Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ్ముళ్ళ కోసం ఆమె పదో తరగతిలోనే చదువు మానేయవలసి వచ్చింది. తన నైపుణ్యంతో పది లక్షల మంది భారతీయ మహిళా రైతులను ఫేస్బుక్ ద్వారా ఒకచోట చేర్చింది. వారిని సాధికారత వైపుగా నడిపిస్తుంది. ఆమే సవితా దాక్లే... ఆ స్ఫూర్తిదాయక జీవిత పరిచయం నేటి మానవిలో...
ముప్పై ఆరేండ్ల సవితా డాక్లే నివసించేది మహారాష్ట్రలోని పెండగావ్ అనే గ్రామంలో. అది ఆమె అత్తగారి ఊరు. తనలో దాగి ఉన్న నైపుణ్యంతో వ్యవసాయంలో రాణించింది. ఔరంగాబాద్‌కు సమీపంలో ఉండే పెండగావ్ గ్రామంలో వుంటూ భారతదేశం అంతటా పది లక్షల మంది మహిళా రైతులను ఫేస్బుక్ వేదికగా ఓచోట చేర్చింది.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని
చిన్నతనంలోనే కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేసింది. మహిళా రైతుల అభివృద్ధి కోసం ఓ సంఘాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఆమె చాలా గర్వంగా భావించే విషయం ఏమిటంటే ఔరంగాబాద్‌లో కేవలం రూ. 9,000తో తన ఇంటిని నిర్వహించడం. సవిత ఏడో తరగతి చదువుతుండగా ఆమె తండ్రి ఔరంగాబాద్‌లో పనిచేసే కంపెనీ మూతపడింది. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలోనే తల్లి నగరంలో కూరగాయల అమ్మడం ప్రారంభించింది.
తమ్ముళ్ళ కోసం చదువు మానేసి
'ఒకరోజు యూనిఫాం, పుస్తకాల కోసం వెయ్యి రూపాయలు అడగమని లేదా వాటిని కొనమని పాఠశాల వారు నాకు చెప్పారు. కాని ఈ విషయం నేను మా నాన్నతో ఎప్పుడూ చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత మా టీచర్ మా నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పారు. మా నాన్న ఏడవడం మొదలుపెట్టారు'' అని సవిత గుర్తుచేసుకుంది. కొద్దికాలంలోనే ఆమె ఇద్దరు అక్కల పెళ్లిళ్లు జరిగిపోయాయి. తల్లిదండ్రులు వ్యవసాయం చేసేందుకు గ్రామానికి చేరుకున్నారు. సవితకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. తను మాత్రం 10వ తరగతి వరకు చదివి తమ్ముళ్ల చదువుకు తోడ్పడేందుకు ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది.
అద్భుతమైన అవకాశం
2002లో పెండగావ్లోని ఓ రైతు కుటుంబంతో ఆమెకు వివాహం జరిగింది. రైతుగా గ్రామంలో ఆమె జీవితం ప్రారంభమైంది. మహిళా రైతులను చైతన్యం చేస్తూ ఇటీవల సవిత పెద్దఎత్తున గోధుమ పంటను పండించింది. ''ఒక మహిళా రైతుగా జీవితాన్ని గడపడం నాకు దొరికిన అద్భుతమైన అవకాశం. పొలాన్ని పంటకు సిద్ధం చేయడానికి, విత్తనాలు విత్తడానికి, నీరు పెట్టడానికి, వ్యవసాయంలోని సూక్ష్మ నైపుణ్యాలను తెలుసుకోవడానికి, ట్రాక్టర్ని ఉపయోగించడానికి అన్ని విధానాలను అనుసరించాను'' అని ఆమె లింక్డ్ఇన్లో రాసింది.
సేవా సమతలో చేరాలని
సవితను అత్తమామలు వ్యవసాయ కూలీగా (మజ్దూర్) చేర్పించారు. గంటకు రూ. 200 వేతనంతో పొలంలో పని చేయడం మొదలుపెట్టింది. ''నేను ఇంతకు ముందు పొలంలో పని చేయలేదు. కానీ నేను ఏదైనా చేయగలననే నమ్మకం నాకు ఎప్పుడూ ఉంటుంది'' అని ఆమె అంటుంది. సవిత మొదట గ్రామంలోని సేవా సమతలో చేరాలని అడిగినపుడు అక్కడి మహిళలు వ్యవసాయ పద్ధతులు, సవాళ్లను చర్చించడానికి గుమిగూడారు. అయితే అత్తమామలు ఇవేవీ వద్దని ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. అలాంటి ఒక సమావేశానికి హాజరయ్యే అవకాశం వచ్చినప్పుడు ఆమె ఆ అవకాశాన్ని వదులుకోలేదు. భర్త, అత్తమామలను ఒప్పించి ఆ సమావేశానికి హాజరయ్యారు.
''నేను రెండు అదనపు గంటలు పని చేస్తానని వారికి చెప్పాను. వ్యవసాయానికి సంబంధించిన చాలా సమాచారం తెలుసుకుంటే అక్కడే ఉన్నాను. నా అత్తమామలు తర్వాత నన్ను ఎంతగా తిట్టారో, ఆ రెండు గంటలపాటు నేను ఎంత భరించానో చెప్పలేను'' అని ఆమె పంచుకున్నారు. అయినా నిరుత్సాహపడకుండా సవిత సేవా సమతలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. వ్యవసాయంలో ఉత్తమ పద్ధతుల గురించి అవగాహనను ఎలా వ్యాప్తి చేయాలనే దానిపై మూడు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూ తర్వాత ఆమె కమ్యూనిటీ గ్రూప్‌లోకి ప్రవేశించింది. ఫోన్లు, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. పెళ్లికి ముందు తన తండ్రి ఇచ్చిన జియో ఫోన్‌తో తన పని ప్రారంభించింది. ఆమె చేసిన మొదటి పని ఏమిటంటే ఫేస్బుక్ సమూహాన్ని సృష్టించడం.
ఫేస్బుక్ వేదికగా
సవిత తన గ్రామానికి చెందిన 400 మంది మహిళలతో దీన్ని ప్రారంభించి. ఫోన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా వారికి శిక్షణ ఇచ్చింది. ఆమె ఇప్పుడు రెండు ఫేస్బుక్ గ్రూపులను నిర్వహిస్తోంది. భారతదేశం అంతటా ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది మహిళా రైతులు ఉన్నారు. ''నేను ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉంటానని అందరూ నాతో చెప్పేవారు. కానీ నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు. ఇంత పెద్దఎత్తున మహిళా రైతుల సమూహాన్ని సృష్టిస్తానని నేను ఊహించలేదు. నేను మహిళా రైతులను ఈ విధంగా ఒకచోట చేర్చగలనని ఎప్పుడూ అనుకోలేదు'' అంటుంది.
అవగాహన తక్కువ
వ్యవసాయానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సంఘం ఇప్పుడు చర్చిస్తుంది. వివిధ రకాల పంటలను విత్తడం, పండించడం వంటి చిట్కాలు, ఉపాయాలు నుండి మార్కెట్లో వాటికి ధర నిర్ణయించడం వరకు అందులో చర్చిస్తారు. చాలా మంది మహిళలకు దానిపై తక్కువ అవగాహన ఉంది. ముఖ్యంగా ఉత్పత్తుల ధర, వస్తువులను కొనడం, అమ్మడం మొదలైన వాటి గురించి అసలు అవగాహనే ఉండదు. ''నా విషయానికి వస్తే నేను బయటకు వెళ్లడం, నెట్వర్కింగ్ చేయడం, ఎందుకు, ఎంత చెల్లించాలో అర్థం చేసుకోవడానికి నా భర్తతో కలిసి పట్టుబట్టి వెళ్ళి నేర్చుకున్నాను'' అని సవిత స్పష్టంగా చెప్పింది. ఆమె స్ఫూర్తిదాయక స్వభావానికి సంకేతం. గ్రామంలోని మహిళలు విద్యుత్, ఇతర బిల్లులు చెల్లించడానికి బయటకు వెళ్లినప్పుడు అందరూ ఆశ్చర్యపోయేవారు. కానీ నేడు చాలా మంది మొబైల్ వాలెట్లు, చెల్లింపు సౌకర్యాలను ఉపయోగించి వారి సొంత లావాదేవీలు చేయడానికి బాధ్యత వహిస్తారు.