Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంతో మంది జీవితాలను మెరుగుపరిచేందుకు నిర్భయంగా ముందుకు వచ్చారు. అసమానతలతో పోరాడుతూ, విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. వారే ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాకు చెందిన పింకీ, రింకూ, నిషా, పునీత. మహిళలకు సాధికారత కల్పించేందుకు వీరు కృషి చేస్తున్నారు. అమ్మాయిలు చదువుకునేందుకు స్వయం సహాయక బృందాలను ప్రారంభించారు. అలాగే అమ్మాయిల హక్కులు, అవసరాల గురించి అవగాహన కల్పిస్తున్న వారి గురించి నేటి మానవిలో...
ఇరవై ఏండ్ల పింకీ తన చదువు, ఇంటి పనులు పూర్తి చేసుకుంటూ ఉండగా అనుకోకుండా పెద్ద శబ్దం వినిపించింది. సమీపంలో ఓ బాల్య వివాహాం జరుగుతుంది. ఈ విషయం గురించే ఆమెకు చెప్పడానికి కొంతమంది గ్రామస్తులు వచ్చి తలుపు కొడుతున్నారు. అది తెలుసుకున్న పింకీ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన సోదరీమణులు నిషా, రింకూతో సహా తన సిబ్బందితో కలిసి వివాహం జరుగుతున్న ప్రదేశానికి పరుగెత్తింది. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది మహిళలు ధైర్యం చేయని పనిని ఆమె చేసింది.
మద్దతు సేకరించి
సినిమాల్లో కాకుండా మన చుట్టూ సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న అన్యాయమైన ఆచారాలను అరికట్టాలంటే ధైర్యం ఎక్కువ కావాలి. వారు అమ్మాయిలు కావడంతో వారి మాటలను చాలా మంది పట్టించుకోలేదు. పైగా బెదిరించారు. కానీ బాల్య వివాహాల పర్యవసానాలను వివరించడానికి ఈ అమ్మాయిలు ఓ చక్కని మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ పింకీ ముందుకు సాగడంలో విఫలమైంది. అందుకే సాక్ష్యం కోసం ఫొటోలను తీసి, సర్పంచ్, గ్రామ సీనియర్ సభ్యుల నుండి మద్దతును సేకరించి. 100కి డయల్ చేసింది. ఇలా ఇద్దరి జీవితాలను రక్షించారు. ఈ సంఘటన పింకీ వంటి అమ్మాయిలను కదిలించింది.
మరింత మందికి స్ఫూర్తినిస్తుంది
బాల్య వివాహాలను అంతం చేసేందుకు వారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. దానికోసం ధైర్యాన్ని ప్రదర్శిస్తూ అమ్మాయిలకు మంచి జీవితాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. నలుగురు ధైర్యవంతులైన అమ్మాయిలు పింకీ, రింకూ, నిషా, పునీత ఆశయం మరింత మందికి స్ఫూర్తినిస్తుంది. ''ఇంతకుముందు మమ్మల్ని బెదిరించే వ్యక్తులు ఇప్పుడు మమ్మల్ని భయపెడుతున్నారు. ఎందుకంటే మేము తలవంచడానికి నిరాకరించాము. దాదాపు అందరూ మొదట్లో మమ్మల్ని, మా కుటుంబాలను బెదిరించేందుకు ప్రయత్నించారు. అనేక మాటలు అన్నారు. మమ్మల్ని అంగీకరించడానికి నిరాకరించారు. అయితే ఇదే ఆలోచనతో పోరాడేందుకు అందరం కలిసి వచ్చాం. ఇప్పుడు వారు పిల్లల పేర్లను పాఠశాలలో నమోదు చేయడం నుండి పౌర సమస్యల వరకు గ్రామంలో పనులు చేయడానికి మా వద్దకు వస్తారు'' అని పునీత చెప్పారు. ''అబ్ బిల్కుల్ డర్ నహీ లగ్తా (ఇప్పుడు ఇక మాకు ఎలాంటి భయం లేదు)'' అని ఆమె జతచేస్తుంది.
యువ మహిళా సమూహంలో భాగంగా
21 సంవత్సరాల పునీత ఖుషినగర్ జిల్లాలోని షాపూర్ ఖల్వా పట్టి గ్రామంలో నివసిస్తుంది. స్థానిక కళాశాల నుండి ఆర్ట్స్‌లో (బీఏ) బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంది. తన 10-11 సంవత్సరాల వయసులో సంఘటన్ (స్వయం-సహాయ సమూహం)లో చేరిన ఈమె బాల్య వివాహాలపై, లింగ అసమానతతో పోరాటం చేస్తుంది. అలాగే రాణి లక్ష్మీ బాయి కిషోరి సంఘటన్ అనే యువ మహిళా సమూహంలో భాగంగా ఉంది. ఆమె సోదరి త్రయం రమాబాయి కిషోరి సంఘటన్ సభ్యురాలు. గ్రామాలలో స్వయం సహాయక బృందాలు (SHGs) ఏర్పాటు చేసుకుని పొదుపు చేసుకుంటున్నారు. ఇవి ఒకరికొకరు సహాయం చేసుకునే మహిళలచే నిర్వహించబడే సమూహాలు. ఈ డబ్బును ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది గ్రూప్ సభ్యులు కలిసి వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. స్థానిక మహిళల ఆరోగ్యం, పర్యావరణం, విద్య మొదలైనవాటిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటారు.
వారి ఏకైక మార్గం పెండ్లే
''ఇక్కడ ఆడపిల్లలకు ఉన్న ఏకైక ఆప్షన్ చిన్నవయసులోనే పెండ్లి చేసుకోవడం. రోజంతా పొలాల్లో పని చేయకుండా తప్పించుకునేందుకు వారికి కున్న ఏకైక మార్గం ఇది. ఇది మారాలి, చదువుతోపాటు ధైర్యం ఒక్కటే దీనికి పరిష్కారం'' అని మిష్రోలి గ్రామంలో నివాసం ఉంటున్న స్థానిక కళాశాలలో బీఏ చదువుతున్న పింకీ చెప్పింది. మహిళలకు సాధికారత కల్పించడం గత 10 సంవత్సరాలుగా బాలికలు స్వయంగా నేర్చుకుంటారు. ఈ గ్రూపుల ద్వారా కుట్టుపని, కిచెన్ గార్డెనింగ్, కంపోస్ట్ తయారీ మొదలైన అనేక కార్యకలాపాలలో శిక్షణ పొందారు. ఆ నలుగురు అమ్మాయిలు వారి కళాశాల తర్వాత కుట్టు తరగతులు తీసుకుంటారు. స్థానిక మహిళలు తమ సొంత కిచెన్ గార్డెన్లను పెంచుకోవడంలో సహాయపడతారు. ''ఇది ఇప్పుడు సమీప గ్రామాల్లోని మహిళలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. వారిని స్వయం నిలకడగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మా గ్రామంలోని కొంతమంది మహిళలు స్థానికంగా కూరగాయలు అమ్ముతున్నారు. అలాగే కుట్టుపని చేయడం, చేతిపనులు నేర్చుకోవడం, నేర్పించడం మొదలైనవి చేస్తున్నారు'' అని పింకీ చెప్పింది.
విద్యా విలువలను నేర్చుకోవడమే
21 ఏండ్ల నిషా మహిళలు మరింత మెరుగైన ఆర్థిక ప్రణాళికలను తయారు చేస్తారని భావిస్తోంది. ''చాలామంది పురుషులు మద్యపాన వ్యసనంతో బాధపడుతున్నారు. వారి కుటుంబాలపై భయంకరమైన ప్రభావం పడుతుంది. మనల్ని మనం శక్తివంతం చేసుకోవడం, ఐక్యంగా ఉండడం, విద్యా విలువను నేర్చుకోవడం మాత్రమే మన సమస్యలకు నిజమైన పరిష్కార మార్గం. మగవాళ్లకు బాధ్యతను నేర్పించాలి'' అని నిషా చెప్పింది. ఈమె పునీతతో పాటు షాపూర్ ఖల్వా పట్టి గ్రామంలో నివాసం ఉంటూ బీఏ రెండో సంవత్సరం చదువుతోంది.
సామాజిక సమస్యలపై
ఈ బృందం వారి గ్రామాల్లో ప్రాథమిక పౌర సౌకర్యాల లభ్యతపై తనిఖీలు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆందోళనలు, వివిధ కార్యక్రమాలు, చెట్ల పెంపకం, పరిశుభ్రత డ్రైవ్‌ల కింద సబ్సిడీల లభ్యతలో జరిగే జాప్యంతో సహా వివిధ కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. మహిళల పరిశుభ్రత, సామాజిక సమస్యలపై సెమినార్లు కూడా పెడుతున్నారు. పాఠశాల డ్రాపౌట్లకు ఉచిత ట్యూషన్ను కూడా ఏర్పాటు చేశారు. ఋతు పరిశుభ్రతకు సంబంధించిన ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, భద్రత, పరిశుభ్రతను మెరుగుపరచడానికి గ్రామీణ బాలికలకు శానిటరీ నాప్కిన్లను కూడా తయారు చేస్తున్నారు.
తల్లిదండ్రును ఒప్పించి
గ్రామీణ భారతదేశంలో అమ్మాయిలు పాఠశాల మధ్యలోనే మానేయడం సాధారణం. మహమ్మారి ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. చాలా మంది గ్రామీణ బాలికలు ఇంటి పనులు, తోబుట్టువుల సంరక్షణను ప్రాథమిక కారణాలుగా పేర్కొంటూ చదువు మానేస్తున్నారు. ఈ నలుగురు అమ్మాయిలు తమ బృందం సహాయంతో పాఠశాలలో నమోదు ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ కుమార్తెలను పాఠశాలకు పంపేలా తల్లిదండ్రులను ఒప్పించారు. వారు కొన్ని నెలల వ్యవధిలోనే దాదాపు 80-50 మంది పిల్లలను నమోదు చేసుకోగలిగారు. ఈ కార్యక్రమాన్ని చురుగ్గా కొనసాగించారు.
డ్రాపౌట్లను గుర్తించి
స్థానిక నాయకుల మద్దతు కూడగట్టారు. వారి గ్రామాల్లో విద్యపై అవగాహన పెంచడానికి ప్రచారం చేశారు. ''మేము పిల్లలను పాఠశాలల్లో చేర్పిస్తాము. డ్రాపౌట్లను గుర్తించడంలో సహాయం చేస్తాము. వారు ఏవైనా అడ్మిషన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే దానిని పరిష్కరించేందుకు మేము వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతాము. ఇది స్కూల్ చలో అభియాన్ ద్వారా కూడా జరుగుతుంది'' అని 12వ తరగతి చదువుతున్న 17 ఏండ్ల రింకు అనే విద్యార్థిని చెప్పింది. ఈ ప్రచారం 10 గ్రామాల్లోని 1,500 కుటుంబాలకు అవగాహన కల్పించింది. 166 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి దోహదపడింది.
అట్టడుగు యువతుల కోసం
2020లో ఈ గ్రూప్‌ని డిజిటల్ మీడియా ప్రొడక్షన్ హౌస్ అయిన పీపుల్ పవర్డ్ డిజిటల్ నేరేటివ్స్ సంప్రదించింది. వారి సోషల్ మీడియా కమ్యూనిటీ అయిన హేర్అక్షర్లో భాగమైంది. ఈ సంస్థ అట్టడుగు నేపథ్యాల నుండి వచ్చిన యువతులతో పని చేస్తుంది. మొబైల్ వీడియోల ద్వారా వారికి కథ చెప్పడంలో శిక్షణ ఇస్తుంది. ''అమ్మాయిల కథలు అంతకుముందు వారి గ్రామాలైన మిష్రోలీ, షాపూర్ ఖల్వా పట్టీలకు మాత్రమే పరిమితమయ్యాయి. స్టోరీ టెల్లింగ్ ద్వారా, వారు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తమలాంటి అమ్మాయిలు, యువకుల విద్య, సమానత్వాన్ని విభిన్నంగా చూడడానికి ప్రేరేపించగలిగారు'' అని Pluc.TV. వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన తమ్సీల్ హుస్సేన్ చెప్పారు.
గౌరవంగా జీవించేలా...
ఈ అమ్మాయి పని 2021లో 'గర్ల్స్ ఆన్ ఎ మిషన్' అనే డాక్యుమెంటరీగా ప్రారంభించబడింది. వారు ఈ వీడియోలను తయారు చేస్తూనే ఉన్నారు. ఇది చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ''మేము పెద్ద పెద్ద నగరాల్లో ఉండాలనే లక్ష్యం పెట్టుకోలేదు. ఆడపిల్లలు చదువుకోవడానికి, స్వయం సమృద్ధిగా ఉండటానికి, వారి హక్కుల కోసం మాట్లాడటానికి, ఆదాయ వనరుగా ఉండటానికి, నిర్భయంగా ఉండటానికి, గౌరవంగా జీవించేలా చేయడమే మా లక్ష్యం'' అని వారు చెప్పారు.