Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్‌ను ఉంటావా! పోతావా! అని అడిగితే 'ఊహూ' అనే అంటోంది. ఒక చోట నుంచి మరోచోటికి ప్రపంచమంతా ప్రయాణం చేస్తోంది. పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. తన పుట్టిల్లు అయిన చైనాను అయితే అసలు వదిలిపెట్టడం లేదు. షాంఘైలో ఇంకా లాక్డౌన్ కొనసాగుతూనే ఉన్నది. మన దేశంలోనూ ఢిల్లీలో కేసులు పెరుగుతున్న సంఘటనలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వటం మొదలుపెడుతున్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన 'కోవోవాక్స్' అనే టీకాను పిల్లలకు ఇవ్వనున్నారు. వీరి తర్వాత 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అమెరికాలో అయితే నాలుగైదేళ్ళ పిల్లలకు సైతం ఎప్పుడో టీకాలు ఇచ్చేశారు. కోవోవాక్స్ టీకా రెండు డోసుల మధ్య తొమ్మిది నెలల సమయం ఉంటుంది. మనకు టీకాలు అన్నీ పూర్తి అయ్యే వరకూ జాగ్రత్తలు పాటించాల్సిందే. చాలా మంది మాస్కులు వాడటం మానేశారు. శానిటైజర్లు ఎప్పుడో పక్కన పడేశారు. కానీ మనల్ని రక్షించేది వ్యాక్సిన్ల కన్నా మాస్కులే. కాబట్టి మాస్కులు ధరిద్దాం, క్షేమంగా ఉందాం!
పిస్తా పప్పుల పొట్టుతో...
పిస్తా, బాదం, జీడిపప్పు మొదలైన డ్రైఫ్రూట్స్‌ను ఈ మధ్య చాలామంది వాడుతున్నారు. ప్రతి వారిలో హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోయి డ్రైఫ్రూట్స్, మామూలు ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారు. మా ఇంట్లో కూడా అలాగే తింటున్నాం. పిస్తా పప్పుల పొట్టుతో నేను చాలా బొమ్మలు చేశాను. ఈరోజు నేను చెంగు చెంగున దూకే లేడిని తయారు చేశాను. ఈ పిస్తా మధ్య ఆసియా, తూర్పు మధ్య ప్రాంతాలలో పెరిగే మొక్క. 'అనకార్టియేసి' కుంటుంబానికి చెందిన చిన్న మొక్క. దీని శాస్త్రీయనామం 'పిస్తాషియా వెరా'. ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్, ఇరాన్‌లు సంయుక్తంగా 75శాతం ఉత్పత్తి చేయడం జరిగింది. వంద గ్రాముల పిస్తా పప్పులో 27.5 గ్రాముల కర్పోహైడ్రేట్లు, 20 గ్రాముల ప్రోటీన్, 45 గ్రాముల కొవ్వులు ఉన్నాయి. ఈ చెట్టు చాలా ఎక్కువ కాలం బతుకుతుంది. దాదాపు 300 సంవత్సరాలు బతుకుతుంది. కొన్ని కీటకాల వలన ఈ చెట్లకు వ్యాధులు వస్తాయి. ఆస్పర్జిల్లస్ వంటి ఫంగస్ వలన కూడా పిస్తా చెట్లకు వ్యాధులు సంక్రమిస్తాయి. మధ్యలో విత్తనం ఉండి పైన గట్టి పెంకు లాంటి తొడుగు ఉంటుంది. పైన తొడుగు తీసి లోపలి పప్పు తింటాము.
వెంటిలేటర్ వేస్టుతో...
ఆసుపత్రులలో ఉండే వెంటిలేటర్ మిషన్లలో వాడే ప్లాస్టిక్ పైపులు, ప్లాస్టిక్ వస్తువులు వంటి డిస్పోజబుల్ వస్తువులు ఉంటాయి. అలాంటి వస్తువులతో నేను బొమ్మలు చేస్తున్నాను. ఈరోజు లేడిని తయారు చేశాను. ఇది బంగారు లేడికాదు. మరి వెంటిలేటర్ వేస్టు అంతా తెల్లని తెలుపుతో ఉంటుంది. ఈ లేళ్ళు 'సెర్విడే' కుటుంబానికి 'ఆర్టియోడాక్టైలా' క్రమానికి చెందిన క్షీరదాలు. క్షీరదాలు అంటే బిడ్డలకు పాలిచ్చి పెంచే జంతువులు అన్నమాట అంటే ఆవులు, గేదెలు, మానవులు లాగా పెంచుతాయి. లేళ్ళలో చాలా రకాలు ఉంటాయి. రెడ్ డీర్, రీన్ డీర్, వైట్ లైలేడ్ డీర్, వాటర్ డీర్, హార్నోడ్ డీర్ వంటివి ఉంటాయి. కొమ్ములున్న ఏంటిలోప్లు వేరే కుటుంబానికి చెందినటువంటివి సెర్విడే కుటుంబంలో మూడు ఉపకుటుంబాలు ఉన్నాయి. కాప్రియోలినే, సెర్వినే, హైడ్రోపోటినే అనే మూడు ఉపకుటుంబాలలో అన్ని జాతులూ వర్గీకరించబడ్డాయి. అంటార్కిటికా, ఆస్ట్రేలియా ఖండాలు తప్ప మిగతా ప్రపంచమంతా ఈ లేళ్ళు వ్యాపించి ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో ఒకే ఒక్క జాతి లేళ్ళు ఉంటాయి. ''బార్బరీ స్టాగ్'' అనే జాతి లేళ్ళు ఆఫ్రికాలో ఉంటాయి. అట్లాస్ పర్వతాలలో 'రెడ్ డీర్' అనే జాతి లేళ్ళు ఉంటాయి. ''మెగా సిరోయిడస్ ఆల్జెరికస్' అనే జాతి లేళ్ళు ప్రస్తుతం అంతరించిపోయాయి గానీ 6000 సంవత్సరాల కిందటి వరకు నార్త్ ఆఫ్రికాలో జీవించి ఉన్నాయి. దక్షిణ మధ్య అమెరికాలో బ్రోకెట్ డీర్ అనే లేళ్ళ జాతి ఉంటుంది.
పారిజాత విత్తనాలతో...
ఈ మధ్య నేను పారిజాత విత్తనాలను సైతం నా బొమ్మల్లో వాడుకుంటున్నాను. మా అపార్టుమెంట్లో ఉన్న పెద్ద పారిజాత వృక్షానికి గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతున్నాయి. ఆ కాయలు ఎండిపోయాక కోసి దాచుకున్నాను. ఇది అర్థరూపాయంత సైజుల ఉంటాయి. వీటితో ఈరోజు లేడిని తయారు చేశాను. లేడి పొట్ట నిండా అవిశగింజల్ని నింపాను. అవిశగింజల్ని ప్రజలు ఈ మధ్య ఎక్కువగా ఆహారంలో తీసుకుంటున్నారు. అదిమానవుల కాలంలో మనుషులు లేడి మాంసాన్ని విపరీతంగా తినేవారు. ఇప్పుడు నిషేధించినా అక్కడక్కడా తింటూ పట్టుబడుతూనే ఉన్నారు. మానవులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయనడానికి ఉదాహరణగా పూర్వపు గుహల్లో చెక్కిన శిల్పాలలో లేళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. మానవుని చిత్రకళలో సైతం లేళ్ళు ప్రధాన పాత్రనే పోషించాయి. ఫ్రాన్స్ దేశంలోని ''లాస్కోక్స్'' ప్రాంతంలో బాక్టరీ స్టాగ్'ల 90 చిత్రాలను కనుగొన్నారు.
చింతగింజలతో...
ఇంట్లో చింత పండు లేకుండా కూరలు వండలేము కదా! చింతపండు ఉంటే దానిలో చింతగింజలు వస్తుంటాయి. వాటిని దాచుకుని బొమ్మలు చేస్తున్నాను. పూర్వం వీటిని అరగదీసి పచ్చీస్ ఆటలో కాయలుగా వాడుకునేవారు. చింతగింజలోపల తెల్లగా ఉంటుంది. అరగదీసినపుడు ఒకవైపు నల్లగా, మరోవైపు తెల్లగా ఉండటం వలన గవ్వలకు బదులుగా వాడుకునేవారు. ఇప్పుడు చింతగింజలతో లేడిని సృష్టించాను. దీని కడుపు నిండా 'బ్రౌన్‌రైస్' నింపాను. ఈ మధ్య కాలంలో షుగర్ జబ్బు పెరిగిపోవటం వలన అందరూ ముడి బియ్యానికే ప్రాధాన్యమిస్తున్నారు. మా చిన్నప్పుడు మారైసుమిల్లులో బియ్యం పాలిష్ చేస్తే డబ్బులు ఎక్కువ అవుతాయని ముడి బియ్యమే తీసుకెళ్ళేవారు కొంతమంది. అప్పట్లో వారిని డబ్బులేని వాళ్ళు అనుకునేవారు. ఇప్పుడు మనం ఆరోగ్యం లేని వాళ్ళం అయిపోయాం. ప్రాచీన కాలంలోని గ్రీకులు, ఈజిప్జియన్లు లేళ్ళ బొమ్మలను తమ కళల ద్వారా ప్రదర్శించేవారు. 'వర్లి ఆర్ట్'లో సైతం తమ కళల ద్వారా ప్రదర్శించేవారు. 'వర్తి ఆర్ట్'లో సైతం లేళ్ళ బొమ్మలు ఎక్కువగా ఉంటాయి. నేనూ చిత్రించాను.
ఇంజక్షన్ మూతలతో...
ఇంజక్షన్ మూతలతో చేయని బొమ్మే లేదు మా ఇంట్లో. మరి లేడి బాధపడదూ. అందుకే ఎర్రని మూతలతో లేడిని తయారు చేశాను. డో ఏ డీర్! ఏ ఫీమీల్ డీర్! అంటూ పిల్లలు పాడుకునే నర్సరీ రైమ్ బాగుంటుంది. సాహిత్యంలోనూ వీటి పాత్ర తక్కువేమీ కాదు. జానపద సాహిత్యంలోనూ, పూర్వపు గాధల లోనూ వీటి ప్రస్తావన చాలా చోట్ల కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈసఫ్ కథల్లోనూ లేళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ''ద స్టాగ్ ఎట్ ద పూల్, ద ఒన్ ఐడ్ డో, ద స్టాగ్ అండ్ ఎ లయన్ అనే కథలలో లేడి ప్రధాన పాత్రధారి. నాలుగవ శతాబ్ధంలోని ప్రాచీన గ్రీకు రాజ్యంలో లేడి తలలను అలంకారంగా వాడేవారు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్