Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ మిథిలేశ్వరి శర్మ, ఓ జర్నా బాగ్, ఓ ప్రెసిస్ మాషేరింగ్... జన్మనివ్వకుండా కుండానే ఎంతో బిడ్డలకు తల్లులయ్యారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమై అనాథలుగా మారిన ఎంతో మంది పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. ఆ పిల్లల సంరక్షణ కోసమే తమ జీవితాలను అంకితం చేస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో తల్లి పాత్ర ఎంత కీలకమైనదో తెలియజేస్తున్న వారి గురించి మరిన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం....
మిథిలేశ్వరి శర్మ ఎస్ఓఎస్ తల్లిగా మారిన తర్వాత ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ద్వారా రెండు సంవత్సరాల శిక్షణను పూర్తి చేశారు. ఐదుగురు మగపిల్లలు, పది రోజుల ఆడ శిశువుకు తల్లిగా బాధ్యత వహించారు. ఇది తల్లి ప్రేమ అవసరమైన పిల్లలకు మానవతా, అభివృద్ధి సహాయాన్ని అందించే ఒక ఎన్జీఓ.
నా జీవితాన్ని మార్చివేసింది
''చిన్న అమ్మాయిని నా ఒడిలోకి తీసుకున్న క్షణం నా ఆనందానికి అవధులు లేవు. నేను ఇంతకుముందు నా సొంత బిడ్డను పోగొట్టుకున్నాను. సమస్యాత్మకమైన నా వివాహ బంధాన్ని విడిచిపెట్టాను. ఈ క్షణం నా జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది'' అని ఛత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌లోని ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్‌కి చెందిన ఎస్ఓఎస్ తల్లి మిథిలేశ్వరి చెప్పారు.
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది
ఆమె ఆ బిడ్డకు సుహాని అని పేరు పెట్టింది. అంటే ఆనందాన్ని వెదజల్లుతుంది. ఆ పేరు ఆ పాపకు సరిగ్గా సరిపోయింది. బిడ్డ మిథిలేశ్వరి జీవితంలోనే కాక ఇతరుల జీవితంలో కూడా ఆనందాన్ని తెచ్చిందని చెప్పింది. సుహానీకి ఇప్పుడు 12 ఏండ్లు. మిథిలేశ్వరికి ఇంటర్ చదువుతున్నప్పుడే పెళ్లయింది. వివాహ బంధంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమే సంతోషంగా ఆ బంధాన్ని వదిలేసింది. విడాకుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె గ్రామ పంచాయితీలో ఎస్ఓఎస్ పిల్లల తల్లి కోసం ఒక ప్రకటనను చూసి సంతోషించింది. ఆ ప్రకటనలోని స్త్రీ, పిల్లల చిత్రం ఆమెను ఆకర్షించాయి. వెంటనే దాని కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అనాథ పిల్లలకు తల్లులుగా
అందులో చేరిన పదిహేడేండ్ల తర్వాత ఆమె 37 మంది పిల్లలకు తల్లిగా మారారు. వీరిలో 17 మంది తమ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఐదుగురు పిల్లల్లో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ప్రస్తుతం ఆమెతో పాటు గ్రామంలోని ఇంటిలో ఉంటున్నారు. ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ ఆఫ్ ఇండియా తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయిన పిల్లలకు మద్దతు ఇస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామాలలో ఎస్ఓఎస్ తల్లులుగా తమ జీవితాలను అంకితం చేసిన మహిళలు అనాథ పిల్లలకు తల్లులుగా మారి వారి ఆలనా పాలనా చూసుకుంటారు. ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్లో దేశవ్యాప్తంగా మొత్తం 7000 మంది పిల్లలు ఉన్నారు. వీరి యోగక్షేమాలు 445 మంది తల్లులు చూసుకుంటున్నారు.
చాలా గర్వపడ్డాను
''ఒక ఎస్ఓఎస్ తల్లిగా పిల్లల ఆహారం, చదువులు, దినచర్య, విలువలను పెంపొందించడం వంటి వాటికి నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను'' అని ఆమె చెప్తున్నారు. తాను పెంచిన పిల్లల్లో ఒకరు కారును కొని అందులో మొదటిసారి ఆమెనే ఎక్కించుకుని ప్రయాణం చేసిన ఆమె కొడుకు గురించి గర్వంగా మాట్లాడుతుంది. ''నాకు సమయం దొరికినప్పుడు నేను అతని దగ్గరకు వెళుతుంటాను. అతను నాపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. తన కారులో మొదటి సారి నేనే ప్రయాణం చేయాలని పట్టుబట్టాడు. ఇది నాలో చాలా గర్వాన్ని నింపుతుంది'' ఆమె జతచేస్తుంది.
మాది ప్రేమ ప్రపంచం
జమ్మూలో ఉత్తరాన జర్నా బాగ్ ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్‌లోని తొమ్మిది మంది పిల్లల ఇంటిలో ఆమె ఎంతో బిజీగా ఉంది. ఆమె 1999లో ఎస్ఓఎస్ తల్లి అయ్యింది. అప్పటి నుండి 30 మంది మహిళలను తన పెంపకంతో ప్రేమ ప్రపంచంలోకి చేర్చుకుంది. మిథిలేశ్వరిలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన జర్నా కూడా బాధాకరమైన వివాహం నుండి తప్పించుకుంది. తన కుమార్తెకు రెండున్నరేండ్ల వయసు ఉన్నపుడు భర్త నుండి విడాకులు తీసుకుంది. తర్వాత నర్సుగా శిక్షణ పొందింది. ఆమె ఉద్యోగం చేస్తున్న ఆసుపత్రి వద్దకు వచ్చి భర్త అప్పుడప్పుడు గొడవ చేయడంతో ఆ ఉద్యోగాన్ని వదిలివేయవలసి వచ్చింది.
రెండు సంవత్సరాలు శిక్షణ తీసుకుని
ఆమె తన గ్రామంలోని మహిళా సమితిలో చేరి కుట్టుపని నేర్చుకుంది. సమితి ప్రెసిడెంట్ ఆమెకు ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజెస్ అనే కాన్సెప్ట్‌ని పరిచయం చేసారు. జర్నా దీనిని ప్రయత్నించాలని ఆలోచించారు. ''రెండు సంవత్సరాలు నేను ఎస్ఓఎస్ తల్లి కావడానికి అవసరమైన తప్పనిసరి శిక్షణను పొందాను. ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కానీ వాటన్నింటినీ అధిగమించాను'' అని ఆమె గర్వంగా చెప్పింది.
మూడు నెలల సైద్ధాంతిక శిక్షణ
ఎస్ఓఎస్ తల్లికి శిక్షణ సాధారణంగా రెండు సంవత్సరాల వరకు పడుతుంది. విద్య, కౌన్సెలింగ్, చైల్డ్ సైకాలజీ, హౌస్ కీపింగ్, పోషణ, సంఘర్షణల పరిష్కారం వంటి విషయాలపై మూడు నెలల సైద్ధాంతిక శిక్షణను ఇస్తారు. దీని తర్వాత ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్‌లో ''ఎస్ఓఎస్ ఆంటీ''గా పని చేస్తూ 21 నెలల ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. ఈ సుదీర్ఘ శిక్షణా కాలం వారిని ఎస్ఓఎస్ తల్లిగా మార్చడానికి సిద్ధం చేస్తుంది. ఎస్ఓఎస్ తల్లులు ఉచిత వసతి, భోజనం, గృహ భత్యం, జీతం పొందుతారు.
వారి రోజువారి జీవితం
ఎస్ఓఎస్ తల్లిగా జర్నా రోజూ పిల్లలకు మూడు పూటలా భోజనం పెట్టడం, వారిని పాఠశాలకు సిద్ధం చేయడం, వారితో నిత్య మాట్లాడటం, ఆడుకోవడం, బాగా చూసుకోవడం వంటివి ఉంటాయి. ఆమె ఇప్పుడు దాది (నానమ్మ), నాని (అమ్మమ్మ) కూడా అయ్యింది. తన ఇంటిని విడిచిపెట్టి బయట స్థిరపడ్డ పిల్లలను తరచుగా కలుస్తుంది. 'నా కొడుకులు, కూతుళ్లు బాగానే ఉన్నారు. వారు ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు అయ్యారు. వారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది' ఆమె చెప్పింది.
నైపుణ్యాలను అప్డేట్ చేసుకునేందుకు
పాత్ర సవాళ్లు లేనిది కాదు. అయితే ప్రారంభ శిక్షణ తమను మంచి స్థితిలో ఉంచుతుందని జర్నా అంటున్నారు. ఎస్ఓఎస్ తల్లులు వారి నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవడానికి కౌన్సెలర్లు, రెగ్యులర్ రిఫ్రెషర్ కోర్సుల సహాయం కూడా తీసుకోవచ్చు. పదవీ విరమణకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది. (ఒక ఎస్ఓఎస్ తల్లి 60 సంవత్సరాల వయసులో పదవీ విరమణ పొందింది) జర్నా తన పని ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటుంది. ''నేను చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను... చాలా మంది పిల్లలకు తల్లి కావడం నిజంగా ఎంతో మంచి అవకాశం'' ఆమె చెప్పింది.
ఎప్పటికీ తల్లులే
మేఘాలయలోని షిల్లాంగ్‌లో ప్రెసిస్ మాషేరింగ్ 2015 నుండి ఎస్ఓఎస్ తల్లిగా ఉన్నారు. ''నేను అక్కడ పనిచేస్తున్న చర్చిలోని స్నేహితుడి ద్వారా ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్ల గురించి తెలుసుకున్నాను. నేను పెద్ద కుటుంబం నుండి వచ్చాను. పిల్లలను చూసుకోవడం చాలా ఇష్టం. కాబట్టి ఇది నాకు సరిగ్గా సరిపోయే పని అని నేను అనుకున్నాను'' ఆమె చెప్పింది.
మొదట చాలా కష్టపడ్డాను
ప్రెసిస్ ఇప్పటివరకు 11 మంది పిల్లలను చూసుకుంది. ఇప్పుడు నలుగురు అబ్బాయిలకు తల్లి. ''నేను మొదట చాలా కష్టపడ్డానని ఒప్పుకోవాలి. పిల్లలు వివిధ నేపథ్యాలు, పరిస్థితుల నుండి వచ్చారు. వారు సర్దుకుపోవడం కష్టంగా అనిపించింది. నేను కూడా అలాగే ఉన్నాను. కానీ రెండు నెలల తర్వాత మేము ఈ ఆలోచనకు అలవాటు పడ్డాము. ఇప్పుడు ఒక సంతోషకరమైన కుటుంబంగా మేము ఉన్నాము'' అని ఆమె చెప్పింది.
ప్రతి విషయాన్ని తెలుసుకుంటాను
ఇతర తల్లుల మాదిరిగానే ప్రెసిస్ కూడా తన ఇంటి నుండి బయటకు వెళ్ళిన పిల్లలతో సన్నిహితంగా ఉంటుంది. వారు సాధించిన విజయాల పట్ల గర్వంగా ఉంది. ''నేను వారిని క్రమం తప్పకుండా కలుస్తూ ఉంటాను. వారి జీవితంలోని ప్రతి విషయాన్ని తెలుసుకుంటాను'' అని ఆమె చెప్పింది. అబ్బాయిలు 12-13 సంవత్సరాల వరకు వారి తల్లులతో ఉంటారు. అమ్మాయిలు 18 సంవత్సరాల వరకు ఉంటారు. ఆ తర్వాత వారు యువజన కార్యక్రమంలో చేరి వారి విద్యను కొనసాగిస్తారు.
అమ్మ సూర్యుడిలాంటిది
మిథిలేశ్వరి, జర్నా, ప్రెసిస్ కథలు వింటుంటే ప్రతి మనిషి జీవితంలో తల్లి పాత్ర ఎంత ముఖ్యమైనదో ఇట్టే తెలుస్తుంది. మిథిలేశ్వరి తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించింది. ''మా ఏక్ సూర్య కీ సమ్మాన్ హై, సబ్ కో ఏక్ తరః కీ ప్రకాష్ దేతీ హైం. సముద్ర ఔర్ నదియోం కీ తరః అప్నే మే సమేత్ లేటీ హై, మా కే జైసే చయ్యా కహిం నహీం మిల్ సక్తా.'' (తల్లి సూర్యుడిలాంటిది. అందరికీ సమానమైన వెలుగులు పంచుతుంది. ఆమె సంరక్షణలో, పిల్లలు అపరిమితమైన ప్రేమను పొందారు.)
- సలీమ