Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవితో పాటే నోరూరించే మామిడి పండ్లు కూడా వచ్చేస్తాయి. ఈ సీజన్లో మాత్రమే దొరికే వీటితో రకరకాల వంటలు చేసుకోవచ్చు. జ్యూసులు చేసుకొని తాగవచ్చు. విటమిన్ సి అధికంగా ఉండే ఈ పండులో రోగనిరోధక శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. పైగా ఏ సిజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే వీటితో రకరకాల పచ్చళ్ళు పెట్టుకొని కొంత కాలం నిల్వ చేసుకొని తింటారు చాలా మంది. అలాంటి కొన్ని పచ్చళ్లు మీకోసం...
మసాలా ఆవకాయ
కావలసిన పదార్ధాలు: మామిడికాయ ముక్కలు - ఒక గిన్నెనిండుగా, పసుపు - నాలుగు చెంచాలు, నూనె - 250 గ్రాములు, అల్లం, వెల్లుల్లి ముద్ద - ఆరు చెంచాలు, ఉప్పు - అర గ్లాసు, కారం - ఒక గ్లాసు, జీలకర్ర పొడి - పావు గ్లాసులో సగం, మెంతిపొడి - టేబుల్ స్పూను, కొబ్బరి పొడి - అర గ్లాసు, ధనియాల పొడి - పావు గ్లాసు, ఆవాలు, జీలకర్ర - నాలుగు చెంచాలు.
తయారుచేసే విధానం: ముందుగా ఒక బేసనలో కారం పొడి, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, కొబ్బరిపొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మామిడి ముక్కలు, మసాలా పొడుల మిశ్రమం వేసి బాగా కలియబెట్టి జాడీలోకి ఎత్తుకోవాలి. ఈ పచ్చడి ఎంతో రుచిగా వుంటుంది.
మామిడికాయ తురుము పచ్చడి
కావల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము - ఒక కప్పు, వేయించిన ఆవాలు - ఒక స్పూను, మెంతులు - ఒక స్పూను, కారం - మూడు స్పూన్లు, ఇంగువ - అరా స్పూను, ఉప్పు- తగినంత, పసుపు - తగినంత, నూనె - సరిపడ.
తయారు చేసే విధానం: ముందుగా ఆవాలు, మెంతులు వేయించి పొడిచేసుకోవాలి. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కారం, మెంతులు, ఆవాల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. అదే మూకుడులో మరికాస్త నూనె పోసి మామిడి తురుము, పసుపు, ఉప్పు, వేసి మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తరువాత దీనిలో పక్కకు తీసిపెట్టుకున్న కారం, మెంతిపొడి వేసిన నూనె వేసుకుని కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో తింటే అదిరిపోతుంది.
మామిడికాయ చట్నీ
కావాల్సిన పదార్ధాలు: మామిడి కాయలు - మూడు, ఆవాలు - అర స్పూను, ఇంగువ - స్పూను, మినపప్పు - స్పూను, మెంతులు - స్పూను, ఎండు మిర్చి - పది, ఉప్పు - రెండు స్పూన్లు, పచ్చి మిర్చి - ఐదు, పసుపు - చిటికెడు, నూనె - రెండు స్పూన్లు.
తయారు చేసే విధానం: ముందుగా మామిడి కాయలను బాగా కడిగి తొక్క తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బాండి తీసుకుని దానిలో నూనె వేసి మినపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, పసుపు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి. పోపు చల్లారాకా మిక్సిలో వేసి పచ్చి మిర్చి, ఉప్పు, మామిడి ముక్కలు కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చెయ్యాలి. తర్వాత తాలింపు వేసి చల్లారక పచ్చడిలో కలపాలి.
కేరళ ఆవకాయ
కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ముక్కలు - రెండు కప్పులు, ఉప్పు - రెండు టీ స్పూన్లు, నూనె - పావుకప్పు, ఆవాలు - రెండున్నర టీ స్పూన్లు, మెంతులు - అర టీ స్పూన్లు, కరివేపాకు రెమ్మలు - రెండు, కారం - మూడు టీ స్పూన్లు, వెనిగర్ - రెండు టీ స్పూన్లు.
తయారు చేసే విధానం: మామిడి ముక్కలు మరీ పెద్దగా కాకుండా చిన్నవిగా కట్ చేసుకోవాలి. వీటికి ఉప్పు పట్టించి అరగంట పాటు పక్కన ఉంచాలి. రెండు టీ స్పూన్లు ఆవాలు, మెంతుల్ని మెత్తని పౌడర్ లా చేసుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి నూనె పోయాలి. వేడెక్కాక మిగిలిన ఆవాలు వేయాలి. చిటపటలాడాక ఆవాలు, మెంతుల పొడిని వేయాలి. తర్వాత కారం, కరివేపాకు కూడా వేసి ఐదు సెకన్ల పాటు వేయించాలి. ఆపైన ఉప్పు పట్టించిన మామిడి ముక్కలు వేసి బాగా కలపాలి. రెండు క్షణాల తర్వాత వెనిగర్ కూడా వేసి కలిపి ఇంకాసేపు వేయించాలి. మామిడి ముక్కలకు అన్నీ బాగా పట్టేవరకూ వేయించి దించేయాలి. ఈ మిశ్రమాన్ని మూత గట్టిగా ఉండే సీసాలో వేసి భద్రపరచాలి.