Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీ తల్లి అయిన రోజు నుండి బిడ్డల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ తన గురించి మాత్రం పట్టించుకోదు. తమ ఆకలి, నిద్ర గురించి అస్సలు పట్టించుకోరు. అటువంటి పరిస్థితిలో పిల్లలు తమ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు కొందరు మహిళలు తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా వయసు పెరుగుతున్నప్పుడు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన అమ్మ జీవితం కోసం పిల్లలు తప్పనిసరిగా తల్లికి ఈ కింద పేర్కొన్న కొన్ని పరీక్షలు చేయించుకోవాలి.
రక్తపోటు: గుండె జబ్బులు వంటి వ్యాధులకు రక్తపోటు ఒక ముఖ్యమైన సంకేతం. కాబట్టి మీ తల్లి రక్తపోటును కనీసం సంవత్సరంలో ఒకసారి తనిఖీ చేయించండి. మీ తల్లి ఇప్పటికే మధుమేహం, మూత్రపిండ వ్యాధి లేదా గుండె సమస్య వంటి ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతుంటే మరింత జాగ్రత్తలు తీసుకుని తరచుగా పరీక్షలను సిఫారసు చేయవచ్చు.
పెల్విక్ టెస్ట్: యోని, గర్భాశయం, అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్లు, మూత్రాశయం, పాయువుతో సహా మొత్తం కటి అవయవాలను పరిశీలిస్తుంది. ఇది 21-65 సంవత్సరాల వయసు నుండి ప్రతి మహిళ ఆరోగ్య సంరక్షణలో భాగం కావాలి. అండాశయ తిత్తులు, ఫైబ్రాయిడ్లు, ఇతర ఇన్ఫెక్షన్లు లేదా ప్రారంభ దశ క్యాన్సర్లు వంటి ఏవైనా సంతానోత్పత్తి సమస్యలను గుర్తించడంలో సాధారణ పెల్విక్ పరీక్ష సహాయపడుతుంది.
పాప్ స్మియర్: సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తెలుసుకోవడానికి పాప్ స్మియర్ పరీక్షలు చేస్తారు. స్త్రీకి 21 ఏండ్లు వచ్చినప్పుడు పాప్ స్మియర్ చేయవచ్చు. 30 ఏండ్లు పైబడిన మహిళలు కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ చేయించుకోవాలి.
రొమ్ము క్యాన్సర్ పరీక్ష: రొమ్ము క్యాన్సర్ ప్రారంభాన్ని గుర్తించడానికి 45 ఏండ్లు పైబడిన మహిళలకు మామోగ్రామ్లు సిఫార్సు చేస్తారు. మహిళలు తమ రొమ్ముల అభివృద్ధిని నిశితంగా గమనించాలి. నెలవారీ స్వీయ పరీక్షలు చేయించుకోవాలి. మీ తల్లి లేదా సోదరి రొమ్ము క్యాన్సర్ కలిగి ఉంటే మీరు చెక్-అప్ కోసం వైద్యుడిని సంప్రదించాలి. రొమ్ములలో ఏదైనా మార్పు ఉంటే వెంటనే తెలియజేయాలి.
థైరాయిడ్ పరీక్ష: స్త్రీలు థైరాయిడ్ గ్రంధి అతి చురుకైన లేదా తక్కువ చురుకుదనంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. అంతేకాదు అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి పిల్లలు వారి తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ పైన పేర్కొన్న ఈ ముఖ్యమైన పరీక్షలను తరచూ చేయిస్తూ ఉండాలి.