Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేస్ట్ టు బెస్ట్
ప్రతి ఇంట్లో పాత బట్టలు ఎన్నో ఉంటాయి. గతంలో పెద్ద పిల్లలకు కుట్టించిన బట్టలు పొట్టివైతే తర్వాత పిల్లలకు తొడిగే వాళ్ళు. ఇంట్లో నలుగురైదుగురు ఉండేవాళ్ళు కాబట్టి అలా జరిగేది. ఇప్పుడు అలా ఉండటం లేదు. పాత బట్టలు వేసుకునే వాళ్ళు లేరు. అందుకని ప్రతి ఇంట్లో వాడేసిన లేదా బిగుతైన బట్టలు చాలా కొత్తగా ఉండగానే పక్కన పెట్టేస్తున్నారు. కాస్త ఆలోచిస్తే అలాంటి వాటిని మనం కొత్తగా వాడుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...
పాత నైటీలతో బిగ్ షాపర్
మనం ఇప్పుడు పాత నైటీతో బిగ్ షాపర్ కుట్టేదాం. చాలా మందికి బజారు కెళ్ళేటపుడు బిగ్ షాపర్లు బాగా ఉపయోగపడతాయి. అలాంటి బిగ్ షాపర్ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో బియ్యం సంచులు ఉంటాయి కదా! ఈ బియ్యం సంచిని కత్తిరించుకొని ఉంచాలి. బిగ్ షాపర్ సైజులో కత్తిరించాలి. ఇలా రెండు ముక్కలు కత్తిరించుకోవాలి. అలాగే అదే సైజులో నైటీని రెండు ముక్కలుగా కత్తిరించాలి. అంటే లోపలి వైపుకు బియ్యం సంచి వస్తుంది. పై వైపుకు నైటీ క్లాత్ వస్తుంది. బయటి నుంచి చూసే వారికి చక్కటి డిజైనుతో అందంగా కనిపిస్తుంది. లోపలి వైపు కూడా కావాలంటే క్లాత్ వేసుకోవచ్చు.
ముందుగా ఒక క్లాత్ ముక్క ఒక బియ్యం సంచి ముక్క కలిపి కుట్టుకోవాలి. వీటిని మూడు వైపులా కుట్టేయాలి. నాలుగో వైపున కర్రలు పెట్టటానికి వీలుగా మడిచి కుట్టాలి. ఆ సైజులో కర్రలను తీసుకొని ఆ రంధ్రంలో నుంచి దూర్చాలి. ఈ సంచి అడుగు భాగం కుట్టేటప్పుడు ఒక బెత్తెడంత క్లాత్‌ను అతికించాలి. అంటే ఎక్కువ సామాన్లు పట్టటానికి అన్నమాట. ఇలా తయారైన సంచి కూరగాయలు, సరుకులు వంటివి తెచ్చుకోవడానికి బాగుంటుంది.
డోర్ మాట్స్
కాటన్ చీరలు, కాటన్ లెగ్గిన్స్, పెట్టి కోట్స్, నైటీలు వంటి వాటితో 'డోర్ మాట్' తయారు చేయవచ్చు. మొదటగా మనం ఎంచుకున్న వస్త్రాన్ని తీసుకొని సన్నని పీలికలుగా కత్తిరించుకోవాలి. ఈ పీలికలను ఒక దాని కొకటి అతుక్కునేలా చేయాలి. దానికోసం మూడు పీలికలను తీసుకొని జడలాగా మూడు పాయలతో అల్లుకోవాలి. ఈ మూడు పీలికలు మూడు రంగులతో తీసుకుంటే అల్లిక బాగుంటుంది. మొత్తం పీలికలన్నీ అల్లుకుంటూ వెళ్ళాలి. మొత్తం పెద్ద తాడులాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని గుండ్రంగా చుడుతూ సూదితో కుట్టుకోవాలి. మనం చుట్టుకున్నవి ఊడిపోకుండా కుట్లు టాకా వేసుకుంటూ రావాలి. ఇది ఇలా చుట్టుకుంటూ మనకు ఎంత సైజు కావాలో అంత సైజు వచ్చేదాకా చుట్టాలి. గుండ్రంగా కానీ, దీర్ఘ చతురస్త్రంలో కానీ మనకు ఇష్టం వచ్చిన ఆకారంలో డోర్ మాట్ను తయారు చేసుకోవచ్చు.
పాత చీరలతో కటన్స్
కొన్ని చీరలు బాగా గట్టిగా ఉంటాయి. కానీ కట్టుకోబుద్ది కాదు చాలా మందికి. అలా అని మూలన కూడా పెట్టబుద్ది కాదు. దాని డిజైన్ కూడా బాగుంటే గనుక వీటిని కర్టెన్లుగా తయారు చేసుకోవచ్చు. తలుపు సైజు చూసుకుని కత్తిరించుకోవాలి. పైన, కింద పట్టీల లాగా కుట్టాలి. పైన కుట్టిన పట్టీలో నుంచి కర్టెన్ రాడ్‌ను దూర్చవచ్చు. లేదంటే ఆ పట్టీకి పైన నిలువుగా పట్టీలు కుట్టుకోవచ్చు. ఈ నిలువు పట్టీలలో నుంచి కర్టెన్ రాడ్‌ను దూర్చి కర్టెన్ను వేసుకోవచ్చు. నేను సాదా టమోటో రంగులో ఉన్న చీరను తీసుకొని కర్టెన్‌గా కుట్టిన తర్వాత దానికి పెయింటింగ్ వేశాను. కర్టెన్ కింది భాగంలో చక్రాలను పెయింట్ చేస్తే చాలా అందంగా వచ్చింది. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఈ కర్టెన్ డిజైన్ బాగుంది, ఎక్కడ కొన్నారు..? అని అడిగే వాళ్ళు. ఇలాంటి యూనిక్ డిజైన్లతో కర్టెన్లు తయారు చేయవచ్చు.
వాల్ హాంగింగ్
ఇప్పుడు పిల్లలకు ఎక్కువ జేబుల పాంట్లు వస్తున్నాయి కదా! పాతబడిన జీన్స్ పాంట్ల జేబుల్ని కత్తిరించి పెట్టుకోవాలి. మూడు జేబులను కత్తిరించి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా పొడుగ్గా ఉండే కాలు భాగాన్ని కత్తిరించి రెండు పొరలతో కలిపి కుట్టేయాలి. ఈ జీన్సు బట్టకు పైనుంచి కింది వరకు మూడు జేబులను కుట్టాలి. అంటే వాల్ హాంగింగ్లా పని చేస్తుంది. జేబులపై ఏదైనా అద్దాలు కానీ పూసలు కానీ కుట్టవచ్చు. లేదా ఏదైనా బొమ్మను పెయింట్ చేయవచ్చు. అప్పుడు జేబులు స్పెషల్‌గా కనిపిస్తాయి. ఈ వాల్ హాంగింగ్ పైభాగాన తగిలించుకునేందుకు వీలుగా ఒక కొక్కెం లాగా కుట్టాలి. దీని చుట్టూతా లేసులు కుట్టుకుంటే బాగుంటుంది. ఇది హాల్లో ఎక్కడైనా తగిలించుకుంటే వాటిలో తాళాలు, ఫోన్లు, పెన్నులు వంటివి పెట్టుకోవచ్చు.
హ్యాండ్ పర్స్
ఏ కలర్ చీరకు ఆ కలర్ హ్యాండ్ పర్స్‌ను మనమే తయారు చేసుకోవచ్చు. జాకెట్లను ఇంట్లోనే కుట్టుకునే వాళ్ళ మిగిలిన ముక్కలతో కుట్టుకోవచ్చు. జాకెట్లో మిగిలిన ముక్కల్ని దాచిపెట్టి మ్యాచింగ్ పర్సును తయారు చేసుకోవచ్చు. లేదా చీరలో చిన్న ముక్కను కట్ చేసి దానిని పర్స్‌గా కుట్టుకోవచ్చు. చీరకు మ్యాచింగ్ జాకెట్టులా పర్సులా అన్నమాట. దీర్ఘచతురస్రాకారంగా ముక్కల్ని కత్తిరించి పెట్టుకోవాలి. పైభాగాన జిప్ కుట్టుకొని పర్సు మీద పూసలు, తళుకులు కుట్టుకోవచ్చు. లేదంటే పర్సు వెనక భాగం ఎక్కువ కత్తిరించుకొని కవర్లా వచ్చేలా కుట్టుకోవాలి. అంటే పోస్ట్ కవర్లా అన్నమాట. చివర్లో బటన్‌ను కుట్టుకుంటే బాగుంటుంది. ఇలా పడేసే బట్టలతో ఎన్నో తయారు చేసుకోవచ్చు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్