Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్పాహారానికి ఇడ్లీని మించినది లేదు. అయితే చాలా మంది దానికోసం ముందురోజే పప్పు నానబెట్టడం, రుబ్బడం వంటి పనులన్నీ గుర్తుకొచ్చి బద్ధకిస్తారు. ఆ శ్రమంతా లేకుండానే ఇన్స్టెంట్ మిక్స్‌లు కొనకుండానే అప్పటికప్పుడు ఇంట్లోనే తేలిగ్గా ఇడ్లీ చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం.
రవ్వ ఇడ్లీ
కావల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ - రెండున్నర కప్పులు, మజ్జిగ - నాలుగు కప్పులు, నూనె - మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, మినపప్పు - టీ స్పూను, సెనగపప్పు - టీ స్పూను, ఆవాలు - టీ స్పూను, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి) కరివేపాకు - రెండు రెబ్బలు, ఫ్రూట సాల్ట్ - టేబుల్ స్పూను.
తయారు చేసే విధానం: ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, మజ్జిగ, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు వేసి కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి. చిన్న పాన్‌లో మిగిలిన నూనె పోసి కాగాక మినపప్పు, సెనగపప్పు, ఆవాలు వేసి వేయించాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేయించి రవ్వ మిశ్రమంలో కలపాలి. ఇష్టమైతే క్యారెట్ తురుము, జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చివరగా ఫ్రూట్ సాల్ట్ వేసి దానిమీద కొద్దిగా నీళ్లు పోయాలి. బుడగలు రాగానే పిండి మిశ్రమంలో కలిసేలా మృదువుగా కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్లో సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి దించాలి.
రైస్ ఇడ్లీ
కావల్సిన పదార్థాలు: బియ్యపురవ్వ - ఒకటిన్నర కప్పులు, పలుచని అటుకులు - కప్పు, పుల్లని పెరుగు లేదా మజ్జిగ - కప్పు, బేకింగ్ సోడా - చిటికెడు, మంచినీళ్లు - తగినన్ని, ఉప్పు - రుచికి సరిపడా.
తయారు చేసే విధానం: అటుకుల్ని పెరుగులో వేసి నాలుగు నిమిషాలు నానబెట్టి గరిటెతో మెత్తగా చేయాలి. అందులోనే బియ్యపురవ్వ వేసి కొద్దిగా సోడా, ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు ఉంచాలి. అటుకులు, బియ్యపు రవ్వ, నీటి శాతాన్ని పీల్చేసుకోవడంతో గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కలిపి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి. దించేముందు ఇడ్లీలు ఉడికాయో లేదా ఓసారి వేలితో నొక్కి చూస్తే తెలిసిపోతుంది. మృదువుగా స్పాంజిలా ఉండే ఈ ఇన్స్టంట్ ఇడ్లీ రుచిగా కూడా ఉంటుంది.
ఓట్స్ ఇడ్లీ
కావల్సిన పదార్థాలు: ఓట్స్ - రెండు కప్పులు, పుల్లని పెరుగు - రెండు కప్పులు, ఆవాలు - టీస్పూను, మినపప్పు - టేబుల్ స్పూను, సెనగపప్పు - అరటేబుల్ స్పూను, నూనె - అరటీ స్పూను, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి), క్యారెట్ తురుము - రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము - టేబుల్ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, ఫ్రూట్ సాల్ట్ - చిటికెడు.
తయారు చేసే విధానం: బాణలిలో ఓట్స్ వేసి కాస్త రంగు మారేవరకు వేయించి తీయాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. చిన్న పాన్‌లో పోసి కాగాక ఆవాలు, మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము, పుసుపు వేసి ఓ నిమిషం వేగాక దించి ఓట్స్ పొడిలో కలపాలి. అందులోనే పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ మిశ్రమంలా చేయాలి. తర్వాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి.
స్టఫ్డ్ ఇడ్లీ
కావల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ - రెండు కప్పులు, పుల్లని పెరుగు - కప్పు, ఉప్పు - అరటీ స్పూను, వంటసోడా - అరటీస్పూను. ఆలూ - రెండు, బఠాణీలు - కప్పు, ఉప్పు - అర టీస్పూను, పసుపు - చిటికెడు, దనియాల పొడి - అర టీస్పూను, నూనె - రెండు టీ స్పూన్లు, ఎండుమిర్చి - రెండు, ఆవాలు - టీస్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు.
తయారు చేసే విధానం: పెరుగులో బొంబాయి రవ్వ, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చిక్కని మిశ్రమంలా కలిపి మూతపెట్టి గంటసేపు నాననివ్వాలి. ఆలూ ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా కోసి మెత్తగా చిదమాలి. బఠాణీలను కూడా ఉడికించి మెత్తగా మెదపాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత మెదిపిన బఠాణీలూ చిదిమిన ఆలూ, ఉప్పు, ఎండుమిర్చి, పసుపు, దనియాల పొడి వేసి కాగాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత మెదిపిన బఠాణీలూ చిదిమిన ఆలూ, ఉప్పు, ఎండుమిర్చి, పసుపు, దనియాల పొడి వేసి ఓ నిమిషం వేయించాలి. తర్వాత వంటసోడా వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. ఇడ్లీ ప్లేటులకు నెయ్యిరాసి ముందుగా కాస్త రవ్వ మిశ్రమాన్ని వేయాలి. దానిపైన ఆలూ మిశ్రమాని వేయాలి. ఇప్పుడు దీనిమీద మళ్లీ రవ్వ మిశ్రమాన్ని వేసి మూతపెట్టి విజిల్ వచ్చాక ఆఫ్ చేయాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీల్ని తీయాలి.