Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుందేల్‌ఖండ్‌లోని ఓ కమ్యూనిటీ రేడియో నుండి ఆమె స్వరం రోజూ ధ్వనిస్తూ ఉంటుంది. అది కేవలం శ్రోతలను అలరించేందుకు మాత్రమే కాదు. వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కూడా కృషి చేస్తుంది. అలా ధ్వనించే స్వరమే వర్షా రైక్వార్. ఈ ఆర్జే వాతావరణ మార్పులపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 150 గ్రామాల నుండి 2.5 లక్షల మంది శ్రోతలు ఆమె స్వరానికి ప్రభావితులయ్యారు. వాతావరణ మార్పుల గురించి ఆమె ఇచ్చే సమాచారం, సలహాలు వింటూ తమ జీవితాల్లో మార్పును మనసారా ఆశ్వాదిస్తున్నారు. రోజువారీ ప్రసారమయ్యే ఆమె కార్యక్రమం షో శుభ్ కల్ని మనం కూడా ఒక్కసారి వింటే.. ఇది మన పిల్లలకు మన ఇవ్వబోయే ఓ పచ్చని గ్రహం అని అర్థమవుతుంది.
మధ్యప్రదేశ్‌లో బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన ఓర్చా అనేది ఓ చిన్న పట్టణం. అక్కడి నుండి 25 ఏండ్ల వర్షా రైక్వార్ స్వరం ఆకాశవాణిలో స్పష్టంగా వినిపిస్తోంది. ఆమె స్వరం ఓ కారణం కోసం అవగాహన కల్పిస్తూ మార్పుకై ధ్వనిస్తుంది. బుందేల్‌ఖండ్‌లోని ఏకైక మహిళా ఆర్జే వర్ష రేడియోలో ప్రవేశించడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. నేషనల్ జియోగ్రాఫిక్ వారి వన్ ఫర్ చేంజ్ క్యాంపెయిన్‌లో మాట్లాడుతున్నపుడు మార్పు కోసం పని చేసేవారిలో వర్ష ఒకరిగా కనిపించారు.
నా లక్ష్యంగా పెట్టుకున్నాను
''చిన్నప్పటి నుండి నా స్వరమంటే నాకెంతో ఇష్టం. ఎప్పుడూ నాలో నేనే పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. వంట చేసినా, నా రోజువారీ పనులు ఏం చేస్తున్నా నా స్వరం ఎప్పుడూ ధ్వనిస్తూనే ఉండేది. ఒకరోజు నా ఎనిమిదవ తరగతి పరీక్షల తర్వాత రేడియో స్టేషన్లో పనిచేస్తున్న ఒక అమ్మాయిని కలిశాను. అది నాకెంతో ఇష్టంగా అనిపించింది. నేను కూడా ఎంత కష్టపడైనా రేడియోలో చేరాలనుకున్నాను. ఇదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను'' అంటుంది ఆమె.
నేను ఆశ్చర్యపోతున్నాను
తరచుగా కరువుతో బాధపడే గ్రామం నుండి వచ్చిన వర్షకు వాతావరణ మార్పుల వల్ల కలిగే వినాశనం గురించి బాగా తెలుసు. ''మా నాన్న ఒక రైతు. వర్షాలు లేనప్పుడు, పంటలు నీరు లేకుండా ఎండి పోతున్నప్పుడు నాన్న తీవ్రంగా నిరుత్సాహపడటం చూశాను. ఇదంత భగవంతుడి ఇష్ట ప్రకారం జరుగుతుందని తనని తాను ఓదార్చుకునేవాడు. మేము విత్తనాలు విత్తాము, కష్టపడి పని చేసాము. కానీ మధ్యలో ఈ భగవంతుడు ఎక్కడి నుండి వచ్చాడో అని నేను ఆశ్చర్యపోతున్నాను'' వర్ష చెప్పింది.
వాతావరణ మార్పులపై అవగాహన
2017లో రేడియో బుందేల్‌ఖండ్‌లో చేరినప్పుడు వర్ష నిర్ణయాన్ని ఆమె కుటుంబం వ్యతిరేకించింది. ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత ఆడపిల్లలకు వివాహం చేసే ప్రాంతంలో ఆమె పుట్టి పెరిగింది. అప్పటి వరకు ఆమె కుటుంబం నుండి ఏ స్త్రీ కూడా పని కోసం ఇంటి నుండి బయటకు అడుగుపెట్టలేదు. కానీ వర్ష తను చూడాలనుకున్న మార్పును చూడాల్సిందే అని నిశ్చయించుకుంది. రేడియోలో చేరిన తర్వాత ఆమె పర్యావరణ సమస్యల గురించి తనకు తానుగా అవగాహన కల్పించడం ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె తన ప్రోగ్రామ్‌ను వాతావరణ మార్పులపై కేంద్రీకరించింది.
సేంద్రీయ వ్యవసాయానికి మార్పు
వాతావరణంపై ఎక్కువ మందికి అవగాహన కల్పించడం, వారి ఆలోచనా విధానాన్ని మార్చడం ద్వారా వారిని ప్రభావితం చేయాలనేది తన కల. ''నా విధానం సానుకూలంగా ఉంది. వాననీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం, ప్లాస్టిక్‌ని నిషేధించడం, కిచెన్ గార్డెన్‌ని నాటడం మొదలైన వాటపౖిె అవగాహన కల్పించడం మొదలుపెట్టాను. తద్వారా మా గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చి నిలకడగా జీవించగలిగే వివిధ మార్గాలపై నేను వారికి అవగాహన కల్పిస్తున్నాను. దీనికోసం మేము మా శ్రోతలను వారు ఏదైనా కొత్తగా చేసి ఉంటే మాకు తెలియజేయమని కోరాము. దానిని మా రేడియోలో ప్రసారం చేస్తామని చెప్పాము'' ఆమె చెప్పింది. నిజానికి శుభ్ కల్ మొత్తం గ్రామాన్ని సేంద్రీయ వ్యవసాయానికి మార్చడానికి ప్రేరేపించింది.
ఒక సామాజిక ఉద్యమంగా
వర్ష పని స్టూడియో దాటి కూడా విస్తరించింది. ఆమె వారంలో నాలుగు సార్లు పొరుగు గ్రామాలకు వెళ్లి వారి ప్రయత్నాల గురించి గ్రామస్తులతో మాట్లాడుతుంది. వారు ఆమె స్వరం ద్వారా ఆమెను గుర్తించి 'దీదీ' అని పిలుస్తారని ఆమె ఎంతో ఆనందంగా చెబుతుంది. రేడియోలో, బయట ఆమె చేసిన పని ఒక సామాజిక ఉద్యమాన్ని కూడా రేకెత్తించింది. యువతులను ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రేరేపించింది. బాల్య వివాహం వంటి సామాజిక దురాచారానికి సైతం అడ్డుకట్ట వేసింది.
పరిస్థితులు మారుతున్నాయి
''చాలా గ్రామాల్లో ఆడపిల్లలకు 12-13 ఏండ్లలోపు పెండిండ్లు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. బాల్య వివాహం జరగబోతుంటే గ్రామస్థులు వెంటనే నాకు ఫోన్ చేస్తారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించి దానిని ఆపగలను'' అని ఆమె జతచేస్తుంది. ఒక ఉద్యమాన్ని ప్రారంభించి దానిని నిలబెట్టుకోవడానికి స్త్రీ అవసరమని వర్ష అంటున్నారు. ''నా అవగాహన ప్రచారం ఇప్పుడు వాతావరణ మార్పులకు మించి విస్తరించింది. ఇందులో మహిళల ఆరోగ్యం కూడా భాగం పంచుకుంది. మహిళలు ఇప్పుడు వారి సమస్యల గురించి మాట్లాడటానికి, వారి కుటుంబం, సమాజంలో కూడా ఈ అవగాహనను వ్యాప్తి చేసేలా ధైర్యంగా ఉన్నారు'' అని వర్ష పంచుకుంటున్నారు.
ఆమె అడుగుజాడల్లో నడిచేందుకు
వర్షా దీదీ మార్గం చూపడంతో ఈ ప్రాంతంలోని చాలా మంది అమ్మాయిలు ఆమె అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారు. ఆమె బృందంలో ఐదుగురు మహిళా వాలంటీర్లు సామాజిక మార్పులో ఆమెకు సహాయం చేస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ''ఓం శాంతి ఓం''లోని ప్రసిద్ధ డైలాగ్ అయిన ''మీరు మంచి చేస్తే చివరకు విశ్వం మన చుట్టూ తిరుగుతుంది'' అనే కోట్‌ను వర్ష ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సవాళ్ళు సర్వసాధారణం
''అగర్ కిసీ చీజ్ కో దిల్ సే చాహో తో పూరీ కాయనత్ ఉసే తుమ్సే మిలానేకి కోశిష్ మే లాగ్ జాతి హై. (మీరు మీ హృదయంతో ఏదైనా కోరుకుంటే దానిని సాధించడంలో విశ్వం మీకు సహాయం చేస్తుంది). మనం మంచి కోసం పని చేస్తున్నపుడు సవాళ్లు లేదా ప్రతికూల వ్యాఖ్యలు సర్వసాధారణం. దీని గురించి మీరు చింతించకండి. పెద్దపెద్ద కలలు కనడానికి భయపడకండి. మీకు మీరు పరిమితులు పెట్టుకోకండి. చేయవలసినవి చాలా ఉన్నాయి. మన కృషి ద్వారా మన పిల్లలు మన నుండి మంచి గ్రహాన్ని వారసత్వంగా పొందుతారు'' అని చెప్పి వర్ష తన మాటలు ముగించారు.