Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ హార్ట్ బీట్‌ను పెంచే లేదా రక్తప్రసరణని మెరుగుపరిచే ఏ రకమైన చర్యనైనా ఎక్సర్సైజ్గా పరిగణించవచ్చు. ఆ లెక్కన నడక కూడా ఒక వ్యాయామమే. మానవుల శరీర నిర్మాణం ఎక్కువగా వాకింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. అందుకే నడకను డాక్టర్లు అందరికీ రికమండ్ చేస్తుంటారు. వాకింగ్ ఒక సింపుల్ ఎక్సర్సైజ్. ఇది ఒత్తిడి తగ్గించడం నుంచి కండరాలను దృఢంగా మార్చేంత వరకు బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏవో తెలుసుకుందాం.
- ఇప్పటివరకు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండని వారికి వాకింగ్ లేదా రన్నింగ్ ఎంతో బాగా పని చేస్తుంది. ప్రతిరోజూ నడవడం వల్ల బరువు, ఆరోగ్యం, కేలరీలను అదుపులో ఉంచుకోవచ్చు. నడక వంటి తేలికైన వ్యాయామాలు గుండె సంబంధ వ్యాధులు వచ్చే రిస్క్‌ను బాగా తగ్గిస్తాయి. వేగంగా నడవటం వల్ల శ్వాసక్రియ వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేగంగా నడుస్తున్నప్పుడు గాలి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పరిమాణం పెరుగుతుంది. రక్తపోటు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు కూడా వాకింగ్ చెక్ పెడుతుంది.
- మన అడుగులే మన ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగుపరుస్తాయని అనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చేయడమే కాదు వచ్చిన అనారోగ్యాలను కూడా పోగొట్టే శక్తి వాకింగ్ సొంతం.
- ప్రతిరోజూ కేవలం 30 నిమిషాల పాటు నడవడం వల్ల ఫిట్నెస్ను బాగా పెంచుకోవచ్చు. 30 మినిట్స్ వాక్ మీ భంగిమను మెరుగుపరుస్తుంది, కొవ్వును కరిగిస్తుంది. డైలీ వాకింగ్ వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.
- మీ కాళ్లలోని అన్ని ప్రధాన కండరాలు దృఢపడతాయి. వాకింగ్ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ నడవడం వల్ల నిరాశ, ఒత్తిడి, ఆందోళన అలసట గణనీయంగా తగ్గుతాయి. ఒత్తిడితో బాధపడుతున్నవారు హ్యాపీ లైఫ్ గడపడానికి వాకింగ్ బెస్ట్ ఎక్సర్సైజ్గా నిలుస్తుంది.
- వాకింగ్ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజూ వాకింగ్ చేయడం ద్వారా మనలో ఓర్పు పెరుగుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వాకింగ్ చేయడం వల్ల ఆడ, మగ భేదం లేకుండా అందరికీ సమానమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
- డైలీ ఒకే దూరం, ఒకే ప్రదేశంలో వాకింగ్ చేయడం వల్ల పూర్తిస్థాయిలో బెనిఫిట్స్ పొందలేము. అందుకే డిఫరెంట్ ప్లేసుల్లో రోజూ కాస్త ఎక్కువసేపు నడవడం మంచిది. మీరు పార్క్‌లో నడవచ్చు. మీ ట్రెడ్‌మిల్‌పై రోజూ కొంత ఎక్కువ దూరం నడిచేలా సెట్ చేసుకోవచ్చు. లేదా అంతస్తుల పైకి నడుస్తూ మీ శరీరాన్ని మరింత స్ట్రాంగ్‌గా మార్చొచ్చు.
- మ్యూజిక్ వినే సమయంలో ఊరికే కూర్చోకుండా నడవడం ద్వారా కేలరీలు కరిగించుకోవచ్చు. మరింత వేగంగా, మరింత ఎక్కువసేపు నడవడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.