Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మారుతున్న జీవనశైలి కారణంగా తల్లిదండ్రులు బిజీ అయిపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయారనో.. లేక ఉదయం ఎక్కువ పని ఉందనో.. ఏదో కారణంతో చాలామంది బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తుంటారు. మధ్యాహ్నం నేరుగా భోజనం పెట్టొచ్చులే అని బద్ధకిస్తారు. అయితే పిల్లల విషయంలో మాత్రం ఆ పొరపాటు చేయొద్దు అంటున్నారు నిపుణులు. పిల్లలు తీసుకునే ఆహారం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఎదిగే వయసున్న పిల్లలకు పోషకాహారం అందించటం చాలా ముఖ్యం. పిల్లలు ఆరోగ్యంగా, తెలివిగా ఉండాలంటే ఉదయం అందించే బ్రేక్ పాస్ట్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపకూడదు అంటున్నారు.
- చాలా మంది తల్లి దండ్రులు పిల్లలలకు ఉదయం స్కూల్‌కు పంపే హాడాహుడిలో ఓ గ్లాసు పాలిచ్చి, మధ్యాహ్నం బోజనం క్యారేజ్‌లో పెట్టి పంపించేస్తుంటారు. ఇలా చేయటం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా భార్య, భర్తలు ఇరువురు ఉద్యాగస్తులైన కుటుంబాల్లో పిల్లలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేకుండానే పాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు.
- పోషకాహార నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తినిపించాలి. లేకపోతే పిల్లల ఎదుగుదలపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు, పిల్లల మానసిక వికాసంపై దాని ప్రభావం ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది.
- ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకున్న పిల్లల్లో ఏకాగ్రత, చురుకుదనం అధికంగా ఉన్నట్టు తేలింది. పిల్లల్లో ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, చదివినవి గుర్తుంచుకోవడానికి, నాడీకణాలను ప్రశాంతంగా ఉంచి, మరింత చురుగా ఆలోచనా శక్తిని పెంచడానికి ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా విటమిన్స్, ప్రొటీన్స్, ఖనిజలవణాలతో కూడిన ఆహారాన్ని అందించాలి.
- ఉదయం అల్పాహారం తీసుకోకపోతే దాని ప్రభావం కండరాలు, మెదడు పని తీరుపై ప్రభావం చూపుతుంది. ఉదయం అల్పాహారం తీసుకోక పోవటం వల్ల పిల్లలు శరీరానికి అవసరమైన పోషకాలను పొందలేకపోతారు. అల్పాహారంగా పాలు, పండ్లతోపాటు, ప్రొటీన్, ఫైబర్‌తో కూడిని ఆహార పదార్ధాలను బ్రేక్ ఫాస్ట్‌లో భాగం చేసుకోవాలి.
- మఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయని పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోవటంతోపాటుగా త్వరగా అలసిపోతారు. పిల్లలు ఉదయం ఇడ్లీ, దోశ, ఉప్మా, పండ్లు, పీనట్ బటర్ లాంటివి తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కలిగిన ఆహారాల మిశ్రమం వారి అల్పాహారంలో చేర్చడం ఉత్తమం.
- పిల్లలు మారాం చేస్తున్నారు కదా అని.. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా జంక్ ఫుడ్ లాంటి వాటిని అందించటం ఏమాత్రం మంచిది కాదు. ఇలా చేస్తే వారి దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్రప్రభావం ఉంటుంది. అందుకే మన సంప్రదాయ వంటలైన ఇడ్లీ.. లేక మరే ఇతర పలహారాలైనా ఉత్తమమే అంటున్నారు. కాస్త ఆయిల్ ఫుడ్ మాత్రం దూరం పెడితే చాలు అంటున్నారు.