Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశపు సరికొత్త ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది మన బాక్సర్. ఒలింపిక్ బాక్సర్ మేరీ కోమ్ 2018లో చివరిసారిగా దేశానికి ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని అందించింది. ఇప్పుడు మన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ దేశం గర్వపడేలా ఐదవ మహిళా ప్రపంచ ఛాంపియన్ బాక్సర్‌గా అవతరించింది. టర్కీలోని అంటాల్యలో జరిగిన మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది మన కీర్తిని ప్రపంచస్థాయిలో నిలబెట్టింది. ఆమె సాధించిన ఈ విజయం వెనుక ఎంతో పోరాటం వుంది. లింగ వివక్షపై పోరాడేందుకే బాక్సింగ్‌ను ఎంపిక చేసుకున్న ఆమె పరిచయం మానవి పాఠకులకు ప్రత్యేకం...
నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ తన 13 సంవత్సరాల వయసులో తన తండ్రితో కలిసి అర్బన్ గేమ్స్ జరుగుతున్న స్టేడియంకి వెళ్ళింది. అక్కడ ఆమె కొన్ని బాక్సింగ్ బౌట్‌లను చూసింది. రింగ్‌లో మహిళలు ఎందుకు లేరని అమాయకంగా తన తండ్రిని అడిగింది. దానికి తండ్రి ఇచ్చిన సమాధానం 'ఇది అబ్బాయిలకు మాత్రమే సంబంధించిన క్రీడ'. ఆ సమాధానం విని ఆశ్చర్యపోయింది. అయితే బాక్సింగ్‌లో మహిళలు ఉన్నారని, మహిళలు సాధారణంగా బలహీనులుగా ఉంటారు కాబట్టి వారిని పెద్దగా ప్రోత్సహించడం లేదని, ఈ క్రీడ ఆడే సమయంలో శారీరక గాయాల ముప్పు ఉందని తండ్రి ఆమెకు చెప్పారు.
లింగ వివక్షపై పోరాడాలనే
''మహిళలు బలహీనంగా ఉంటారని, వారు బాక్సింగ్‌లో పాల్గొంటే వివాహం చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారనేది తప్పుడు భావన అని నిరూపించాలనే ఉద్దేశమే నన్ను ఈ క్రీడలో పాల్గొనేలా చేసింది' అని ఆమె గుర్తుచేసుకుంది. ఇలా ఆమె కేవలం లింగ వివక్షతో పోరాడేందుకే బాక్సింగ్‌ను ఎంపిక చేసుకుంది. చిన్నతనం నుండి అందరిచేత అల్లరి పిల్ల అనిపించుకునే నిఖత్ అల్లరి చేష్టలే ఆమెను క్రీడా ప్రపంచానికి పరిచయం చేశాయని చెప్పొచ్చు. నిఖత్ పాఠశాలలో చదివేటపుడు అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకునేది.
అల్లరిని తగ్గించాలని
కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లల్లో నిఖత్ పెద్ద కూతురు. చిన్నతనంలో ఆమె ఇంటి మీదకు ఎన్నో గొడవలు తీసుకొచ్చేది. తమతో గొడవ పడుతుందని, దొంగతనంగా వారి చెట్లు ఎక్కుతుందని తరచూ ఆమెపై ఇంట్లో ఫిర్యాదు వస్తుండేవి. ఆమె తండ్రి ఒకప్పుడు ఔత్సాహిక క్రీడాకారుడు. విపరీతంగా అల్లరి చేసే కూతురిలోని శక్తిని గ్రహించాడు. ఆమె అల్లరిని తగ్గించాలని, ఆమెలోని కొత్త శక్తిని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో తండ్రి జమీల్ అహ్మద్ కూతురితో రన్నింగ్ చేయించేవాడు. బాక్సింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకునే ముందు నిఖత్‌కు అథ్లెటిక్స్‌తో పరిచయం ఏర్పడింది. అయితే నిఖత్‌కు నిజామాబాద్ పట్టణంలో సరైన కోచ్ గానీ, క్రీడకు అవసరమైన సౌకర్యాలు గానీ ఏవీ అందుబాటులో లేవు. దాంతో తండ్రి సౌదీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి కూతురి క్రీడకు అండగా నిలబడాలని దేశానికి వచ్చేశాడు.
జీవితంలోనే మార్పు తెచ్చింది
తండ్రి తన కూతురి ప్రతి కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే ఆమెను అథ్లెటిక్స్ నుండి బాక్సింగ్ వరకు ఎదిగేలా చేసింది. అర్బన్ గేమ్ సందర్శన క్రీడలోనే కాదు జీవితంలోనే మార్పు తీసుకొచ్చింది. నిజామాబాద్ జిల్లా నుండి బాక్సర్‌గా మారిన మొదటి అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. తండ్రి తిరుగులేని మద్దతు ఆమెకు తోడయింది. అయితే మొదట్లో ఆమె బాక్సింగ్‌లోకి ప్రవేశించడం సవాళ్లతో కూడుకుంది.
నాన్నను ప్రశ్నించారు
''బాక్సర్ కావడానికి శిక్షణ పొందిన వారిలో నా జిల్లా నుండి నేను మొదటి అమ్మాయిని. నేను అబ్బాయిలతో శిక్షణ పొందాను. శిక్షణలో భాగంగా వాళ్ళతో ఎన్నో దెబ్బలు తిన్నాను. అకస్మాత్తుగా అందరి చూపు నాపై పడింది. ఇలా దెబ్బలు తింటూ గాయపడే ఆటకు నన్ను ఎందుకు అనుమతించారని మా బంధువులు, స్నేహితులు ఎన్నో సార్లు నాన్నను ప్రశ్నించారు. వారి ఉద్దేశంలో నేను క్రీడల కోటలో ఉద్యోగం సంపాదించి హాయిగా ఉండాలి. లేదంటే నన్ను పెండ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు అని వారి భావన'' ఆమె చెప్పింది.
వారి మాటలు ప్రభావితం చేయలేదు...
''మా మత సంఘం నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి. ఒక ముస్లిం మహిళ పర్దాలో ఉండాలని నాతో చెప్పేవారు. పర్దాలో ఉంటే నేను పొట్టి బట్టలు వేసుకుని బాక్సింగ్ ఎలా అడగలను? వాళ్ళను అడిగాను. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే వాళ్ళ మాటలేవి నన్ను గానీ, మా నాన్నను గానీ ప్రభావితం చేయలేకపోయాయి. బాక్సింగ్‌పై దృష్టిపెట్టి కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. బాక్సింగ్‌ని ఎంచుకునపుడు నన్ను వ్యతిరేకించిన వ్యక్తులే పతకాలు సాధించినప్పుడు ఫొటోలు, సెల్ఫీలు అడుగుతూ మళ్ళీ నా దగ్గరకు తిరిగి వచ్చేవారు'' అని ఆమె జతచేస్తుంది.
ఒక్క ఏడాదిలోనే...
క్రీడలోకి ప్రవేశించిన ఒక సంవత్సరంలోనే అంటే 2010లో నిఖత్ జూనియర్ నేషనల్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. 2011లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. అలాగే టర్కీలో జరిగిన AIBA మహిళల జూనియర్, యూత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫ్లైవెయిట్ విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకుంది. నిఖత్ హోమ్ ఫేవరెట్ టర్కిష్ బాక్సర్ ఉల్కు డెమిర్‌తో తలపడింది. అంతే కాదు 2019లో స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణం సాధించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన 73వ స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో ఒలింపిక్ రజత పతక విజేత బుసెనాజ్ కాకిరోగ్లుపై అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన టెటియానా కోబ్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. ప్రతి విజయం నిఖత్‌కు సంతోషకరమైన క్షణం. ''నేను పోడియంపైకి ఎక్కేటప్పుడు భారత జెండా ఎత్తుగా ఎగురవేయడం, జాతీయ గీతం ప్లే చేయబడటం ఎంతో అద్భుతంగా అనిపించేవి' అని ఆమె చెప్పింది.
మనం అనుకున్నట్టుగా మనం
2017లో నిఖత్ భుజం కాస్త దెబ్బతిన్నది. దాంతో ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందలేకపోయింది. ''నేను ఇంత పెద్ద గాయాన్ని తట్టుకోలేకపోయాను. నా శిక్షణను కోల్పోతున్నాను. కానీ ఈ దశ నాకు మానసికంగా దృఢంగా ఉండడం నేర్పింది. నాకు కౌన్సెలింగ్ ఇచ్చిన సైకాలజిస్ట్ నన్ను సానుకూలం వైపు చూడమని ప్రోత్సహించారు. పోడియంపై నిలబడి ఒలింపిక్ పతకాన్ని అందుకోవడం, నేను ఏమి సాధించాలనుకుంటున్నానో దానిని ఊహించుకోమని ఆమె నాకు చెప్పారు. మనం అనుకున్నట్టుగా మనం అవుతామని నేను నమ్ముతున్నాను'' అని ఆమె చెప్పింది.
ఒక్కో అడుగు వేస్తున్నా
లాక్డౌన్ సమయంలో వృత్తిపరమైన శిక్షణకు ఎటువంటి ఆధారం లేక నిఖత్ వెల్స్పన్ సూపర్ స్పోర్ట్ ఉమెన్ ప్రోగ్రామ్ (WSSW) నుండి సహాయం కోరింది. ఇది ఆమెకు జాతీయ ఛాంపియన్‌షిప్‌లు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడింది. కష్ట సమయంలో సంస్థ అందించిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించిన ఆమె పారిస్ 2024లో పారిస్‌లో జరగబోయే క్రీడలపై దృష్టి పెట్టింది. ''నేను నా జీవితాన్ని క్రీడల వైపు ఒక్కో అడుగు వేయిస్తున్నాను'' అని నిఖత్ చెప్పింది.
మా బాక్సర్లు మాకు గర్వకారణం
''జరీన నిఖత్‌కు అభినందనలు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. స్వర్ణ పతక విజేతగా నిలిచారు. ఇదే పోటీలో కాంస్య పతకాలను సాధించిన మనీషా మౌన్ పర్వీన్ హుడాలను కూడా నేను అభినందిస్తున్నాను'' అంటూ ప్రధాని మోడీ ట్విట్ చేశారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర నాయకులు, ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ట్విట్టర్‌లో ట్రెండ్ సృష్టించాలని
నిఖత్ మరొక కల ఏమిటంటే ట్విట్టర్‌లో తన పేరు ఓ ట్రెండ్‌ను సృష్టించాలి. ప్రపంచ ఛాంపియన్ బాక్సర్‌గా ఉద్భవించిన వెంటనే తన కలను సులభంగా నిజం చేసుకోగలిగింది. ''నేను నిజంగా ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నానా? ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం నా కలలలో ఒకటి. నేను అక్కడ ట్రెండింగ్‌లో ఉండి ఉంటే నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను'' అని ఆమె తన విజయాన్ని పోస్ట్ చేస్తూ ఆనందంతో ఊపిరి పీల్చుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన ఈ బాక్సర్ ఇప్పుడు పారిస్ 2024కి సిద్ధమవుతుంది.
- సలీమ