Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయాన్నే లేవడం.. పనులన్నీ హడావిడిగా చకచకా చక్కబెట్టుకోవడం.. మరుసటి రోజుటి పనుల ఆలోచనతో పడక మీదకి చేరడం. ఇలా హడావుడిగా సాగితే ఇక ప్రశాంతత ఎక్కడిది? శారీరక ఆరోగ్యంలో భాగంగా కొన్ని పనులు తప్పక చేస్తాం కదా! అలానే మానసిక ఆరోగ్యానికీ రోజూ 15 నిమిషాలు కేటాయించమంటున్నారు నిపుణులు.
ఆ సమయంలో.. రోజుకో కొత్త అంశాన్ని ప్రయత్నించండి. ఆరుబయట కూర్చొని కాఫీ తాగడం, చిన్న చిన్న వ్యాయామాలు, నచ్చిన కథ చదవడం.. ఇలా దేన్నైనా ఎంచుకోవచ్చు. అయితే అది హడావుడిగా కాక ప్రశాంతంగా చేసేదవ్వాలి. ఆ పదిహేను నిమిషాలూ మీ సొంతం. వేరే పనుల ఆలోచనొద్దు. ముందుగా అనుకొని కాక... ఆ నిమిషంలో ఏది చేయాలనిపిస్తే అది చేసెయ్యండి.
ఆ సమయం అయ్యాక ఎలా అనిపించిందో ఓ పుస్తకంలో రాయండి. ఆ రోజంతా ఎలా ఉండాలని అనుకుంటున్నదీ దానికి చేర్చండి. రోజు పూర్తయ్యాక ఎలా గడిచిందన్న దాన్నీ రాయండి. డైరీలాగే! కాకపోతే.. భావోద్వేగాల గురించే చేర్చాలి. ఇది మనసుకు సానుకూల ఆలోచనలు వెళ్లేలా ప్రేరేపిస్తుంది. మీరోజు ఎలా సాగాలని ఆశిస్తున్నారన్న దానిపై స్పష్టత రావడమే కాదు.. అందుకు ఏం చేయాలన్న అవగాహనా వస్తుంది. ఉదాహరణకు ఆరోజు అస్సలు బాగా గడవలేదూ.. దాన్నే రాయండి. ఏది నచ్చట్లేదన్నది తెలిసినా మంచిదే. ఆ పనులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయొయచ్చు.
ఆ రోజంతా మీటింగ్‌లే.. డల్‌గా కనిపించడానికి లేదు. పూల మధ్య గడిపితే సంతోషంగా అనిపిస్తుంది.. అదే చేయండి. లేదూ.. ఆరోజు సబ్మిట్ చేయాల్సిన పనుంది. ప్రతి నిమిషమూ అమూల్యమే. ఒత్తిడికి గురైతే తప్పుల ప్రమాదం. అలాంటప్పుడు యోగా లాంటివి ప్రయత్నిస్తే సరి. ఇలా ఆరోజు షెడ్యూల్‌ని బట్టి.. దానికి తగ్గట్టుగా మార్పు చేసుకుంటూ వెళ్లండి.
వారం చివర్లో ఆ వారమంతా ఎలా గడిచిందో సమీక్ష చేసుకోండి. కొద్దిరోజులయ్యాక మీ మానసిక స్థితిపై పట్టు రావడాన్ని మీరే గమనిస్తారు. అంతేకాదు పరిస్థితిని బట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏం చేయాలన్న దానిపై మీకే స్పష్టత వస్తుంది.