Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. అందులో మహిళాలోకం కూడా అగ్రభాగంలో నిలిచింది. కార్మిక హక్కులు కాలరాస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల శ్రమకు విలువ లేకుండా పోయింది. అడుగడుగునా వివక్ష కొనసాగుతూనే ఉంది. అందుకే ఆ నాటి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత నేటి తరంపై మరితం పెరిగింది.
ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం. చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు.
బానిస బతుకులు
యాంత్రికయుగం రాకముందు మనిషి గంటలకొద్దీ పనిచేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో పెట్టుబడి ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పనిగంటల పోరాటం వచ్చింది. మహిళలు పుట్టిన పసిపిల్లలను సైతం విడికి ఫ్యాక్టరీలకు పోవాల్సి వచ్చేది. పిల్లలకు పాలు ఇవ్వలేక ఎంతో మంది గర్భశోఖంతో అల్లాడిపోయిన రోజులవి.
చికాగో కంటే ముందే
భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్లో 1862లో సమ్మెచేశారు. అప్పటివరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలకవర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. అయితే అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారలేదు. కాబట్టి ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు.
చైతన్యం పెరిగింది
1923లో మొదటిసారి భారతదేశంలో 'మేడే' ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటి నుండి 'మేడే'ను పాటిస్తున్నాం. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.
ఐటీలో శ్రమ దోపిడి
ఐ.టి.రంగంలో ఎంతోమంది అమ్మాయిలు, యువకులు పనిచేస్తున్నారు. మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారు. అమెరికాలో వున్న కంపెనీలు అక్కడ ప్రజాచైతన్యం ఉన్నది కాబట్టి కార్మిక చట్టాలు అమలుకానటువంటి ఇండియాలో కంపెనీలు పెడుతూ వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారు. మాదాపూర్‌లోని హైటెక్ సిటీలో విద్యావంతులైన యువత నేడు విపరీతమైన శ్రమ దోపిడీకి బలవుతున్నది. రాత్రుళ్లు అమ్మాయిలకు భద్రతలేకుండా ఇళ్ళకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నది.
అమలుకై పోరాటం
పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంతవరకు శ్రమదోపిడీ, ఎక్కువ పనిచేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలను ఐ.టి. రంగంలో కూడా అమలుకై పోరాటం నేటి అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని మన పాలకులు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయి. అసంఘటితరంగంలో అయితే సరేసరి. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన ఔట్ సోర్సింగ్‌లోను కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవు.
- పాలపర్తి సంధ్యారాణి
జీతాలు తక్కువ
మాకు చదువు రాదు. మే డే అంటే తెలియదు. గత 25 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్నాము. మొదట్లో మమ్మలి పర్మనెంట్ ఉద్యోగస్తులు మే డే నాడు పనికి రానిచే వారు కాదు. ఇప్పుడు అందరం బాగానే కలిసి మెలిసి ఉంటున్నాం. మాకు జీతాలు తక్కువ. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా చేస్తే మొత్తం జీతం వస్తుంది. లేకుంటే ఎన్ని రోజులు సెలవులు పెడితే అన్ని రోజులు జీతంలో కోత. జీతాలు పెంచుతారు, పర్మనెంట్ చేస్తారు అనే ఆశతో బతుకుతున్నాము. మాకు హెల్త్ కార్డ్స్ లాంటివి ప్రభత్వం ఇస్తే కొంతలో కొంత ఊరట.
- బి.పద్మ, ఓ.యూ లేడీస్ హాస్టల్.
సదుపాయాలు లేవు
27 సంవత్స రాలుగా స్వీపర్‌గా చేస్తున్న. మొదట్లో నా జీతం 350 రూపాయలు ఉండేది. కరోన లాక్డౌన్ సమయంలో కూడా నేను పనికి వచ్చాను. రావటానికి పోవటానికి బస్సులు ఉండేవి కావు. కొంత దూరం నడిచి, ఎవరైనా లిఫ్ట్ ఇస్తే పనికి సమయానికి చేరుకునే వాళ్ళం. ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సదుపాయాలు లేవు. మా కష్టం ఎవరూ గుర్తించరు. మంచి రోజులు రాక పోతాయా అనే ఆశతో బతుకుతున్న.
- కె.సునీత, గాంధీనగర్
పర్మినెంట్ అనేది నోటిమాటనే
నేను 25 ఏండ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్న. నాకు ముగ్గురు పిల్లలు. వచ్చే జీతం సరిపోక నా డ్యూటీ అవ్వగానే ఇళ్లల్లో పని చేసుకుంటున్నాను. పర్మనెంట్ చేస్తాం అనేది నోటి మాటాగానే ఉండి పోయింది. ఎంత అనారోగ్యం అయిన సరే మా వైద్య ఖర్చులు మేమే భరించాల్సి వస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత మాకు లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టించుకునే నాధుడు లేడు. ప్రభుత్వం ఏదైనా వైద్య సదుపాయం కల్పిస్తే బావుంటుంది.
- డి. రాజమని, రాంనగర్
జీతంలో కోతే
25 ఏండ్లుగా చేస్తున్న. ఉద్యోగంలో చేరినప్పుడు నా జీతం 1500 వందలు. పండుగలకు బోనస్ అంటూ ఉండదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు పండుగ కదా అని డ్యూటీకి వెళ్ళకుంటే జీతంలో కోత విధించేవారు. నాకు ముగ్గురు పిల్లలు. మా ఆయన కూడా స్వీపర్‌గానే చేసేవాడు. జీతం సరిపోయేది కాదు. పెరిగే ఖర్చులు. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని అనుకునే దాన్ని. కానీ చదివించే స్థోమత లేక చదివించ లేక పోయాను. మాకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు కూడా ఉండవు. దాదాపు ఐదు సంవత్సరాలకు ఒక సారి పెరిగేవి. ఇప్పుడు అదే పద్ధతి. వారాంతపు సెలవులు తప్ప వేరే సెలవులు ఉండవు. మావి భద్రత లేని ఉద్యోగాలు. మాకేదైనా అయితే మా కుటుంబాలు వీధిన పడాల్సిందే. పిల్లల చదువులు నిమిత్తం కానీ, వైద్య పరంగా కానీ మాకు ఎటువంటి సదుపాయాలు లేవు. ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వంటివి కూడా లేవు. ప్రభుత్వం మా కష్టనష్టాలను గుర్తించి మాకు తగిన సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాను.
- ఎస్.శంకరమ్మ, హిమాయత్‌నగర్