Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె ఇద్దరు పిల్లలకు ఒంటరి తల్లి. ఆంక్షల మధ్య పుట్టి పెరిగింది. తన కలలను నిజం చేసుకునేందుకు అసమానతలతో పోరాడింది. రాజ్‌దూత్‌పై స్వారీ చేయడం నుండి వ్యాపారవేత్తగా జాతీయ అవార్డులను గెలుచుకుంది. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో విజయవంతమైన అడ్వెంచర్ టూరిజం వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆమే జూలియా దేకా. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవిత విశేషాలు మానవి పాఠకుల కోసం...
ఎవరెస్ట్ శిఖరంపై తన మొదటి పుస్తకాన్ని బహుమతిగా పొందినపుడు జూలిమా దేకా చాలా చిన్న పిల్ల. దాన్ని తెరిచి చూస్తే అందులో ఆమెకు తన భవిష్యత్తు కనిపించింది. అందులోని టెన్జిన్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ కథలు ఆమెను ఎంతగానో ఆకర్షించాయి. అస్సాంలోని చిన్న సంప్రదాయ గ్రామంలో పుట్టిన ఐదుగురు ఆడపిల్లలలో రెండవ అమ్మాయి జూలియాకు పర్వతాలను స్కేలింగ్ చేయడం అసాధ్యమైన కలగా ఉండేది. అయితే ఆమె తండ్రి గిరీంద్రనాథ్ దేకా ఇండియన్ ఆర్మీలో సైనికుడు. అతనికి తన కూతుళ్ళ జీవితాల పట్ల భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి.
సాహసమంటే ప్రేమ
''మాకు సోదరులు లేరు. కాబట్టి మేము ఒక గ్రామంలో అబ్బాయిలు చేయాలనుకున్న ప్రతిదాన్ని చేస్తూ పెరిగాము. ఇంటి నిర్వహణలో కూడా నేను సహాయం చేశాను'' అని 38 ఏండ్ల జులిమా చెప్పింది. సాహసం పట్ల ఆమెకున్న ప్రేమను గుర్తించిన తండ్రి ఆమెకు తన రాజ్‌దూత్ బైక్‌ను ఎలా నడపాలో నేర్పించాడు. తమ గ్రామం కెర్పాబాటి చుట్టూ ఉన్న పర్వత ప్రాంతాల చుట్టూ డ్రైవింగ్ చేస్తున్నపుడు జులిమా తనకు ఎన్నడూ సాధ్యం కానటువంటి స్వేచ్ఛను అనుభవించినట్టు చెప్పింది.
ఇద్దరు పిల్లలకు తల్లి
''ఊరి ప్రజలు నా గురించి ఏవేవో మాట్లాడుకునేవారు. ఇలా తిరగడంలో నన్ను ప్రోత్సహించవద్దని నా తల్లిదండ్రులతో చెప్పేవారు. మా నాన్న ఉన్నప్పుడు వారి మాట పట్టించుకోలేదు'' ఆమె చెప్పింది. 16 ఏండ్ల వయసులో 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత జూలిమా తన కలలు నెరవేరుతాయో లేదోనని ఆందోళన చెందింది. అప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ తన విద్యను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. 2011లో సోషియాలజీలో పట్టభద్రురాలైంది.
సవాళ్లు ఉన్నాయి
వివాహ బంధంలో ఇబ్బందులు ఎదురుకావడంతో జూలిమా తల్లి ఇంటికి తిరిగి వెళ్లి తన పిల్లలను ఒంటరిగా పెంచడం ప్రారంభించింది. ఆమె బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు వ్యాపార భాగస్వామి అయిన పూర్ణ దేకా జీవనోపాధి కోసం తన అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో పని చేయడానికి ఆమెను ఆహ్వానించాడు. ''నేను అతని కంపెనీ షికార్ అడ్వెంచర్స్‌తో కలిసి నా మొదటి ట్రెక్కి వెళ్లాను. ఆ ప్రాంతం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ ఆధీనంలో ఉన్నందున మనం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కానీ నేను నా కలకి పునాది వేస్తున్నాను. కాబట్టి పట్టుదలతో ఉన్నాను. నా పిల్లలకు మూడు సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ట్రెక్‌లకు తీసుకెళుతున్నాను. వారు కూడా నిర్భయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను'' ఆమె చెప్పింది.
శిక్షణా కోర్సు కోసం
2010లో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (వీూణజు) ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అడ్వెంచర్ టూరిజంలో తన మొదటి అధికారిక శిక్షణా కోర్సు కోసం జులిమా దరఖాస్తు చేసింది. ''ఇది స్కిల్ ఇండియా కింద 10 రోజుల కోర్సు. దీని కోసం నేను అస్సాం ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ పొందాను. కోర్సు పూర్తి చేసిన తర్వాత మనాలిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్‌లో పర్వతారోహణలో ఒక కోర్సు కోసం దరఖాస్తు చేశాను'' అని జూలిమా తన పొదుపుతో చివరి కోర్సు కోసం ఫీజు చెల్లించినట్టు చెప్పింది.
ఐదు బ్యాంకులు తిరస్కరించాయి
2015 నాటికి పూర్ణ, జూలిమా కలిసి అస్సాం బికాష్ యోజన కింద రుణం తీసుకున్నారు. దీనితో అడ్వెంచర్ టూరిజం కంపెనీ గ్రీన్ ట్రెక్ అడ్వెంచర్స్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వారు తమ మొదటి రాఫ్ట్‌ను కొనుగోలు చేయడానికి డబ్బును ఉపయోగించారు. ''మా సమీప పట్టణమైన గోరేశ్వర్లోని ఐదు బ్యాంకులు మా దరఖాస్తును తిరస్కరించారు. అయితే హరిపరలోని సెంట్రల్ బ్యాంక్‌లో మేనేజర్ జ్యోతిప్రసాద్ శర్మ మాకు రుణాన్ని మంజూరు చేశారు'' అని జులిమా చెప్పారు.
క్యాంప్‌ను ఏర్పాటు చేసి
ఇండో-భూటాన్ సరిహద్దులోని పర్వతాలతో చుట్టుముట్టబడి, తమ గ్రామానికి సమీపంలో, బరాండి నది ఒడ్డున ఉన్న బోగోమతిలో వీరిద్దరూ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. రాఫ్టింగ్, ట్రెక్కింగ్‌తో ప్రారంభించి ఇద్దరూ తమ వ్యాపారాన్ని పర్వతారోహణ, కయాకింగ్, పారాసైలింగ్, జంగిల్ ట్రాకింగ్, రాఫ్టింగ్లతో సహా పెంచుకున్నారు. ఈ ప్రాంతంలో జిప్లైనింగ్ను ప్రవేశపెట్టిన మొదటి వారు కూడా వారే. వారి అడ్వెంచర్ కంపెనీ అనేక అవార్డులను గెలుచుకుంది. జూలిమా స్వయంగా 2017లో వీూణజు ద్వారా 20 మంది యువ వ్యాపారవేత్తలలో గుర్తించబడింది. ''నేను ఈశాన్య ప్రాంతానికి చెందిన మరో అమ్మాయితో పాటు ఎంపికయ్యాను. ఆమె గెలుచుకున్న ఇతర అవార్డులలో ముఖ్యమైనవి అస్సాం టూరిజం బెస్ట్ రూరల్ టూరిజం ప్రాజెక్ట్ 2019, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ అవార్డ్ ఫర్ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు 2019, బోడోలాండ్ టెరిటోరియల్ అవార్డ్ ఫర్ ఎక్స్ట్రార్డినరీ సర్వీసెస్ అవార్డ్ సర్వీసెస్ 2020 ఉన్నాయి. ''మా విజయాల గురించి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ట్వీట్ చేశారు'' ఆమె చెప్పింది.
వీలైనంత సహాయం చేస్తాను
ఆ ప్రాంతంలోని వ్యక్తులకు ఉపాధి కల్పించడం ద్వారా ఆమె మరింత తృప్తిగా జీవిస్తుంది. ''నా వివాహ బంధం ముగిసిన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను. ఇతరులకు నాకు వీలైనంత సహాయం చేయాలనుకుంటున్నాను. కోవిడ్-19 మమ్మల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా రెండవ లాక్డౌన్ సమయంలో. కానీ పర్యాటకులు తిరిగి వస్తున్నారు. మేము మా నష్టాలను నెమ్మదిగా భర్తీ చేస్తున్నాము. పూర్తిగా తిరిగి ట్రాక్‌లోకి రావడానికి కొంత సమయం పడుతుంది'' అమె చెప్పారు.
భయం అంటే తెలీదు
తన తండ్రి తనను పెంచినట్టే తన పిల్లలను కూడా అలాగే పెంచాలని నిశ్చయించుకుంది. ''భయం అంటే ఏమిటో నాకు తెలియదు. అందుకే నేను నా కుమార్తె, నా మేనకోడలిని పర్వతారోహణ, రాఫ్టింగ్ కోర్సులు చేయడానికి పంపాను. నా కూతురు కాలేజీ మొదటి సంవత్సరం, ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతోంది. ఆమె కూడా నా మేనకోడలితో పాటు వ్యాపారంలో సహాయం చేస్తుంది. పీక్ సీజన్లో అడ్వెంచర్ యాక్టివిటీస్‌లో సహాయం చేయడానికి మేము 10-15 మందిని నియమించుకుంటాము'' అని జూలిమా చెప్పారు. ఆమె కొడుకు 9వ తరగతి చదువుతున్నాడు.
వారు కూడా చేయగలరు
''నేను 2010లో నా పిల్లలతో ఇంటికి వచ్చినప్పుడు స్త్రీలు అణిగిమణిగి వుండాలనే విమర్శలను ఎదుర్కొన్నాను. ప్రజలు ఇప్పటికీ దీని గురించి నాతో అంటూనే ఉంటారు. కానీ నేను వాటిని విస్మరిస్తాను. నా వైపు చూడడానికి కూడా ఇష్టపడని ప్రతి స్త్రీ, దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో ఒక అడ్వెంచర్ టూరిజం కంపెనీని నేను ఎలా నిర్వహిస్తున్నానో చూడాలని, వారు కూడా ఏదైనా చేయగలరని నేను కోరుకుంటున్నాను'' అని జూలిమా చెప్పారు.