Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో, నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం. అది మనం కరోనా కాలంలో చూశాం. సొంత వారు సైతం దగ్గరకు రాలేని పరిస్థితుల్లో నర్సులు తల్లుల్లా మారి విశేషమైన సేవలు అందించారు. ఫ్రంట్ వారియర్స్‌గా నిలబడి ఎంతో మందికి ఊపిరి పోశారు. లేడీ విత్ ద లాంప్‌గా ప్రసిద్ధి చెందిన ఫ్లారెన్స్ నైటింగేల్ పుట్టిన రోజైన మే 12న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ఒక పండుగలా జరుపుకుంటారు. ఈసందర్భంగా ఫ్లారెన్స్ గురించి ఆమె వారసులుగా రోగులకు విశిష్టమైన సేవలు అందిస్తున్న నర్సుల జీవితాల గురించి తెలుసుకుందాం...
ఇటలీలో 1812 సంవత్సరంలో ఫానీ నైటింగేల్, విలియం ఎడ్వర్డ్ దంపతులకు ధనిక కుటుంబంలో మే 12న ఫ్లారెన్స్ నైటింగేల్ జన్మించారు. నర్సుగా మారి లేడి విత్ ది లాంప్‌గా పేరెన్నికగన్న ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలవలన మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. యుద్ధంలో దెబ్బ తిన్న ప్రతి సైనికుడికి తాను బతుకుతాను అన్న ఆశ చిగురించేది. ఎన్నో కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నది. స్త్రీలు ఇంటిపట్టునే ఉండాలన్న కట్టుబాట్లను ఛేదించింది. అవివాహితలు ఇంటి పనులు, చర్చి పనులే చేయాలనీ ఆరోజుల్లో చెప్పేవారు.
ఇద్దరు బిడ్డల్ని దత్తత తీసుకుని
తండ్రి విలియం ఎడ్వర్డ్ తన కుమార్తెలకు గణితం, భూగోళం వ్యాకరణం చరిత్రతోపాటు గ్రీకు, లాటిన్ భాషలు బోధించేవాడు. అయినా పేదలకు, అనాథలకు సేవ చేయాలన్న అభిలాష ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు పుట్టుకతోటే వచ్చి వయసుతోపాటు పెరిగింది. ఫ్లోరెన్స్‌కు ఒక అక్క ఉండేది. తండ్రితోపాటు అక్కచెల్లెళ్ళు ఇద్దరు ఊర్లు తిరిగేవారు. తల్లి సాహితి ప్రపంచంలో ధ్రువతారగా వెలగాలని కోరినా ఫ్లోరెన్స్ జర్మనీలో కైసర్ సంస్థను గూర్చి విని అక్కడే పని చేయాలనీ నిర్ణయించుకుంది. ఇద్దరు బిడ్డల్ని దత్తత తీసుకుని పెంచడం మొదలుపెట్టింది. 1852లో ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడి ఆసుపత్రులను చూడగానే వాటిల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావలనుకుంది.
సైన్యానికి వైద్య సేవలు
1853లో సిస్టర్స్ ఆఫ్ చారిటికి వెళ్ళింది. తిరిగి లండన్ వచ్చి తన నాయనమ్మకు సేవ చేయడానికి వెళ్ళగా అక్కడ కలరా వ్యాపించింది. వెంటనే ఆసుపత్రులకు వెళ్లి రోగులకు పగలు, రాత్రి అనేక సేవలందించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి రోగులకు మంచి ఆహారం అందించింది. 1854-56లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లారెన్స్ తోటి నర్సులను కూడగట్టుకొని యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించింది. వారికీ ధైర్యం చెప్పింది. సాటి నర్సులు వారిని విసుక్కునేవారు. ఏ పని దొరక్క ఈ పనికి వచ్చాం అనేవారు. కానీ ఎంతో ధనిక కుటుంబం లోనుంచి వచ్చిన ఈమె కోరి ఈ పనిని ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో చేసేది. ఎంతో గుండె నిబ్బరంతో, చిమ్మ చీకట్లో కూడా చిరు దీపం వెంట తీసుకుని వెళ్లి సేవలు చేసేది.
అక్షరాస్యతను పెంచింది
విశ్రాంతి లేకుండా పని చేస్తున్న ఆమె ఒకరోజు స్పృహ తప్పి పడిపోయింది. సైనికులకు వచ్చిన జ్వరమే ఆమెకు వచ్చింది. కాసిల్ ఆసుపత్రిలో ఆమెను రోగిగా చేర్చుకున్నారు. ఆమెను చూసి మిగతా రోగులు కన్నీరు కార్చారు. కొంచెం నయం అవగానే ఆమె తిరిగి క్రిమియా, స్కుటారి ఆసుపత్రుల మధ్య తిరుగుతూ రోగులకు సేవలందించింది. ''తాగుడుకు డబ్బు ఖర్చు పెట్టకండి. మీ ఇళ్ళకి డబ్బు పంపండి. వారి భుక్తి గడుస్తుంది'' అని నైటింగేల్ చెప్పేది. గ్రంథాలయాలు, చదువుకునే గదులు అందరికి అందుబాటులో ఉండేటట్లు చూసి అక్షరాస్యతను పెంచింది. నోట్స్ఆన్ హాస్పిటల్స్, నోట్స్ ఆన్ నర్సింగ్, అనే గ్రంథాలను రాయడమే కాకుండా విక్టోరియా రాణికి, ప్రభుత్వ అధికారులకి హాస్పిటల్స్ బాగు కొరకు అభ్యర్థనలను పంపింది. అప్పటి నుంచే నుర్సులకు తప్పనిసరిగా శిక్షణను ఇవ్వడం ప్రారంభమైంది. 1860 జూన్ 24న నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సేస్ అనే సంస్థను లండన్‌లో స్థాపించారు. ఆమెను 'మదర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్' గా గుర్తించారు.
మహిళలకు నర్సింగ్ శిక్షణ
భారత దేశానికి కూడా ఆమె ఎంతో సేవలనందించింది. 1859లో విక్టోరియా రాణి ఆరోగ్య సంస్కరణల కొరకు ఒక కమిషన్ నియమించింది. చెన్నై నగరపు మేయర్ మహిళా నర్సులకు శిక్షణను ప్రోత్సహించారు. నగర పారిశుధ్యం మెరుగు పడింది. ఫ్లారెన్స్ సలహాలతో మన దేశంలో మరణాల రేటు తగ్గింది. 1910 ఆగస్ట్ 13లో ఫ్లారెన్స్ మరణించినా సేవా నిరతిగల ప్రతి నర్సులోను ఆమె కలకాలం జీవించి ఉంటుంది.
- పాలపర్తి సంధ్యారాణి
సేవా దృక్పథంతోనే వస్తున్నారు
మా సొంత ఊరు గుంటూరు జిల్లా రెంట చింతల. ఇంటర్ అయ్యాక జనరల్ నర్సింగ్‌లో చేరాను. నర్సింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ మా అమ్మ చాలా బలవంత పెట్టింది. తప్పని సరిగా అమ్మ కోసం చేరాల్సి వచ్చింది. చేరిన తర్వాత ఇష్టం ఏర్పడింది. నర్సింగ్‌లో నాకు 27 సంవత్సరాల అనుభవం ఉంది. మొదట నేను స్టాఫ్‌నర్స్‌గా చేరాను. ఏడు నెలలకే ఇంచార్జ్‌గా పదోన్నతి పొందాను. ఇంచార్జ్ అంటే రోగులను సరిగా చూస్తున్నారా లేదా, సమయానికి మందులు ఇస్తున్నారా లేదా, రోగులతో ఎలా ప్రవర్తిస్తున్నారు మొదలైనవన్ని చూడవలసి ఉంటుంది. ఒక వార్డులో 40మంది రోగులు ఉండేవారు. వారి బాగోగుల బాధ్యత కూడా ఉంటుంది. నేను మొదట మెడిసిటీ హాస్పిటల్లో చేరాను. అక్కడ ఒక సంవత్సరం చేసిన తర్వాత కేర్ హాస్పిటల్ 1997లో కొత్తగా పెడితే అందులో చేరాను. అప్పటి నుంచి కేర్‌లోనే చేస్తున్న. అయితే నాకు 2003లో సౌదీ వెళ్లే అవకాశం వచ్చింది. నాలుగు ఏండ్లు సౌదీలో ఉన్నాను. 2007లో మన దేశం తిరిగివచ్చి మళ్ళీ కేర్ హాస్పిటల్లోనే చేరాను. సౌదీకి కూడా నేను నర్సింగ్ ఉద్యోగం మీదనే వెళ్ళాను. అక్కడ రోగులను నర్సలు మాత్రమే తాకలి. వారికి ఏ అవసరం అయిన నర్సులే తీసుకెళ్లాలి. స్నానం కూడా నర్సులే చేయించాలి. వార్డ్ బాయిస్ కానీ, ఆయమ్మలు కానీ వాళ్ళను తాకటానికి వీల్లేదు. వాళ్ళ పని కేవలం వార్డులను శుభ్రపరచడమే. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అన్ని ఆధునిక సదుపాయాలు ఉంటాయి. మన దగ్గర రోగులకు స్నానాలు చేయించాలన్న, టాయిలెట్లుకి తీసుకెళ్లాలన్న ఆయమ్మలు కాని వార్డ్ బార్సు కానీ చేస్తారు.
నర్సుగా సేవాలందించడం ఎంతో ఓర్పు సహనంతో కూడుకున్న పని. ఒక్కోసారి రోగులు వాళ్ళు ఉన్న పరిస్థితి వల్లనో, కుటుంబ, ఆర్ధిక సమస్యల వల్లనో చిరాకు పడటం, అరవడం,ఆడిగిందే మళ్ళీ అడగటం ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటాము. అయితే ఆ సమయంలో వారికి సరైన రీతిలో సమాధానం చెప్పి, మానసిక స్థైర్యాన్ని అందించగలగాలి. వారికి మేము చెప్పే సమాధానం తృప్తి పరిస్తేనే శాంతంగా ఉంటారు. హాస్పిటల్ వాతవరణం అంటే రోగులతో నిండి ఉంటుంది. వేరే రోగులను చూసినప్పుడు ఇతర రోగుల మనసు కలత పడటం, భయపడటం లాంటివి సహజం. ఆ సమయంలో వారికి స్వాంతన కలిగించే మాటలు చెప్పాలి. కమ్యూనికేషన్ అనేది సరిగా ఉంటే వాళ్ళు అలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదు. రోగులు కోలుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము రోగులకు సేవ చేస్తాం, అందరిని గుర్తు కూడా పెట్టుకోలేము. కానీ వాళ్ళు గుర్తు పెట్టుకుని పలకరించినప్పుడు మనసు ఆనందంతో తుళ్ళి పోతుంటుంది. ఎందరో ఆత్మహత్యలకు పాల్పడిన వారిని చూసాను. వాళ్ళ కుటుంబ పరిస్థితి, సమస్యలను తెలుసుకుని కౌన్సెలింగ్ చేస్తాను. జీవితం ఎంత విలువ అయిందో చెప్తాను. వాళ్లకు ఏమైనా అయితే కుటుంబం ఏ విధంగా దెబ్బ తింటుందో వివరంగా చెప్తాను. వాళ్లకు మళ్లీ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన రాకుండా కౌన్సెలింగ్ చేస్తాను.
ఇప్పటి తరానికి కొంచం ఓర్పు తక్కువ. వాళ్ళు కనుక పూర్తి డెడికేషన్‌తో రోగులకు సేవలు అందిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. ఐటి రంగంలోని వారితో పోలిస్తే మాకు జీతాలు చాలా తక్కువ. అయిన కూడా నర్సింగ్ రంగాన్ని ఎంచుకుంటున్నారు అంటే సేవ చేయాలనే దృకపథం ఉండబట్టే. మేము ట్రైనింగ్ తీసుకునేప్పుడు ఏదైనా సరిగా చేయకపోతే దెబ్బలు పడేవి. ఇప్పుడు అలా కాదు. ఎవరిని ఏమి అనడానికి లేదు. అదొక పెద్ద డ్రా బాక్.. కోవిడ్ సమయంలో చాలా సర్వీస్ చేసాము. చిన్న వయసులో ఉన్న నర్సులు కూడా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేయడానికి ముందుకు వచ్చారు. కోవిడ్ రోగులకు ఎంతో కౌన్సిలింగ్ చేయవలసి వచ్చేది. పరిస్థితులు అలాంటివి. భయం సహజం కదా. ఏది ఏమైనా ఈ రంగంలో ఉండడం నాకెంతో తృప్తినిచ్చింది.
- గాదె జోజమ్మ, కేర్, ముషీరాబాద్
సేవ చేయడం తృప్తిగా ఉంది
మా ఇంట్లో అందరిలోకి నేనే చిన్నదాన్ని. నర్సింగ్‌లోకి మా అక్క ప్రోత్సాహంతో వచ్చాను. నర్సింగ్ కోర్సు చేయాలని, ఈ వృత్తిలోకి రావాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఇంటర్ తర్వాత అక్క నాకు చెప్పకుండా ఫాం నింపేసి అడ్మిషన్ తీసుకుంది. ఇష్టం లేకున్నా తప్పని సరిగా చేరవలసి వచ్చింది. నర్సింగ్ పూర్తి అయిన తర్వాత కొన్నాళ్ళు సూర్యాపేటలో చేసాను. ప్రస్తుతం నాకు నర్స్‌గా 20 సంవత్సరాల అనుభవం ఉంది. నర్సింగ్ రంగంలోకి వచ్చేవారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. సహనం, ఓర్పు ఎంతో అవసరం. మనకు వ్యక్తిగత సమస్యలు ఎన్ని ఉన్నా డ్యూటీకి వెళ్ళాము అంటే మన సమస్యలన్నింటిని బైటనే వదిలేసి రావాలి. రోగులు సంతోషంగా ఉండేలా చూడాలి. నేను ఎక్కువ ఆపరేషన్ థియేటర్లో డ్యూటీ చేస్తాను. ఆపరేషన్ చేస్తున్నపుడు అది సక్సెస్ అయ్యి రోగి కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనసులో అనుకుంటాను. ఆపరేషన్ అనగానే చాలా మందికి లోలోపల భయం ఉంటుంది. అది సహజం కూడా. అటువంటి పరిస్థితుల్లో రోగికి ధైర్యం చెప్పడం, ఆపరేషన్ వల్ల త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉంటారనే మానసిక స్థైర్యాన్ని కలిగించడం ఎంతో ముఖ్యం. అవసరం కూడా. ఆపరేషన్ థియేటర్లో కాబట్టి వార్డ్స్‌లోని రోగులను చూసే అవకాశం ఉండేది కాదు. కోవిడ్ - 19 సమయంలో ఆపరేషన్న్లు ఉన్నాయి అంటేనే వెళ్ళేదాన్ని. ఆ సమయంలో వృత్తిపరంగా కాదు కాని వ్యక్తిగతంగా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాను. నేను ఉండేది అద్దె ఇంట్లో. ఇంటి ఓనర్ బైట నుంచి రాగానే ముందు మీరు స్నానం చేసి వెళ్ళండి, ఏమి ముట్టుకోకండి అనేవారు. ఇంట్లో పిల్లల్ని కూడా దూరంగా పెట్టాల్సి వచ్చేది. స్నానం చేసిన తర్వాతనే పిల్లల్ని దగ్గరకు తీసేదాన్ని. భోజనము అప్పుడే వాళ్లకు పెట్టి నేను తినేదాన్ని. ఇష్టం లేకుండా చేసిన నర్సింగ్ కోర్సు క్రమేణా ఆ వృత్తి పై మమకారాన్ని, తృప్తిని పెంచాయి. సేవలో ఎంత సంతోషం, తృప్తి ఉందొ నా 20 ఏండ్ల అనుభవంలో తెలుసుకున్నాను.
- శ్రీలత, ఎస్.ఎం.ఆర్ హాస్పిటల్, పిర్జాదిగూడ