Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్యకాలంలో చాలా మంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయినా ఉపయోగిస్తున్నాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు, బంధువులతో టచ్‌లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది. కానీ ఇది మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారీ జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం ఎమోషనల్ డిస్ట్రెస్కి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే హడావిడిలో మన గురించి మనం మర్చిపోతున్నామని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఒక్క వారం రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే.. మీ మానసిక సమస్యలు పరార్ అయిపోతాయట. డిప్రెషన్, కోపం, అసహనం వంటివి దూరం అవుతాయని, మీలో మీరే కొత్త మనిషిని చూసుకోవచ్చని తాజాగా చేసిన ఓ అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్ పరిశోధక బందం ఈ అధ్యయనం జరిపింది. సోషల్ మీడియా నుంచి దూరంగా ఉన్న వారి మానసిక స్థితిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే విషయాన్ని వీరు క్షుణ్నంగా అధ్యయనం చేశారు. ఈ వివరాలు సైబర్ సైకాలజీ బిహేవియర్, సోషల్ నెట్వర్కింగ్ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, ట్విట్టర్, టిక్‌టాక్ వంటి వాటికి దూరంగా ఉండాలని యూజర్లకు సూచించారు. వారం రోజుల్లోనే వారిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువగా ఉందని, దాని మానసిక ఆరోగ్య ప్రభావాల గురించి ఆందోళనలు పెరుగుతున్నాయని మాకు తెలుసు, కాబట్టి ఈ అధ్యయనంతో కేవలం ఒక వారం విరామం తీసుకోవాలని ప్రజలను అడగడం వల్ల మానసిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయా అని మేము చూడాలనుకుంటున్నాము అని అధ్యయనం నిర్వహించిన జెఫ్ లాంబెర్ట్ తెలిపారు. తాము నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్నవారిలో చాలామంది మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళనతో సోషల్ మీడియా నుండి సానుకూల ప్రభావాలను నివేదించారు. కేవలం చిన్న విరామం కూడా ప్రభావం చూపుతుందని ఇది సూచిస్తుందని లాంబెర్ట్ తెలిపారు.