Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శెరంతి థామస్... నడిచందుకు కాళ్ళు లేవు. ఎవరైనా ఎగతాళి చేస్తారనే భయంతో ఒకప్పుడు అడుగుబయట పెట్టేది కాదు. ఒకానొక దశలో పాఠశాలకు వెళ్ళలేక కుంగిపోయింది. కానీ ఏదో చేయాలనే తపన ఆమెను నిలవనీయలేదు. చేతులనే ఆయుధాలుగా మలుచుకుంది. క్రీడలపై తనకున్న ఆసక్తిని కెరీర్‌గా మలుచుకుంది. వీల్ చైర్ బౌండ్ ఫెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వచ్చే నెలలో మలేషియాలో జరగనున్న తన మొదటి అంతర్జాతీయ ఫెన్సింగ్ పోటీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది.
చెన్నైకి చెందిన శెరంతి థామస్ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని పెరియవిలై అనే చిన్న కుగ్రామంలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి మత్స్యకారుడు. ఐదుగురు పిల్లలతో ఉన్న ఆ కుటుంబం ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతుండేది. శెరంతి పది సంవత్సరాల వయసు వచ్చే వరకు గ్రామంలోని స్థానిక పాఠశాలలో చదువుకుంది.
పాఠశాలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది
''నేను ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. ప్రజలు నన్ను ఎగతాళి చేస్తారని భయపడేదాన్ని. క్రీడలపై ఉన్న ఆసక్తితో వీల్‌చైర్ రేసింగ్, షాట్‌పుట్ మొదలైన వాటిలో నా చేతిని ప్రయత్నించాను'' ఆమె గుర్తుచేసుకుంది. ఆమె ఐదవ తరగతి తర్వాత రెండు సంవత్సరాలు పాఠశాలకు స్వస్తి చెప్పింది. ఇది ఆమెకు ఓ కష్టకాలం. ఇతర పిల్లలు పాఠశాలకు వెళ్లడం చూసి ఆమె ఏడ్చేది. చివరకు ఆమె తండ్రి ఆమెను నుంగనేరిలోని పాఠశాలలో చేర్పించారు. ఆమె ఎంతో సంతోషంగా వెళ్ళింది. అది ఆమె జీవితంలో ఉత్తమ నిర్ణయంగా మారింది.
తనలాంటి వారి ఆశకు ఉదాహరణగా
''నా చుట్టుపక్కల ప్రజలు కూడా నన్ను సాధారణ వ్యక్తిలాగానే బాగా చూసుకున్నారు. నేను నా షెల్ నుండి బయటకు వచ్చి పాఠశాలను ఆస్వాదించడం ప్రారంభించాను'' ఆమె చెప్పింది. ఆ సమయంలో ఆమె తనలాంటి వికలాంగులకు ఆశకు ఉదాహరణగా మారాలనే నమ్మకంతో స్థిరంగా ఉంది. ''నేను ఇతరులకు రోల్ మోడల్‌గా ఉండేందుకు నన్ను శక్తివంతం చేసే గుర్తింపు కోసం వెతకడం ప్రారంభించాను. నన్ను నేను చూసుకుంటానని, స్వతంత్రంగా ఉంటానని నా తల్లిదండ్రులకు విశ్వాసం ఇవ్వాలనుకున్నాను'' ఆమె చెప్పింది. 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఐటీఐ కోర్సు చేసి, కంప్యూటర్లు చదివి, ఆపై బీకామ్ డిగ్రీతో విద్యాభ్యాసం పూర్తి చేసింది. అందరూ మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబానికి సహాయం చేయగలదనే ఆశతో ఉన్నారు.
విజయాల పరంపర
2011లో ఆమెకు తెలిసిన ఓ వ్యక్తి శెరంతిని ఫెన్సింగ్‌కి పరిచయం చేశాడు. ఆమె దాన్ని తన మనసుకు దగ్గరగా తీసుకుంది. అదే సంవత్సరం ఫెన్సింగ్ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2013 వరకు తన విజయాల పరంపరను కొనసాగించింది. అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడానికి ఆమెకు రెండుసార్లు అవకాశాలు వచ్చినప్పటికీ స్పాన్సర్లు లేకపోవడం, ఆర్థిక సమస్యల వల్ల వదులుకోవలసి వచ్చింది. దాంతో శెరంతి ఫెన్సింగ్‌ను పూర్తిగా మానేసి పెరియవిలైకి తిరిగి వచ్చి కేవలం రూ. 4,000 ఇచ్చే ఉద్యోగంలో చేరింది. పూట గడవడమే కష్టంగా ఉన్న కుటుంబ పరిస్థితి ఆమెను చెన్నైకి తిరిగి రాకుండా చేసింది.
కరోనా తాకడంతో...
2019లో ఆమె చెన్నైకి తిరిగి వచ్చి మళ్లీ ఫెన్సింగ్‌ను చేపట్టేందుకు సిద్ధపడింది. తన ఫెన్సింగ్‌కు, కుటుంబానికి ఉపయోగపడేలా ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఆశించింది. ''2019లో నేను నాలుగు పతకాలు సాధించాను. రెండు వ్యక్తిగత పతకాలు, జట్టు కోసం రెండు బంగారు పతకాలు, ఒక రజతం సాధించాను. మళ్ళీ కాస్త రాణిస్తున్న సమయంలోనే మహమ్మారి తాకింది. ఉద్యోగం, ఫెన్సింగ్ టోర్నమెంట్లు ఏమీ లేకుండా ఖాళీగా ఉండిపోవల్సి వచ్చింది'' ఆమె చెప్పింది.
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం
పరిస్థితులు కాస్త మెరుగుపడిన తర్వాత శెరంతికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆమె ఇప్పుడు నెలకు దాదాపు 12,000 సంపాదిస్తుంది. ఆమె తన వసతి కోసం దాదాపు రూ. 6,000 ఖర్చు చేస్తుంది. మిగిలిన దానిలో కొంత తన శిక్షణ కోసం ఉపయోగించుకుంటూ మరికొంత తన తల్లిదండ్రులకు పంపిస్తుంది. ఆమెకు ఫెన్సింగ్‌కు సంబంధించిన సామాగ్రీ ఏవీ అందుబాటులో లేవు. టోర్నమెంట్లలో పాల్గొనడానికి తెలిసిన వారి నుండి అప్పు తీసుకుంటుంది.
తన లక్ష్యాన్ని చేరుకుంది
గత నెలలో ఒడిశాలో నేషనల్స్‌లో గెలిచిన తర్వాత మలేషియాలో జరిగే అంతర్జాతీయ వీల్‌చైర్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు శెరంతి మరోసారి అర్హత సాధించింది. ''మలేషియాలో ఎస్కార్ట్‌తో ప్రయాణించడానికి, ఇతర ఖర్చుల కోసం నాకు రూ. 2.5 లక్షలు కావాలి. దీని కోసం నేను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి Milaap.orgలో క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించాను'' అని శెరంతి చెప్పింది. స్పందించిన ప్రజలు ఆమెకు సహకరించారు. అతి తక్కువ కాలంలోనే శెరంతి తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు ఆమె టోర్నమెంట్ కోసం మలేషియా వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఫెన్సింగ్ ఛాంపియన్ కావాలనే తన కలలను నిజం చేసుకోవడానికి తర్వాత కాలంలోనైనా ప్రభుత్వ నుంచి తనకు మద్దతు లభిస్తుందని శెరంతి భావిస్తోంది.