Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పామ్ పామ్... అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అది మీకు బాగా పరిచయమున్నదే. ఈ ఫొటోలు చూడండి. దారాల కుచ్చులతో తయారు చేసిన వాటినే పామ్ పామ్ అంటారు. ఒకప్పుడు వీటిని బ్యాగులకు వేళ్లాడదీసేవారు. దాంతో బ్యాగ్ చాలా కలర్ ఫుల్‌గా అందంగా కనిపించేది. ఆ తర్వాత చున్నీల చివర్లు కట్టేవారు. ఆ రకంగా పామ్ పామ్ మనకు బాగా పరిచయం. కాకపోతే ఇప్పుడు దీని లెవెల్ బాగా పెరిగిపోయింది. ఫ్యాషన్ ఇండిస్టీలో ఓ ట్రెండ్‌నే సృష్టించింది.
డ్రెస్ మీద రెండు పామ్ పామ్‌లు కుట్టండి... ఆ డ్రెస్ వాల్యూ ఎంత పెరిగిపోతుందో మీరు ఊహించలేరు. చెప్పులకి, హ్యాండ్ బ్యాగులకి, హెయిర్ బ్యాండ్లకి, టోపీలకి... వేటి మీదికి పామ్ పామ్ చేరినా దాని అందం రెట్టింపవ్వాల్సిందే. ఇక పామ్ పామ్ లతో చేసిన చెవి, కంఠాభరణాలకైతే మామూలు డిమాండ్ లేదు.
కొంత మంది వీటిని దారాల కుచ్చే కదా అనుకుంటారు. కానీ విదేశీ మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ వుంది. హాలీవుడ్ తారలు సైతం పామ్ పామ్ ఫ్యాషన్‌ని తెగ ఇష్టపడుతున్నారు. ఇండియన్ మార్కెట్లో కూడా పామ్ పామ్ ఉన్నా... దీని వాల్యూ మనవాళ్లకి ఇంకా పూర్తిగా తెలియలేదు. అందుకే కాస్త తక్కువ కనిపిస్తోంది. కానీ త్వరలోనే ఇది మన దేశంలో కూడా తన ముద్ర వేసి తీరుతుందని ఫ్యాషన్ నిపుణులు చెప్తున్నారు.
ఎప్పుడో అది ముద్ర వేసే వరకూ ఎదురు చూడటం ఎందుకు? మనమే ముందు దాన్ని స్వాగతిస్తే సరి. రంగురంగుల పామ్ పామ్ లతో తయారు చేసిన బట్టలు, వస్తువులు, ఆభరణాలు మార్కెట్లో ఉన్నాయి. ఆన్ లైన్లో చాలా చీప్‌గా కూడా దొరుకుతున్నాయి. కావాలంటే విడిగా కూడా పామ్ పామ్ లు దొరుకుతాయి. పది మి.మీ., ఇరవై మి.మీ. అంటూ సైజును బట్టి ఉంటాయి. యాభై పామ్ పామ్ లు ఉండే ప్యాక్ ఆన్ లైన్లో నూట యాభై రూపాయలకి దొరికేస్తుంది. కావాలంటే కొనుక్కుని మనమే మనకిష్టమైన వాటికి అటాచ్ చేసుకోవచ్చు. పామ్ పామ్ ఫ్యాషన్‌తో అదరగొట్టేయొచ్చు.