Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదివింది ఎనిమిదో తరగతి మాత్రమే. అత్యంత చిన్న వయసులోనే వివాహం జరిగింది. అయితే రాజస్థాన్‌లో పునరుత్పాదక ఇంధన విప్లవాన్ని ప్రారంభించింది. దుర్గా ఎనర్జీకి సీఈఓగా పని చేస్తుంది. సౌరశక్తిని ఉపయోగించి మహిళలకు సాధికారత కల్పిస్తుంది. ఆమే రుక్మణి దేవి కటారా. ఇదంతా ఆమెకు ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం...
ఒకప్పుడు రుక్మిణి దేవి జీవితం రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లా మండవ గ్రామంలోని ఘున్ఘట్కే పరిమితమై ఉండేది. కుటుంబ పరిస్థితుల వల్ల 13 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకోవల్సి వచ్చింది. ఆమెలోని ఆత్మ విశ్వాసం జీవితం పట్ల ఓ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని మాత్రమే కాదు ఆమె చుట్టూ ఉన్నవారిని కూడా మార్చింది. రుక్మణి ఇప్పుడు గిరిజన మహిళల యాజమాన్యంలోని సోలార్ తయారీ కంపెనీ దుర్గా ఎనర్జీకి అధిపతిగా ఉన్నారు.
సరైన వెలుతురు లేక
ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన ఒక మహిళ పేదరికం మరియు కష్టాలను అధిగమించి భారతదేశంలో పునరుత్పాదక గ్రామీణ ఇంధన విప్లవాన్ని రేకెత్తిస్తున్న కంపెనీకి ఎలా అధిపతిగా ఎదిగింది. నేషనల్ జియోగ్రాఫిక్స్ వన్ ఫర్ చేంజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ''మాకు కొన్ని పశువులు ఉన్నాయి. కానీ సంపాదన లేదు. తినడానికి తిండి లేదు. నా భర్త నిరుద్యోగి. గ్రామంలో అందరి పరిస్థితి ఇదే. ప్రధాన కేంద్రాల్లో మాత్రమే విద్యుత్తు అందుబాటులో ఉండేది. మేము కిరోసిన్ దీపాలను ఉపయోగించే వాళ్ళం. రాత్రిపూట సరైన వెలుతురు లేక గ్రామస్తులు తరచూ తేళ్లు, పాముల కాటుకు గురయ్యేవారు. చదువుకోవడానికి వెలుతురు లేకపోవడంతో పిల్లలు ఎంతో ఇబ్బంది పడేవారు'' అని గుర్తు చేసుకున్నారు.
స్వయం సహాయక గ్రూపులతో...
రాజస్థాన్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్‌కు చెందిన రాజీవిక రుక్మణి పరిచయమైన తర్వాత మార్పు వైపు ఆమె మొదటి అడుగు వేశారు. ఆమె తన గ్రామంలో స్వయం సహాయక బృందాన్ని ప్రారంభించమని రుక్మిణిని ప్రోత్సహించింది. ''రాజీవిక అందించిన నిధుల ద్వారా, స్వయం సహాయక గ్రూపులోని సభ్యులు చిన్న చిన్న వెంచర్లను సొంతంగా ఏర్పాటు చేయగలిగారు. కొందరు ఆవులు, గేదెలను కొనుక్కున్నారు. నేను గ్రామంలో కిరాణా దుకాణాన్ని ప్రారంభించాను'' అని రుక్మిణి వివరించారు.
చాలా అవసరమైన కాంతిని తీసుకొస్తూ
2016లో ఐఐటీ బాంబే ప్రారంభించిన దుంగార్పూర్ ఇనిషియేటివ్ ఆ ప్రాంతంలోని మహిళల జీవితాలను నిజంగా ఓ మలుపు తిప్పింది. ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి నేతృత్వంలో సోలార్ సహేలి దాని SoUL ప్రాజెక్ట్‌లో భాగంగా రాజీవిక అక్కడి జిల్లా పరిపాలనతో కలిసి ఈ ప్రాంతంలోని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల నుండి నాలుగు క్లస్టర్లను నిర్వహించింది. రుక్మణి వంటి మహిళలు సోలార్ ప్యానెల్స్‌ను అసెంబ్లింగ్ చేయడంలో, వాటితో కలిసి పనిచేయడంలో శిక్షణ పొందారు.
మహిళలను భాగం చేయడమే
అంత్రి, బిలాడి, ఝోంత్రి, పునాలి నుండి నాలుగు క్లస్టర్ల అధ్యక్షులు సోలార్ ప్యానెల్స్, ల్యాంప్‌ల తయారీని ప్రారంభించేందుకు ఐఐటీ బాంబేతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సంస్థ పేరు దుంగార్పూర్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (దుర్గా ఎనర్జీ). ''ఎస్‌హెచ్‌జీల నుండి మహిళలను కంపెనీలో భాగం చేయడమే దీని లక్ష్యం. వీరిని సోలార్ సహేలీలు అంటారు.
అతి తక్కువ కాలంలోనే
''నా పనిని ఇందులో ఒక ఉద్యోగిగా ప్రారంభించాను. ప్యానెల్లను ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాను. ఆ పలకలను ఏర్పాటు చేసేందుకు ఇంటింటికి వెళ్లాను. వాటిని ఎత్తులో అమర్చడానికి పొడవైన నిచ్చెనలను ఎక్కుతాను. ఈ ప్రక్రియలో అడుగడుగునా శిక్షణ పొందాను'' అని రుక్మణి చెప్పారు. అతి తక్కువ కాలంలోనే ఆమె అందులో సూపర్వైజర్గా నియమించబడింది. ఒక సంవత్సరంలోనే దుర్గా ఎనర్జీకి సీఈఓగా అయ్యారు. ''మొదట్లో గ్రామస్తులకు సౌరశక్తి గురించి చాలా ప్రశ్నలు ఉండేవి. విద్యుత్‌ను ఇలా ఎలా ఉత్పత్తి చేస్తారని వారు ఆశ్చర్యపోయారు. మేము దానిని ఒక నెల పాటు ఉపయోగించమని వారిని కోరాము. ఇది ఎంతో ఉపయోగకరమని వారికి అర్థమయింది.
ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు
ఇప్పటి వరకు 40,000 సోలార్ స్టడీ ల్యాంప్‌లను పంపిణీ చేశారు. ఐదు లక్షల సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. లక్ష టార్చ్‌లు, 50,000 లాంతర్లు తయారు చేశామని ఆమె చెప్పారు. ఇవే కాకుండా ఇంకా ఇతర మార్పులు కూడా కనిపిస్తాయి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇదెంతో సహకరించింది. ఒక్కో సోలార్ సహేలీ నెలకు దాదాపు రూ. 8,000-16,000 సంపాదిస్తుంది. రుక్మణి చెప్పిన ప్రకారం వారు ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఉన్నారు. గతంలో వలె ఇప్పుడు మాట్లాడటానికి భయపడరు. పురుషులను మాట్లాడటానికి అనుమతించారు.
వన్ ఫర్ చేంజ్‌లో భాగంగా
సంస్థ అభివృద్ధిపై రుక్మిణి దృష్టి కేంద్రీకరించారు. మహిళా బృందాలను 55 నుండి వెయ్యికి పైగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని, చివరికి దేశాన్ని కూడా తాకాలనే విశ్వాసంతో ఉన్నారు. రుక్మణి ఇప్పుడు నేషనల్ జియోగ్రాఫిక్ మిషన్ క్యాంపెయిన్ వన్ ఫర్ చేంజ్‌లో భాగం. ఇది ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి అసాధారణమైన చర్యల్లో భాగంగా తీసుకున్న మార్పు నిర్మాతల సాధారణ కథనాలను గుర్తించే షార్ట్ ఫిల్మ్‌ల శ్రేణిని ప్రదర్శిస్తుంది. వన్ ఫర్ చేంజ్‌లో భాగమైనందుకు గౌరవంగా ఉందని, సోలార్ సహేలిస్ కథ ఇప్పుడు మొత్తం ప్రపంచానికి చేరుతుందని ఆశిస్తున్నానని ఆమె చెప్పింది.
''కోశిష్ కర్నే వాలోన్ కి కభీ హర్ నహిన్ హోతీ (నిరంతరం ప్రయత్నించేవారికి ఎప్పుడూ విఫలం అనేది ఉండదు)'' అని ఆమె చెబుతూ ''మే జిద్ది హూన్ (నేను మొండిదానిని) నేను ఎప్పుడూ విఫలం కాలేదు'' అంటున్నారు.
- సలీమ