Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మంది ప్రసవ సమయంలో చాలా కష్టాలు పడతారు. నిజంగా కూడా అది తల్లీ పిల్లలకు ఇద్దరికీ చాలా ఒత్తిడితో కూడిన సమయం. ఇపుడు చాలామంది ఆంటీనేటల్ చెకప్‌లు మూడు నుంచి ఐదు సార్లు, అల్ట్రాసౌండు పరీక్షలు ఐదు సార్లు చేయించడం పరిపాటి. ఈ స్కానింగులో బిడ్డ సెక్సు నిర్ధారించడం, చెప్పమని అడగడం PCPND ACT ప్రకారం నేరం, శిక్షార్హులు. ఇక పోతే ఇపుడు టెక్నాలజీ పెరిగింది. స్కానింగ్ ప్రతిచోట ఉంది. పిల్ల ఎదుగుదలను, పిండంలో మార్పులను, వారికుండే చాలా జబ్బులను వరకు పిండదశలోనే గుర్తించవచ్చు. కొన్నింటిలో అబార్షను చేయవలసి రావచ్చు..
నార్మల్ డెలివరీ సమయంలో ఒక్కోసారి డెలివరీ చాలా సేపు కాకపోవడం వలన మెటర్నల్ ఎక్జార్షన్ అయినా, గర్భసంచి కంట్రాక్షన్సు ఆగిపోయినా సిజేరియనే దిక్కు. తల్లికి ఏమన్నా గుండె జబ్బులు లాంటివి ఉన్నా, ఒబేసిటీ ఉన్నా, బేబి పెద్దగా ఉన్నా, ప్రెసియస్ బేబి అయినా, పిల్లలు పుట్టే ఛాన్సు చాలా దాటిపోయినా, లేక IVF బేబిలకు, PET లేదా ఎక్లాంప్సియా అని ఫిట్సు వచ్చినా సిజేరియన్ అవసరం.
కాన్పు ఎక్కువ సేపు కానపుడు బేబి ఫీటల్ డిస్ట్రెస్లోకి పోయినా, అంటే హార్టు రేటు డాప్లర్‌తో చూసేటపుడు పెరిగినా, బేబి చనిపోయే పరిస్ధితులలో అర్జంటుగా సిజేరియన్ చేయాలి. సెఫలో పెల్విక్ డిస్ ప్రపోషన్ అంటే పిండం తల డయామీటరు, మన కటివలయం లోపల డయామీటరు సాధారణ డెలివరీకి అనుకూలమా అనేదే నార్మల్ డెలివరీలో ప్రముఖ పాత్ర వహిస్తాది. సాధారణంగా డెలివరీ సమయంలో హార్మోనుల ఎఫెక్ట్ వలన కటివలయపు జాయింట్లు రిలాక్స్ అయి ఒకింత దారినిస్తాయి. అది ఓ 5శాతం ఉండచ్చు. అది ఎంత సానుకూల వాతావరణం కలిగిస్తుంది అనే దాన్ని బట్టి నార్మల్ డెలివరీ సక్సెసు ఉంటుంది. దీనికి 24 గంటలు ఓ పెద్ద టీము కంటికి రెప్పలా చూసుకుంటూ పని చేయాలి. ఇపుడు పెయిన్ లెస్ లేబర్ అనే కొత్త విధానం వచ్చింది. తల్లికి ప్రసవవేదనే ఉండదు. పెద్ద ఆసుపత్రిలలో మత్తుమందు వైద్యుల పర్యవేక్షణలో జరుగుతుంది.
నార్మల్ డెలివరీని ప్రోత్సహించే సింటోసినాన్ ఇంజెక్షన్లు, మజిల్ రిలాక్స్ ఇంజక్షన్లు, అవసరమయితే ఎపిసియాటమీ లేదా ఫోర్సెప్సు డెలివరీలు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోర్సిప్సు డెలివరీలలో ఒక్కోసారి చాలా రిస్కు ఉంటుంది. అటువంటి వారికి సిజేరియన్ అనేది చాలా సులభమైన ఆపరేషన్. స్పైనల్ మత్తులో చేస్తారు. గంటలో అయిపోతుంది. తల్లీ బిడ్డ సేఫ్. ఇపుడంతా చాలామంది 30 ఏండ్ల తర్వాత డెలివరీ. ఒబేసిటి, బిపి, షుగర్ ఉంటాయి. ఇలాంటి వారికి సిజేరియన్ ఎంతో ఉపయోగపడుతుంది. కాకపోతే కొందరు ఎలాగు సిజేరియనే అని జాతకాల పిచ్చితో ముహూర్తం పెట్టి చేసుకోవడం వలన ముహూర్తం సిజేరియన్ అని అపహాస్యం అయింది.
- డా|| సి. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS) గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు, ఆంధ్రప్రదేశ్.