Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండ్లయి పిల్లలు పుట్టే వరకు ఎంతో ఉత్సాహంతో పనిచేసే మహిళలు.. మెటర్నిటీ తర్వాత తమ బాధ్యతల దృష్ట్యా తమకు ఇష్టం ఉన్నా, లేకపోయినా వర్క్ లైఫ్‌కు పూర్తిగా దూరమైపోతున్నారు. అయితే మరికొంతమంది మహిళలు మాత్రం ఉద్యోగంపై ఉన్న మక్కువను వదులుకోలేకో, లేదంటే తమ ఆర్థిక స్థితిగతుల వల్లనో కారణమేదైనా ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఉద్యోగం చేయకుండా ఇంటికి పరిమితమైన తల్లుల కంటే.. పిల్లలు పుట్టాక కూడా ఉద్యోగాన్ని కొనసాగించే అమ్మలే తమ పిల్లలకు రోల్ మోడల్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అది కూడా అబ్బాయి కంటే అమ్మాయిల పైనే ఉద్యోగం చేసే తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఆ విశేషాలేంటో చూద్దాం...
పిల్లలు అన్ని విషయాలు నేర్చుకునేది తమ తల్లిదండ్రుల నుంచే. అయితే మహిళలు తమ నైపుణ్యాలతో అందనంత ఎత్తుకు ఎదుగుతోన్న ఈ రోజుల్లోనూ కొన్ని చోట్ల వాళ్ళను ఎదగనివ్వకుండా చేస్తున్నాయి పలు మూసధోరణులు. వీటిని బద్దలుకొట్టాలనే విషయాన్ని కూతుళ్లు ఎదిగే క్రమంలో ఉద్యోగం చేస్తోన్న తమ తల్లుల్ని చూసే నేర్చుకుంటుంటారు. ఈ విషయం నిరూపితమైంది కూడా. 'ఉద్యోగం చేసే అమ్మలు.. తమ కూతుళ్లపై ఎంతవరకు ప్రభావం చూపుతున్నారు?' అనే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ గతంలో ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా చాలామంది ఉద్యోగినుల కూతుళ్లు ఉన్నత విద్యార్హతలతో, మంచి ఉద్యోగం చేస్తూ, ఎక్కువ సంపాదిస్తున్నట్టు తేలింది. కాబట్టి ఇలా వర్కింగ్ మదర్స్ కెరీర్ విషయంలోనూ తమ కూతుళ్లకు మార్గదర్శకంగా నిలుస్తారని అధ్యయనాల ద్వారా నిరూపితమయింది.
బాధ్యత తెలుస్తుంది
అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ ఉద్యోగం చేసే తమ తల్లుల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి, వంట చేసి, పిల్లల్ని రెడీ చేసి, వారికి బాక్సులు సర్దడం.. ఇలా రోజూ తల్లి చేసే పనుల్ని దగ్గర్నుంచి గమనిస్తుంటారు పిల్లలు. ఇలా తల్లి చేస్తున్న వాటిలో కొన్ని పనుల్లో పిల్లలు తల్లికి చేదోడు వాదోడుగా ఉంటారు. ఇలా చిన్నతనం నుంచే ఇంటి పనులు చేయాలన్న బాధ్యత వారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఇదే పద్ధతిని అబ్బాయిలు పెండ్లయ్యాక కూడా కొనసాగించే అవకాశముంది. ఉద్యోగం చేసే భార్యకు ఇంటి పనుల్లో సహాయపడడం, పిల్లల ఆలనా పాలనా బాధ్యతల్ని భార్యతో పాటు సమానంగా పంచుకోవడం.. వంటివి చేస్తారట. ఈ విషయం కూడా పలు పరిశోధనల ద్వారా నిరూపితమైంది. హార్వర్డ్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో భాగంగా.. ఉద్యోగం చేసే తల్లిని చూస్తూ పెరిగిన కొడుకులు, తమ భార్యలకు ఇంటి పనుల్లో సహాయపడతారని, పుట్టే పిల్లల బాధ్యతల్ని చూసుకుంటారని వెల్లడైంది. ఇలా తల్లులు కొడుకులపై సానుకూల ప్రభావం చూపడం మాత్రమే కాదు ఇలాంటి పరిణామాలు లింగ సమానత్వం సాధించేందుకు సైతం దోహదం చేస్తాయి.
సమయం విలువ
ఉద్యోగం చేసే తల్లులకు ప్రతి క్షణం ఎంతో విలువైనది. ఎందుకంటే ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు బాధ్యతలతో పాటు పిల్లల బాధ్యతలు చూసుకోవడానికి కూడా సమానంగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇందులోనూ ఉద్యోగం చేసే తల్లులు సక్సెస్ సాధించడంతో తమ తల్లుల్ని చూసి వారి పిల్లలకూ క్రమశిక్షణ, సమయ పాలన అలవడతాయి.
సానుకూల ప్రభావం
ఇంట్లో ఉండి అనవసర విషయాలకు ఆందోళన చెందుతూ, తమ ఒత్తిళ్లను, చికాకును పిల్లలపై రుద్దే తల్లుల కంటే.. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఎలాంటి చీకూ చింతా లేకుండా పిల్లలతో గడిపే తల్లులే ఎక్కువగా హ్యాపీగా ఉంటారని పలు అధ్యయనాల్లో రుజువైంది. చాలామంది ఉద్యోగినుల్లో అటు ఆఫీసు పనులు, ఇటు ఇంటి పనులు, పిల్లలకు సమయాన్ని కేటాయించడం తప్ప మరే అనవసర ఆలోచనలు మదిలో మెదిలే అవకాశమే ఉండదు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే దాన్ని స్వయంగా పరిష్కరించుకోవడం లేదంటే కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడంలోనూ ఉద్యోగం చేసే తల్లులు నేర్పు ప్రదర్శిస్తుంటారు. కాబట్టి సమస్యలను ఎదిరించే నేర్పరితనం, సంతోషకరమైన వాతావరణం.. వంటివన్నీ ఉద్యోగం చేసే తల్లుల పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఓ రకంగా ఇది తల్లుల నుంచి పిల్లలు నేర్చుకునే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
ఎవరిపైనా ఆధారపడకుండా...
ఆర్థిక స్వాతంత్య్రం.. చాలామంది మహిళలు ఉద్యోగం చేయడానికి ఇది ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. మంచి చదువున్నా ఇంకా ఇతరులపై ఆధారపడడమేంటని భావించి, తమ చదువు, నైపుణ్యాలకు తగినట్టుగా ఆర్జిస్తూ ఆర్థికంగా పటిష్టంగా నిలుస్తున్నారు నేటి మహిళలు. అంతేకాదు తమ పిల్లలకు పెట్టే కొన్ని ఖర్చుల విషయంలోనూ ప్రతి దానికీ తమ భర్త ముందు చేయి చాచకుండా తామే స్వేచ్ఛగా తమ పిల్లలకు కావాల్సింది కొనిస్తున్నారు. ఇలా తల్లులు తమ కోసం చేస్తోన్న ఈ పనుల్ని, ఆర్థిక స్వేచ్ఛని దగ్గర్నుంచి గమనించే పిల్లలు చదువులో, ఆ తర్వాత వృత్తిఉద్యోగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. తద్వారా వారు ఉన్నత చదువులు చదివి తామూ ఆర్థికంగా బలంగా ఉండాలన్న తాపత్రయంతో ముందుకు సాగుతారని అధ్యయన సారాంశం. కాబట్టి ఇలా ఉద్యోగం చేసే తల్లులు తమ పిల్లలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడానికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారని అధ్యయనాల ద్వారా తేలింది.