Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్నేహితురాలిగా భావిస్తున్న వ్యక్తి నలుగురిలో ఎగతాళి చేయడం, మనకు తెలియకుండా వెన్నుపోటు పొడవడం వంటివన్నీ స్నేహం కాదంటున్నారు నిపుణులు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఎదుటివారి మనోభావాలను సైతం లెక్కచేయకుండా అవమానం కలిగేలా ప్రవర్తించే వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు. ఫలానావారు మంచి స్నేహితురాలు అని అనుకుంటున్నవారి వ్యవహారశైలిలో మార్పులు కనిపిస్తే తక్షణం వాటిని గుర్తించాలి. చదువు లేదా కెరీర్లో విజయాన్ని సాధించినప్పుడు పక్కనే నిలబడి ప్రశంసించేవారు మాత్రమే అసలైన స్నేహితులు. అలాకాకుండా దాన్ని పెద్దగా పట్టించుకోనట్టుగా నటించినవారిని మాత్రం పరిచయస్తుల పట్టిక వరకే ఉంచితే మంచిది. మరికొందరు తమకు అవసరమైనప్పుడు మాత్రమే మనల్ని గుర్తుకు తెచ్చుకుంటుంటారు. అటువంటివారిని కూడా పరిచయస్థుల్లా ఉంచుకుంటే చాలు.
- జీవితలక్ష్యాన్ని చెప్పినప్పుడు దానికి తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని చెప్పేవారు మాత్రమే మానసికంగా మనకు దగ్గరవుతారు. అలాకాకుండా అది మనవల్ల కాదని నిరుత్సాహపరిచారంటే వారిని దూరంగా ఉంచడం మంచిది. లేదంటే మన ఉత్సాహాన్ని నీరుకార్చే ప్రమాదం ఉంది. అలాగే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తోడుగా లేకుండా తప్పించుకు తిరుగుతున్నారంటే ఆ వ్యక్తులు మనకు జీవితంలో ఎప్పటికీ స్నేహితులు కాలేరు. అత్యంత ముఖ్యమైన, మీ రహస్యాలు లేదా మీకు సంబంధించిన విషయాలను స్నేహితురాలిగా భావించి చెప్పినప్పుడు వాటిని మరొకరితో పంచుకునే అమ్మాయిలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. అంతేకాదు, మన శరీర, మాటతీరును అందరిలో అవమానించేవారికి స్నేహితురాలిగానే కాదు, కనీసం పరిచయస్థురాలిగానూ స్థానం ఇవ్వకూడదు.