటున్నాను. నా చివరి శ్వాస వరకు ఆ పనికి కట్టుబడి ఉంటాను. తదుపరి దశలో హర్గిలా ఆర్మీ పరిరక్షణ నమూనాను ఇతర ప్రదేశాలలో, ఇతర జాతుల కొంగలు, పక్షులతో పునరావృతం చేయాలని నేను కోరుకుంటున్నాను'' అంటూ ఆమె తన మాటలు ముగించారు.