Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊరిస్తూ ఉత్తేజాన్నిస్తుంది. కరిగిపోతూ ఆనందాన్నిస్తుంది. మంచు వెల్లువలా మండు వేసవినే మరిపిస్తుంది. దానిపేరే ఐస్‌క్రీమ్. ఎండల్లో అందరూ ఇష్టంగా తినే చల్లని మంచుమిఠాయి ఇది. పిల్లలైతే దీనికోసం చేసే అల్లరి అంతా ఇంతా కాదు. 'అమ్మా నాకు వెనిల్లా, అమ్మా నాకు స్ట్రాబెర్రీ, అమ్మా బటర్‌స్కాచ్...'' అంటూ వెంటబడతారు. ప్రతి సారి బయట నుండి ఏం తెప్పించుకుంటాం. అందుకే ఇంట్లోనే తయారు చేసేద్దాం. మనసు లాగినప్పుడల్లా మనమూ పిల్లలతో తినేయొచ్చు.
మామిడిపండుతో
కావల్సిన పదార్థాలు: క్రీం - రెండున్నర కప్పులు, మామిడిపండు ముక్కలు - రెండు పెద్ద కప్పులు, వెనిల్లా ఎసెన్స్ - అరచెంచా, పాలు - కప్పు, కస్టర్డ్‌పొడి - పెద్ద చెంచా, చక్కెర - అర కప్పు.
తయారు చేసే విధానం: పాలు పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక పావుకప్పు పాలు పక్కకు తీసి అందులో కస్టర్డ్‌పొడి వేసి ఉండలు కట్టకుండా కలపాలి. దీన్ని మళ్లీ మరుగుతున్న పాలల్లో వేసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. చిక్కగా అయ్యాక దింపేసి చల్లారనివ్వాలి. ఇంతలో మామిడి ముక్కలు, వెనిల్లా ఎసెన్స్, చక్కెర మిక్సీలో వేసికుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో గిలకొట్టిన క్రీవమ్, కస్టర్డ్ కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఐదారు గంటల తర్వాత బయటకు తీసి మరోసారి మిక్సీపట్టి మళ్ళీ ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమం గట్టిగా అయ్యాక మళ్ళీ బయటకు తీసి ఓసారి కలిపి డీప్‌ఫ్రీజర్‌లో ఉంచాలి. గట్టిగా అయ్యాక తీసి సర్క్ చేయవచ్చు.
ఆరెంజ్ ఐస్‌క్రీం
కావల్సిన పదార్ధాలు: ఆరెంజ్ జ్యూస్ - రెండు కప్పులు, ఆరెంజ్ మరమలాడ్ - నాలుగు స్పూన్లు, క్రీం - కప్పు, పాలు - రెండు కప్పులు, పంచదార - 200 గ్రా, కండెన్స్ డ్ మిల్క్ - ఒక టిన్ను, ఎగ్ వైట్ - నాలుగు గుడ్లది, కమలా తొనల ముక్కలు - ఒక కప్పు.
తయారుచేయు విధానం: ముందుగా ఒక బౌల్లో పంచదార, మరమలాడ్ వేసి బాగా కలిపి పావుగంట పాటు పక్కన వుంచాలి. కండెన్స్డ్ మిల్క్‌ను బాగా బీచ్ చేసి క్రీం కలిపి అంత కలిసేలా మళ్ళీ బాగా బీట్ చెయ్యాలి. ఈ మిశ్రమానికి మరమలాడ్ మిశ్రమం, ఆరెంజ్ జ్యూస్ వేసి బాగా బీట్ చెయ్యాలి. ఎగ్స్ పగలగొట్టి దాంట్లోనే ఎగ్ వైట్‌ని బాగా కలిపి మిల్క్ మిశ్రమంలో వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని డీప్ ఫ్రీజర్‌లో పెట్టి పూర్తిగా గట్టిపడేవరకు ఉంచాలి. సర్వ్ చేసే ముందు తీసి ఐస్ క్రీం బౌల్స్‌లో పెట్టి పైన కమలా తొనల ముక్కలు వేసి కూల్‌గా సర్వ్ చెయ్యాలి.
బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్
కావల్సిన పదార్థాలు: పాలు - లీటరు, మిల్క్ పౌడర్ - 80 గ్రా, పంచదార - 180 గ్రా, క్రీం - కప్పు, బటర్ - సరిపడ.
తయారుచేయు విధానం: ఒక మందపాటి గిన్నెలో పాలు, మిల్క్ పౌడర్, పంచదార, క్రీం వేసి సన్నని మంట మీద గరిటతో కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కగా అయిన తర్వాత పొయ్యి మీద నుంచి దించి చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక గిన్నెలో 150 గ్రా పంచదారని వేసి కొంచెం నీరు పోసి పొయ్యి మీద పెట్టి సన్నమంట మీద ఉడికించాలి. పాకం వచ్చి ఉండ కడుతున్నప్పుడు దానిలో బటర్ వేసి బాగా కలపాలి. తర్వాత ఫ్రిజ్‌లో పెట్టిన పాల మిశ్రమాన్ని పోసి ఒక ఉడుకు రానిచ్చి కిందకు దించేయాలి. చల్లారిన తర్వాత ఫ్రీజర్‌లో పెట్టాలి. గంట తర్వాత బయటకు తీసి బీట్ చేసి మళ్ళీ ఫ్రీజర్‌లో పెట్టాలి. గట్టి పడిన తర్వాత స్పూన్‌తో తీసి కూల్‌గా సర్వ్ చెయ్యాలి.
స్వీట్‌కార్న్‌తో...
కావల్సిన పదార్థాలు: స్వీట్‌కార్న్ - ఒకటి, క్రీమ్ - కప్పు, పాలు - కప్పు, చక్కెర - అర కప్పు, వెనిలా ఎసెన్స్ - అర చెంచా, గుడ్లు - రెండు(పచ్చసొన మాత్రమే తీసుకోవాలి)
తయారు చేసే విధానం: క్రీమ్, పాలూ, ఉడికించిన మొక్కజొన్న గింజల్ని పొయ్యిమీద పెట్టాలి. అవి మెత్తగా అయ్యాక పచ్చసొనా, చక్కెర, వెనిల్లా ఎసెన్స్ వేసి మంట తగ్గించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే కాసేపటికి చిక్కగా అవుతుంది. అప్పుడు దింపేసి మరోగిన్నెలోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారాక ఫ్రిజ్‌లో దాదాపు మూడు నుంచి ఐదు గంటలు పెట్టి బటయకు తీయాలి. ఈ ఐస్‌క్రీమ్ గట్టపడ్డాక మరోసారి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మొక్కజొన్నగింజల్ని మెత్తగా చేసుకుని కూడా ఉడికించుకోవచ్చు.