Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేస్ట్ టు బెస్ట్
ప్రతి ఒక్కరూ ఇల్లు అందంగా ఉండాలని కోరుకుంటారు. అది చిన్నదైనా పెద్దదైనా సరే. అలంకరణకు కొంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఈ అలంకరణకు వాడే వస్తువుల్ని మనం బయట మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం. మట్టి బొమ్మలు, గాజు వస్తువులు వంటికి పగిలిపోతాయి. దాంతో మన డబ్బు వృధా అయినట్టే. ముఖ్యంగా పిల్లలు ఉంటే మాత్రం అవి కొన్ని రోజులు కూడా నిలబడవు. మరి వేలకు వేలు డబ్బులు ఖర్చుపెట్టి ఆ వస్తువులను కొనడం దండక కదా! కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి, అలంకరణగా వాడుకోవడానికి బొమ్మలు కొనకుండా మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది ఓ సారి ఆలోచించండి. ఈ ఆలోచన అద్భుతంగా ఉంది కదూ! ఒకపక్క ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటా బయటా కష్టపడుతుంటే ఇంకా బొమ్మలు ఎలా చేయాలా అనుకుంటున్నారా? ఇల్లు, సంసారం, ఉద్యోగం ఇవన్నీ జీవించడం కోసం. కళ అనేది మనసు ఆహ్లాదంగా ఉండడం కోసం. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కళ దాగి ఉంటుంది. మనం దాన్ని బయటకు తీస్తే కచ్చితంగా వస్తుంది. ఈరోజు నేను చెప్పే వాటిలో ఏదైనా ఒక బొమ్మ ప్రయత్నించి మీ ఇంట్లో అలకంరణగా పెట్టండి. మీ ఆనందానికి అవధులు ఉండవు. మరింకెందుకు ఆలస్యం మనలోపలి కళను బయటకు తీద్దాం రండీ...
యాపిల్ కవర్లతో...
రోజూ ఒక యాపిల్‌ను తింటే డాక్టర్‌ను కలవాల్సిన అవసరం ఉండదు అని పెద్దలు అంటుంటారు. ఈ మధ్య గ్రీన్ కలర్లో ఉండే యాపిల్స్ కూడా వస్తున్నాయి. అయితే యాపిల్స్‌ను కొన్నప్పుడు వాటిని చుట్టి తెల్లటి కవర్ ఒకటి ఉంటుంది. ఈ కవర్ ధర్మోకాల్, ప్లాస్టిక్ కలగలిసినట్టుగా ఉంటుంది. ఈ కవర్లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ కవర్లను పడేయకుండా దాచితే మంచి ఫ్లవర్ బొకే తయారు చేసుకోవచ్చు. దీనికి ఏమంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ కవర్‌ను పై భాగంలో కొంత, కింది భాగంలో కొంత మడత వేస్తే పువ్వులా తయారవుతుంది. దీనికి సాగే గుణం ఉంటుంది కాబట్టి సులభంగా చేయవచ్చు. ఇలా పది పువ్వులు తయారు చేసి పెట్టుకోవాలి. మరి వీటికి కాడల్ని అమర్చాలి కదా! దీని కోసం దిన పత్రికల్లోని పేపర్‌ను రోల్ మాదిరిగా చుట్టుకుంటే పొడుగ్గా కర్రల్లా వస్తాయి. అయితే కాస్త గట్టిగా ఉండాలంటే దినపత్రికల్లో వచ్చే అడ్వటైజ్మెంట్ పేపర్లను వాడుకుంటే బాగుంటుంది. ఈ పేపర్లు కొద్దిగా మందంగా ఉండటం వల్ల గట్టిగా ఉంటాయి. పువ్వులకు సరిపడా కాడలు తయారు చేయాలి. పేపర్‌ను పొడుగాటి పెన్సిల్ పెట్టి రోల్ చేసుకున్న తర్వాత పెన్సిల్ తీసివేసి, అది ఊడిపోకుండా గమ్‌తో అతికించాలి. ఇప్పుడు ఈ కాడలకు ఆకుపచ్చ రంగు టేప్‌ను చుట్టాలి. ఆకుపచ్చని కొమ్మలుగా కనపడేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కాడలకు పువ్వులను అతికించాలి. ఆకుపచ్చని కాడలు కలిగి తెల్లని పువ్వులతో ముచ్చటగా ఉంటాయి. అన్ని పూల కాడలకూ ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తే పూలగుత్తిలా కనబడుతుంది. దీనికి మనింట్లో ఉన్న ఏదైనా ఫ్లవర్‌వేజ్‌లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది.
ఫ్లవర్ వేజ్ తయారి
ఫ్లవర్ వేజ్ను కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను ఫ్యాన్ ప్యాకింగులతో ఫ్లవర్‌వేజ్‌ను తయారు చేశాను. ఫ్యాన్ ప్యాకింగుల్లో భాగంగా గుండ్రటి ప్లాస్టిక్ భాగం ఉంటుంది. గొట్టం లాంటి అట్టను తీసుకుని దానికి రంగు రంగుల టేప్‌ను చుట్టాను. ఎరుపు, ఆకుపచ్చ, సిల్వర్, గోల్డ్, పింక్, బ్లూ రంగులలో టేప్‌ను చుట్టాను. ఈ టేప్‌లు చుట్టాక మధ్యనున్న ఖాళీల్లో డిజైన్ గీసుకున్నాను. నేను కేవలం డిజైను వేసి ఊరుకున్నాను. దీనికి రంగులు వేసుకున్నా బాగుంటుంది. ఈ అట్ట గొట్టం పై భాగంలో తెల్లని ప్లాస్టిక్ గిన్నెలాంటి ఆకారాన్ని అతికించాను. ఇది కూడా ఫ్యాన్ ప్యాకింగులో వచ్చిందన్నాను కదా! ఈ ప్లాస్టిక్ గిన్నె మీద కూడా రంగుల డిజైను వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వెయ్యలేదు. ఇప్పుడు ఫ్లవర్ బొకేను అట్ట గొట్టంలో దూరిస్తే ఫ్లవర్ వేజ్లా వుంటుంది. కానీ కదిలించాలంటే మాత్రం పనికి రాదు. అందుకని ఒక అట్టను తీసుకొని అట్ట గొట్టం కిందుగా అతికించామంటే పూలు పడిపోకుండా ఉంటాయి. నేను ఇలా అట్టను అతికించటం కోసం ఇంట్లో ఉన్న కేక్ అట్టను వాడాను. బర్త్‌డేలకు కేక్ తెచ్చుకుంటాంకదా! కేక్ తినేశాక కింద ఉండే అట్ట గోల్డ్ లేదా సిల్వర్ రంగులతో చుట్టూ వంకుల డిజైన్‌తో అందంగా ఉంటుంది. నేను అలాంటి వాటిని కడిగి దాచుకున్నాను. ఇప్పుడు ఆ అట్ట పనికొచ్చింది. దానికి ఈ అట్టగొట్టం కిందగా అతికిస్తే అందమైన ఫ్లవర్‌వేజ్ తయారైంది. దీన్ని టీపారు మీద పెట్టుకుంటే అందంగా ఉంటుంది.
పేపర్ గ్లాస్‌తో
ఏ ఫంక్షన్లకు వెళ్ళినా డిస్పోజబుల్ గ్లాసులు, కప్పులే దర్శనమిస్తున్నాయి. మన ఇంట్ల కూడా ఎక్కువగా వాటినే వాడుతున్నాము. పేపర్ గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు అని రెండు రకాలు దొరుకుతున్నాయి. నేను ప్రస్తుతం పేపర్ గ్లాసును తీసుకొని పూలబుట్టను చేస్తున్నాను. ఇది గుడికి తీసుకెళ్ళే పూల బుట్ట కాదు. షోకేస్‌లో పెట్టుకునే పూలబుట్ట. ఒక పేపర్ గ్లాసును తీసుకొని దాని చివర ఉన్న అంచును కత్తిరించి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా తర్వాత పనికొస్తుంది. ఇప్పుడు గ్లాసును చీలికలుగా పొడుగ్గా కత్తిరించి పెట్టుకోవాలి. దాదాపు పది చీలికలు అయితే సరిపోతుంది. చీలికలను వెనకకు మడిచి కొద్దిగా క్రాస్‌గా పక్కనున్న చీలికలోకి గుచ్చాలి. అంటే వెదురు బుట్టలు అల్లేవాళ్ళలా అల్లాలి. కష్టమేమీ కాదు. ఇలా ప్రతి చీలికనూ వెనకకు మడుస్తూ పక్కనున్న దాంట్లో గుచ్చుతూ పోవాలి. అలా వెడల్పుగా బుట్టలా తయారవుతుంది. దాన్ని కొద్దిగా పైవైపువు వంచితే బుట్టలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు పక్కన పెట్టుకున్న గ్లాసు అంచు భాగాన్ని దీని హ్యాండిల్ వలె అమర్చాలి. ఇప్పుడు అచ్చం పూల బుట్టలా తయారవుతుంది.
పేపర్ టీ కప్పులతో...
పేపర్ గ్లాసు లాగానే టీ కప్పులతో కూడా బొమ్మలు చేయవచ్చు. ఇది చిన్న టీ కప్పులను ఉపయోగించి తయారు చేయాలి. ఈ కప్పును కూడా పైన చెప్పినట్టుగా చీలికలుగా కత్తిరించుకోవాలి. మధ్యలో భాగాన్ని పట్టుకొని చీలికలను అణచాలి. అప్పుడు అది ఒక పువ్వులాగా కనిపిస్తుంది. మధ్యలో భాగానికి నేను ఒక ప్లాస్టిక్ మూతను అతికించాను. పుప్పొడిలా చక్కగా కనిపిస్తున్నది. ఇలా కావాల్సినన్ని పువ్వులు చేసుకొని అలంకరించుకుంటే బాగుంటుంది. నేనైతే తెలుపు రంగు కప్పులను అలాగే ఉంచి పువ్వుల్ని చేశాను కానీ ఎరుపు, పసుపు వంటి రంగులు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మన క్రియేటివిటీని ఎలా అయినా ఉపయోగించవచ్చు. చక్కని పేపర్ కప్పుల పూలు తయారు చేయండి. వాడుకున్నన్ని రోజులు వాడుకొని పారేయవచ్చు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్