Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న వయసులోనే ఆమెకు వివాహమయింది. పెండ్లి తర్వాత టాటా ట్రస్ట్ పశుసఖి సంస్థ సహకారంతో వెటర్నటీలో శిక్షణ పొందింది. జంతు ఆరోగ్య నిపుణురాలిగా గ్రామంలో పేరు సంపాదించుకుంది. అంతటితో ఆమె కృషి ఆగలేదు. ఎన్నో సవాళ్ళను ఎదిరించి పట్టుదలతో ప్రయత్నించింది. ఇప్పుడు ఆమె పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆమే బాబ్లీ బాయి. ఆమె గురించిన మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
బాబ్లీ బాయి... రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా పిండ్వారా బ్లాక్‌లోని మలాప్ గ్రామానికి చెందిన గిరిజన మహిళ. చిన్నతనంలోనే వివాహం అయింది. అప్పుడు ఆమె వయసు 16. అప్పటికి ఆమె భర్తకు 19 ఏండ్లు. పిండ్వారాలోని రెండు వందలకు పైగా ఉన్న ఫ్యాక్టరీలలో ఒకటైన 'పథర్ గధై మజ్దూర్'గా అనే కంపెనీలనో పనిచేస్తున్నాడు. ఇక్కడ పాలరాయి, ఇసుకరాయి, సబ్బురాయి, రెడ్స్టోన్లతో భారతదేశం అంతటా దేవాలయాలను అలంకరించే స్తంభాలు, విగ్రహాలుగా చెక్కుతారు.
పశువైద్య సదుపాయాలు లేవు
ఈ సమయంలోనే బాబ్లీ టాటా ట్రస్ట్ గురించి తెలుసుకుంది. వారు నిర్వహించే 'పశు సఖీ' అనే కార్యక్రమం పశువుల ఆధారిత జీవనోపాధి పద్ధతుల ద్వారా రాజస్థాన్‌లోని గ్రామాల అంతటా మహిళా రైతులను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ''రాజస్థాన్ మారుమూల ప్రాంతాల్లోని చాలా గ్రామాలు పశువైద్యులకు దూరంగా ఉన్నాయి. పశువైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, వారు కాల్‌కు ప్రతిస్పందించే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది. దాంతో పశువుల మరణాలు ఎక్కువగా ఉండేవి. మా ప్రాంతాల్లో వ్యాధులు సర్వసాధారణం'' అని ఆమె చెప్పింది.
పని ప్రారంభించింది
గ్రామీణ పరిస్థితులు తెలిసిన బాబ్లీలో పశువైద్యం నేర్చుకోవాలనే ఆసక్తి బాగా పెరిగింది. 2017లో పింద్వారాలోని టాటా ట్రస్ట్ వారి జీవనోపాధి కార్యక్రమం అయిన సెంటర్ ఫర్ మైక్రోఫైనాన్స్ (CmF)లో పశు సఖిగా చేరింది. ఆమెకు అప్పటికి ఒక కొడుకు ఉన్నాడు. అయినప్పటికీ ఆమె పని చేయడం ప్రారంభించి కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకుంది. జంతు ఆరోగ్య సంరక్షణలో ప్రాథమిక అంశాలను చాలా త్వరగా నేర్చుకుంది. మహావీర్, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ (LSA) పర్యవేక్షణలో గ్రామంలోని 120 మేకల నివారణ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను విస్తరించగలిగింది. ''పశు సఖీ కావడం వల్ల ఆర్థిక స్వాతంత్య్రం వైపు మొదటి అడుగు వేయగలిగానను. అదే సమయంలో పరిచయం లేని కొత్త వ్యక్తులతో మాట్లాడటం, నిరంతరం వారిని కలవాల్సిన రావడం నా విశ్వాసాన్ని మరింత పెంచింది'' ఆమె గుర్తుచేసుకుంది.
భర్తకు వ్యాధి సోకడంతో...
ఆమె పశు సఖిగా పని చేస్తున్న సమయంలో CmF ప్రాజెక్ట్ మేనేజర్ హేమలత ఆమెతో మాట్లాడింది. ఆమె బాబ్లీలోని సామర్థ్యాన్ని గుర్తించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతికి చేరమని ఆమెను ప్రోత్సహించింది. ''తర్వాత నేను 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాను. అయినప్పటికీ పింద్వారాలోని రాతి చెక్కే కర్మాగారాల్లో పనిచేస్తున్న వేలాది మంది యువకులను ప్రభావితం చేసే ప్రాణాంతక వ్యాధి అయిన సిలికోసిస్‌తో నా భర్త ప్రభావితమయ్యాడు. కాబట్టి నా సంతోషం కొద్దికాలం మాత్రమే మిగిలిపోయింది'' అని బాబ్లీ చెపింది.
సమస్యలను అధిగమించాలని
ఆ వ్యాధి అతనిని పని చేయనీయలేదు. దాంతో కుటుంబ బాధ్యతలన్నీ బాబ్లీనే చూసుకోవల్సి వచ్చింది. ఇది దాదాపు 2019 సంవత్సరంలో జరిగిన సంఘటన. ఆ దంపతులకు అప్పటికి ఆడపిల్ల కూడా ఉంది. అయితే ఆ యువతి అన్ని సమస్యలను అధిగమించాలని నిర్ణయించుకుంది. నాలుగు గ్రామాలకు పశు సఖీ పాత్రను చేపట్టింది. 500 మేకల పెంపకం గృహాలకు తన సేవలతో విస్తరించింది. తన స్వయం సహాయక బృందం నుండి తన పొదుపు మొత్తాన్ని కలిపి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసింది. దాంతో ఆమె పని కొంత సులువయింది.
అభ్యంతరం చెప్పారు
సవాళ్లను అధిగమించడం, రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా బాబ్లీ గ్రామంలో మహిళలు తమంతట తాముగా బయట అడుగుపెట్టి పని చేయడం సాధారణ విషయం కాదు. తమ కోడలు ఒంటరిగా ఇతర గ్రామాలకు వెళ్లడం, అది కూడా టూవీలర్‌పై వెళ్లడం పట్ల ఆమె అత్తమామలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బాబ్లీకి ఆమె తల్లి మద్దతుగా నిలిచింది. ఒక సంవత్సరం కుమార్తెతో సహా తన ఇద్దరు పిల్లలను చూసుకోవడంలో సహాయపడింది. కానీ ఆమె తల్లి వద్ద ఉండటం ఆమె సోదరుడు ఇష్టపడలేదు. ఆమెను బయటకు పంపించేశాడు.
కుటుంబ మద్దతు లేకపోవడంతో...
ప్రాజెక్ట్ బృందం ఆమె కార్యాచరణ ప్రాంతాన్ని మార్చింది. తద్వారా ఆమె తన కుటుంబంలోని ఇరువర్గాల ఆగ్రహానికి గురికావల్సి వచ్చింది. ఇంతలో ఆమె ఓపెన్ స్కూల్ నుండి 12వ తరగతి పరీక్షలను కూడా పూర్తి చేసింది. బాబ్లీ పశు సఖిగా రాణిస్తోంది. కానీ గిరిజన మహిళ కావడంతో కుటుంబ మద్దతు లేకపోవడంతో పిండ్వారాకు మారాల్సి వచ్చినప్పుడు ఆమె భూస్వామి నుండి తీవ్రమరైన వివక్షను ఎదుర్కొంది. కుటుంబ సపోర్టు లేకుంటే తాను ఈ ప్రాంతంలో ఎక్కువ కాలం పని చేయలేనని హేమలతతో చెప్పింది. అప్పుడు హేమలత, జఎఖీ బృందం బాబ్లీ బాయి పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు దరఖాస్తు చేయడంలో సహాయం చేశారు. ఆమె రాత పరీక్షలో ఉత్తీర్ణులైంది. తర్వాత వివిధ రకాల కసరత్తులు, రేసులతో కూడిన ఫిజికల్ టెస్ట్‌లు ఉన్నాయి.
నా జీవితంలో కొత్త దశ కోసం
''నేను పరీక్షలో నెగ్గుకు రావాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. మూడు నుండి నాలుగు నెలల వరకు ప్రతి ఉదయం రన్నింగ్ ప్రాక్టీస్ చేసాను. ఫిజికల్ టెస్ట్‌లో కూడా విజయవంతంగా ఉత్తీర్ణత సాధించగలిగాను. నా ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి మా అమ్మ ముందుకు రావడంతో 2021 సెప్టెంబరులో మరో జిల్లా ఝలావర్‌లో తొమ్మిది నెలల పోలీసు కానిస్టేబుల్ శిక్షణను ప్రారంభించాను. శిక్షణ మే 2022లో ముగిసింది. ఇప్పుడు నేను సిరోహిలో పోలీసు కానిస్టేబుల్. మేకలను పెంచే కుటుంబాలకు చెందిన 500 మందికిగా పైగా ఉన్న మహిళలు, జఎఖీ ట్రస్ట్ ప్రాజెక్ట్ బృంద మద్దతు, అభిమానం లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. వాస్తవానికి నేను గ్రామంలోనే ఉండి పశుసఖిగా చేస్తూ, స్వయంగా మేకల పెంపకం పెట్టుకోవాలని అనుకున్నాను. అయితే పోలీసు కానిస్టేబుల్ శిక్షణ చాలా శ్రమతో కూడుకున్నది. నేను నా చిన్న పిల్లలను విడిచిపెట్టవలసి వచ్చింది. కానీ ఇప్పుడు నేను నా జీవితంలో కొత్త దశ కోసం ఎదురు చూస్తున్నాను'' అని బాబ్లీ చెప్పింది.