Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరికి అమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయత, ప్రేమకు నిదర్శనం. ఇలా చాలా పదాలతో కేవలం మదర్స్ డే రోజు వాట్సప్‌లో ప్రేమ పదాలను స్టేటస్‌గా పెట్టుకొని ఆ ఒక్కరోజే ''అమ్మ'' కు జేజేలు అంటూ ఎంతో ఉన్నతంగా జరుపుతున్నారు. అలాంటి అమ్మ ప్రేమికులకు నా విజ్ఞప్తి...
కేవలం మదర్స్ డే రోజే కాకుండా మనకు ఊపిరి అందించిన అమ్మ ఉనికిని కాపడడమే ఆమెపై ఉన్న ప్రేమ నిదర్శనం. మన నుండి పెసర గింజంత ప్రేమను పొందాలని అన్నీ మర్చిపోయి, మనకు ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుతుండి. ఆకలి వేస్తుందేమోనని గుర్తించి మనకు అన్నం పెట్టేది 'అమ్మ' ఒక్కతే.
స్త్రీ ఏ రూపంలో వున్నా మనం గౌరవించడం మన సంప్రదాయం, భాద్యత కూడా. ప్రస్తుత సమాజంలో ఆమెకు ఎలాంటి గౌరవం దక్కడం లేదు. కేవలం మాటల్లో చెప్పడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒక ఆట వస్తువులా వాడుకొంటున్నారు. ఈ రోజు భార్యాభర్తల ప్రైవసీ కోసం అమ్మలను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. వాళ్లకు కావాల్సింది పిల్లల ప్రేమే కానీ వాళ్ళు సంపాదించే డబ్బు కాదు. మనం తన కడుపులో ప్రాణం పోసుకున్నప్పటి నుంచి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న కూడా మనల్ని మంచి దారిలోనే నడవాలని సూచిస్తూ మన వెన్నంటి ఉండేదే 'అమ్మ'.
అనేక సమస్యలు భరిస్తూ ఈ సమాజాన్ని, జీవితాన్ని గెలువలేక తనకంటూ ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న స్త్రీని సమాజం హేళన చేస్తూ మాటలతో పొడుస్తూనే ఉంటుంది. డైవర్స్ అనేది ఎదో దేశద్రోహం అనేలా చూస్తారు. కానీ ఆమె కూడా ఒక తల్లి అనేది మరుస్తారు. వారు కూడా స్త్రీలనే విషయాన్ని కొందరు మర్చిపోతున్నారు. ఒంటరి స్త్రీలు ఈ సమాజంలో స్వతంత్రంగా బతకడం చాలా కష్టమని మనం గ్రహించాలి. అందుకే వీలైతే సాయం చేయండి కాన్ని హేళన చేయకండి. ప్రపంచంలో చెడ్డ తల్లి, మంచి తల్లి అనేవారు వుండరు. పిల్లల మనసులలో ఈ వ్యత్యాసం ఉంటుందేమో కానీ ఏతల్లి చూపులోకానీ , ప్రేమలో కానీ ఉండదు.
మనకి మనం ప్రశ్నించుకుందాం. మనం ఎంతమంది మన పిల్లలతో కూర్చుని జీవితం గురించి మాట్లాడుతున్నాం. నాకు తెలిసినంత వరకు ఒక పది శాతం కూడా వుండరు. పిల్లలపై ఉన్న ప్రేమ కొన్ని విషయాలని మాట్లాడనివ్వదు. ప్రతి తల్లికి తన కూతరు ఒక ప్రశ్న లాంటిది. కూతురు యుక్త వయసుకు వస్తుందని గ్రహించి కేవలం ఆంక్షలు విధిస్తారు. ఆ వయసులో శారీరక మార్పులు, ఆలోచనల్లో మార్పులు, హార్మోనల్ చేంజ్ గురించి ఎప్పుడైనా మాట్లాడుతామా? ఆడపిల్ల యుక్త వయసు అనేది తన జీవితానికు పునాది రాయి అని చెప్పాలి. ముఖ్యంగా పరిశుభ్రత గురించి అస్సలు మాట్లాడం. దయచేసి ''అమ్మలు'' మీ పిల్లలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరానికి పూనుకోండి. వాళ్లే నేర్చుకుంటారులే అని వదిలేస్తే వారిలో విశ్వాసం కోల్పోయి జీవితం ఎదో అయిపోయిందని తమ జీవితాలనే ముగించేసుకుంటున్నారు. కనుక మన పిల్లలు ఏ వయసులో వున్నా వారితో ప్రతి విషయాన్ని చర్చించి, సలహాలు అందిస్తూ వారిపట్ల స్నేహంగా ఉండండి. ఈ మదర్స్‌డే నుండే ఈ ప్రయత్నం కొనసాగిద్దాం.
- వి.ప్రతిభ