Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మ ఒడి ఒక బడి. సురక్షితంగా ఉన్నామని తెలిపే ఒక కంచు కోటలాంటిది. అమ్మ మాటతో కలిగే ధైర్యం వేరే ఎవరి దగ్గర మనకు రాదు. తన బిడ్డల కోసం మహర్నిశలు ఎంతో కష్టపడుతుంది. వారి ఉన్నతిని చూడడం కోసం తన శ్రమను ఎంతో సంతోషంగా ధారపోస్తుంది. ఏటా మే రెండవ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా కొందరు బిడ్డలు తమ తల్లులతో ఉన్న అనుబంధాన్ని మనతో ఇలా పంచుకున్నారు. ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం...
- పాలపర్తి సంధ్యారాణి
అమ్మ తపన వల్లనే
నాన్న జి.యెస్.శంకర్, అమ్మ సుభాషిణి. సికింద్రాబాద్‌లో పుట్టాను. నాకు నాట్యాన్ని పరిచయం చేసింది అమ్మనే. నాకు నాలుగు సంవత్సరాల వయసపుడు అమ్మతో కలిసి గుడికి వెళ్ళాను. అక్కడ ఒకావిడ నన్ను చూసి 'మీ పాపా కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి, నాట్యం నేర్పించండి' అని అంటే అమ్మ 'మేము ఇక్కడి వాళ్ళము కాదండి, మాది మద్రాస్. ఇక్కడ మాకు ఎవరూ తెలియదు' అన్నారట. అప్పుడు ఆవిడ మీ అమ్మాయికి నాట్యం నేనే నేర్పిస్తాను అన్నారట. ఆవిడ పేరు శారదా కేశవరావు. అలా మారేడ్‌పల్లిలో నా నాలుగవ ఏట భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. కొన్నాళ్ళకు ఆవిడ అమెరికా వెళ్లి పోయారు. అప్పుడు అమ్మ ఎలాగైనా నాకు నాట్యం నేర్పించాలని పట్టిస్వామి పిళ్ళై అనే నాట్య గురువు దగ్గర చేర్పించారు. పదకొండేండ్ల వయసులో నవ్య నాటక సమితి వాళ్ళు నిర్వహించిన పోటీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అమ్మ ప్రోత్సహం చాలా ఉండేది. అమ్మ సంగీత విద్వాంసురాలు. వయోలిన్ వాయించేవారు. నా చేత బాగా సాధన చేయించేవారు. ఆవిడ పాడుతూ ఉంటే నేను నాట్యం చేసేదాన్ని. అలా నా సాధనకి అమ్మ సంగీతం బాగా ఉపయోగపడింది. మేము మద్రాస్‌లో అమ్మమ్మ దగ్గరకి వెళ్తూ వుండేవాళ్ళం. అక్కడ కళాక్షేత్రలో రుక్మిణి దేవి అరుండేల్కర్ని కలవడానికి వెళ్ళాము. ఆవిడ నన్ను చూసి ఒక డాన్స్ చేయమన్నారు. చేసి చూపించాను. ఇక్కడ ఉండి నాట్యం నేర్చుకుంటావా అని అడిగారు. అమ్మనే నాన్నతో మాట్లాడి నన్ను కళాక్షేత్రలో చేర్పించారు. హాస్టల్లో వుంటూ నాట్యం నేర్చుకుంటూనే చదువు కొనసాగించాను. అక్కడ ఆరేండ్లు నాట్యం నేర్చుకున్న తర్వాత హైద్రాబాద్‌కి తిరిగి వచ్చాను. అమ్మకు నేను గొప్ప నాట్యకళాకారిని కావాలని కోరిక. నా నృత్య ప్రదర్శనలకి ఎక్కువగా అమ్మే పాడేవారు, వయోలిన్ వాయించే వారు. కొత్త కొత్త బాణీలు కట్టి ఇచ్చేవారు. వాటిని సాధన చేయమని అనేవారు. నాట్యకారిణిగా ఎదగాలంటే ఎంతో ప్రోత్సాహం అవసరం. అది నాకు అమ్మ నుంచి బాగా లభించింది. డాన్స్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించినప్పుడు అక్కడ చిన్న పిల్లలకు సంగీతం నేర్పడం, జడలు వేయడం, మేకప్ చేయడం ఎంతో ఇష్టంగా చేసేవారు. 2001లో అమ్మ ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ఆమె పడిన తపన వల్లనే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాను. అమ్మతోటిదే లోకం. అమ్మే నా స్నేహితురాలు. ఎన్నని చెప్పను అమ్మ గురించి. ఎంత చెప్పినా తక్కువే.
- ఆనంద శంకర్, ప్రముఖ నాట్య గురువు
అమ్మ నా ఆలంబన
అమ్మ గౌరీ, నాన్న సతీశ్‌చంద్ర. వారికి మేము ఇద్దరం సంతానం. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. నా విద్యాభాసం అంతా హైద్రాబాద్‌లోనే. అమ్మకు చదువంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా చదువు విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టేది. అమ్మకు ఇంటర్ అవ్వగానే పెండ్లి కావడం, ఆ తర్వాత మేము పుట్టడం కుటుంబ బాధ్యతలతో తనకు అసలు తీరిక ఉండేది కాదు. అమ్మ మంచి ఆర్గనైజర్. ఎవరికి ఏమి కావాలి అని ఎప్పుడు తపన పడుతూ ఉండేది. అమ్మ ఎప్పుడు నేను అన్నిట్లో ద బెస్ట్ ఉండాలని కోరుకునేది. నువ్వు ఏ రంగంలో ఉన్న సరే అక్కడ రాణించాల్సిందే అనేది. నాకు బై.పి.సి అంటే ఇష్టం. అందుకే ఎంబీబీఎస్ చదివాను. అప్పుడు అందరూ అమ్మను అభినందించడం మొదలు పెట్టారు. అదేమిటి అందరూ నిన్ను అభినందిస్తున్నారు అని అడిగితే అప్పుడుచెప్పారు. నా కల నెరవేరింది. నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. కానీ అవ్వలేక పోయాను. నా కోరిక నీ ద్వారా తీరింది అని. అమ్మ చాలా ధైర్యవంతురాలు. ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది కాదు. బహుశా చిన్నప్పటి నుంచి అమ్మలోని ధైర్యాన్ని చూస్తూ పెరగటం వల్లనేమో నాకు తెలియకుండానే ఆ ప్రభావం నా మీద పడింది. నేను డాక్టర్‌గా ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసాను. ఆ సమయంలో వస్తున్న రోగులను చూసినప్పుడు అనిపించింది ఒక పవర్ఫుల్ ఉద్యోగంలో ఉండి సమాజాన్ని బాగు చేయాలని. అమ్మ కూడా ప్రోత్సహించింది. ఎందుకంటే తాను చాలా ధైర్యవంతురాలు కాబట్టి. నేను ఐపీఎస్ అవ్వడానికి కారణం కూడా అమ్మనే. ఈ జన్మనిచ్చిన అమ్మకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిది. మా అందరి కోసం ఎంతో శ్రమ పడినా అందులోనే తను సంతోష పడేది.
- డా.చేతన, ఐపీఎస్
తన రెక్కల కింద నన్ను కాపాడింది
నాన్న మండ సత్యనారాయణ. అందరూ సత్యం అని పిలిచేవారు. వాళ్ళది పాలకొల్లు. అమ్మ మాలతి దేవి. వాళ్ళది రాజమండ్రి. వారికి మేము ఆరుగురం సంతానం. నేను మూడవ దాన్ని. నాన్న కోరుకొండలో ఉద్యోగం చేసేవారు. ఆయనకు 9 నుంచి 5 వరకు చేసే ఉద్యోగం ఇష్టం ఉండేది కాదు. అందుకని నేను 6 నెలల పాపగా ఉన్నప్పుడు అమ్మను తీసుకుని మద్రాస్ వచ్చేసారు. ఏదైనా ఫ్రీలాన్స్ ఉద్యోగం చేసుకోవచ్చనే ఉద్దేశంతో. కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఓ పత్రికకు సబ్ ఎడిటర్‌గా ఉద్యోగం దొరికింది. అది మొత్తం సినిమాకి సంబంధించినదే. ఒక రోజు చుట్టుపక్కల పిల్లలందరం కలిసి ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద వ్యాన్ వచ్చి పిల్లలందరిని ఎక్కించుకుంది. ఆ పిల్లలతో పాటు నేను కూడా వున్నాను. అప్పుడు నాకు నాలుగు సంవత్సరాలు. వ్యాన్‌లో ఉన్న ఒక వ్యక్తి కాయితం తీసి అందులో ఉన్న పేర్లు చదవసాగాడు. అందరి పేర్లు ఉన్నాయి కానీ నా పేరు లేకపోవడంతో నన్ను దింపేసి వెళ్ళిపోయాడు. నేను ఏడుస్తూ అమ్మ దగ్గరకు వెళ్ళాను. అమ్మ గాబరా పడుతూ వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి విషయం చెప్పింది. వాళ్ళు సినిమా వాళ్ళని, రెండు రోజుల కిందట వచ్చి భక్తప్రహ్లాద సినిమాలో వేషం కోసం పిల్లల పేర్లు రాసుకుని వెళ్లారని, మీరు ఆపై భాగంలో ఉండటం వల్ల మీ దగ్గరకు వచ్చి ఉండక పోవచ్చని చెప్పారట. ఇది వినేసరికి నేను ఇంకా ఏడుపు లంకించుకున్నాను. నేను వెళ్ళాలి అంతే. అమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా నాన్న వచ్చి వద్దని చెప్పాడు. పాపం అమ్మకు ఎటూ పాలుపోలేదు. నేను నా మొండి పట్టు విడవలేదు. మర్నాడు అమ్మ ఎలాగో ధైర్యం చేసి నాన్నకు నచ్చ చెప్పింది. నాన్న మమ్మల్ని తీసుకుని షూటింగ్ జరుగుతున్న స్టూడియోకి తీసుకెళ్లారు. అమ్మకు కూడా స్టూడియోలను, అక్కడకి వచ్చే పెద్ద నటులను చూడాలనే కొరిక తీరింది. మూడు సార్లు ఆడిషన్స్ అయిన తర్వాత ప్రహ్లాదుడి పాత్రకు నన్ను తీసుకున్నామని చెప్పారు. నేను అమ్మాయిని. ప్రహ్లాదుడు అబ్బాయి. అందుకని నాకున్న బారు జుట్టుని బారు కట్ చేస్తామన్నారు. అమ్మ అందుకు ఒప్పుకోక పోతే 'జుట్టు పోతే మళ్ళీ వస్తుంది. ప్రహ్లాదుడి పాత్ర పోతే రాదు' అన్నారు వాళ్ళు. అమ్మకు ఒప్పుకోక తప్ప లేదు. జుట్టు కత్తిరించి ప్రహ్లాదుడి వేషం వేశారు. ప్రహ్లదుడి మెడలో పాము వేయాలని అంటే, అమ్మ అట్ట పాము అనుకుంది. అప్పటికి అమ్మ గర్భవతి. అట్ట పాము కాదు నిజమైన పాము అంటూ ఒక పాము తీసుకొచ్చి నా మెడలో వేసేసరికి అమ్మ కండ్లు తిరిగి పడిపోయింది. వెంటనే నాన్నకు ఫోన్ చేసి పిలిపించి, కొంచం సేపు సపర్యలు చేసాక మాములు మనిషి అయింది. సరే ఎలాగైతే ఏమి భక్త ప్రహ్లాదుడిగా నా నాలుగవ ఏట నటించి ప్రేక్షకుల మెప్పు పొందాను. అలా మొదలైన నా సినీ జీవితం ఎక్కడ ఆగకుండా పరిగెడుతూనే ఉంది. అమ్మ నాతో షూటింగ్స్‌కి వచ్చేది. షూటింగ్ అయ్యే వరకు ఉండి నన్ను తీసుకుని ఇంటికి వచ్చేది. అమ్మకు క్రమేణా కుటుంబ బాధ్యతలు పెరుగుతూ వచ్చాయి. అయినా నా కోసం తన సమయాన్ని కేటాయించేది. నేను డబ్బింగ్ కళా కారిణిగా బాగా బిజీ అయిపోయాను. నా పిల్లలను తానే చూసేది. నాకు ఇబ్బంది లేకుండా నా ధ్యాసంతా వృత్తిపైనే కేంద్రీకరించేలా అమ్మ ఎంతో సాయపడేది. ఆలంబనగా ఉండేది. మా అబ్బాయి తరుణ్ బాల నటుడిగా షూటింగ్స్ వెళ్లెప్పుడు అమ్మనే తీసుకుని వెళ్ళేది. కొద్దీ సంవత్సరాల కిందట అమ్మకు పక్షవాతం లాగా వచ్చింది. కరోన పేరు అప్పుడప్పుడే వినిపిస్తున్న రోజులు. నేను అమ్మను కొన్నాళ్ళు నా దగ్గర ఉంచుకుందామని తీసుకొచ్చాను. ఆవిడని చూసుకోవడానికి మనిషిని కూడా పెట్టాను. ఎప్పుడూ లేనిది ఒక రోజు రాత్రి అమ్మకు పాలు తీసుకుని వెళ్ళాను. నేనే నెమ్మదిగా పాలు తాగించి, పడుకోబెట్టి, అమ్మను చూసే ఆయమ్మతో అమ్మకు ఏదైనా అవసరం అయితే వచ్చి లేపు అని చెప్పి నా గదికి వెళ్ళిపోయాను. పొద్దున ఆరుగంటలకి ఆయమ్మ వచ్చి అమ్మ పలకడం లేదమ్మ అంటే వెళ్లి చూసే సరికి అమ్మ ఈ లోకం విడిచేసింది నిద్రలోనే. అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేనిది. నిత్యం తన రెక్కల కింద నన్ను కాపాడుతూ, నన్ను నన్నుగా నిరంతరం ప్రేమించిన ఒకే ఒక్కరు మా అమ్మ.
- రోజా రమణి, ప్రముఖ సినీ నటి